ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు | All 6 daughters become doctors, school dropout woman tells her life story | Sakshi
Sakshi News home page

ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు

Published Sun, Oct 24 2021 12:10 AM | Last Updated on Sun, Oct 24 2021 4:55 AM

All 6 daughters become doctors, school dropout woman tells her life story  - Sakshi

ఆ తల్లి ఏమీ చదువుకోలేదు. ఆ తండ్రీ మామూలు తండ్రే. కాని కూతురు పుట్టడం శుభసూచకం అని తెలిసేంత తెలివి వారికుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది కుమార్తెలు పుట్టారు. ఆడపిల్లకు చదువుకు మించిన ధైర్యం లేదని ఆ తల్లిదండ్రులు వారిని చదివించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఆరుగురూ డాక్టర్లు అయ్యారు. ఆడపిల్ల విషయంలో పాతకాలపు భావాలున్న వారికి వీరి వైద్యం తప్పనిసరి కదూ.

‘నేను వరుసపెట్టి ఆడపిల్లలను కంటుంటే ఊళ్లో అందరికీ కంగారే. ఆ పిల్లల పరిస్థితి ఏం కాను. వాళ్ల పెళ్లిళ్లు ఎలా కాను అని. పెళ్ళిళ్లేమిటి... వాళ్లు ముందు చదువుకోవాలి కదా’ అంటుంది ఆరుగురు కుమార్తెలను కని, వారిని డాక్టర్లను చేసిన జైనా. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడటానికి భర్త ఉంటే బాగుండునని ఆమె అనుకుంటుంది గాని ఆయన మరణించి ఆరేడేళ్లు అయిపోతోంది. అతని పేరు అహమద్‌. వారిది కోజికోడ్‌ జిల్లాలోని నాదపురం అనే చిన్న పల్లె.

‘నాకు పన్నెండు పెళ్లయ్యేటప్పటికి. ఐదో క్లాసుకే చదువు మాన్పించి ఇంట్లో కూచోబెట్టి పెళ్లి చేశారు. మా ఆయన నాకు బంధువే. అతను మద్రాసులో ఉద్యోగం చేసేవాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఆ తర్వాత సంసారంలో పడ్డాను. మద్రాసు నుంచి మేము కతార్‌ వెళ్లాం. అక్కడ నా భర్త ఒక ఆయిల్‌ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే మా ఆరుమంది అమ్మాయిలు చదువుకున్నారు’ అంటుంది జైనా.

అహమద్‌కు డాక్టర్‌ కావాలని ఉండేదట. కాని కాలేకపోయాడు. తమ్ముణ్ణి చేద్దామని అనుకుంటే ఆ తమ్ముడు టీచర్‌ అయ్యాడు. పిల్లలు డాక్టర్లు అయితే చూడాలనుకున్నాడు. జైనా కూడా అదే చెప్పింది. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. పిల్లల్ని ఇద్దరం చదివిద్దాం’ అంది. ఇక అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు తమ ప్రతి పైసా పిల్లల చదువుకు ఉపయోగించేవారు.

‘సాయంత్రం స్కూళ్లు అయ్యి పిల్లలు ఆడుకునే మూడ్‌లో ఉంటే పిలిచి ఒకటే మాట చెప్పేదాన్ని– మీరంతా బాగా చదువుకోవాలి. అందులో రాజీ లేదు అని’ అంటుంది జైనా. ఇంకో సంగతి ఏమిటంటే ఆ ఆరుమంది ఆడపిల్లలను కన్న అహమద్‌కు లోకజ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ. నా పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి అని రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా వారికి చదువు మీదే కాక జనరల్‌ నాలెడ్జ్‌లో కూడా పరిణితి ఉండేలా చేశాడు.

ఆరుమంది ఆడపిల్లల్లో ఇప్పుడు డాక్టర్‌ ఫాతిమా అహమద్‌ (39), హాజరా అహమద్‌ (33), ఆయిషా అహమద్‌ (30), ఫైజా అహమద్‌ (28) ఇప్పటికే వైద్యులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. రీహానా అహమద్‌ (23) ఫైనలియర్‌ ఎంబిబిఎస్‌ చేస్తోంది. అమీరా అహమద్‌(19) మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌లో ఉంది. ‘మొదట నేను మెడిసిన్‌ చేశాను. అదేం పెద్ద విషయం కాదని నా చెల్లెళ్లకు చెప్పాను. వారు వరుస అందుకున్నారు’ అంటుంది పెద్ద కూతురు ఫాతిమా అహమద్‌. ఈమె అబూదాబిలోని మిలట్రీ హాస్పిటల్‌లో పని చేస్తోంది.

‘కతర్‌ నుంచి మేము ఇండియాకు తిరిగొచ్చేసి రెండేళ్లు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాం. నా భర్తకు అంత అదృష్టమే ఉంది. ఆయన హార్ట్‌ ఎటాక్‌తో పోయారు’ అంది జైనా. అయితే భర్త చనిపోయినా ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. మిగిలిన కూతుళ్లను మెడిసిన్‌ చదివించాల్సిందే అనుకుంది. ‘నా మూడో కుమార్తె మాత్రం లా చేయాలని అనుకుంది. లా చేస్తే నీ భర్త ప్రాక్టీసు చేయించొచ్చు. మాన్పించవచ్చు. కాని మెడిసిన్‌ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్‌ చేయించే అవకాశం ఉంది. డాక్టర్‌ని ఎవరు ఖాళీ పెడతారు అని సలహా ఇచ్చేసరికి మెడిసిన్‌ చేసింది’ అంది జైనా.

ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. ఇంకో విషయం డాక్టర్లకే ఇచ్చి చేస్తే ఇద్దరూ ఒకే రంగం కనుక ఒకరి సాధక బాధకాలు తెలుస్తాయని కూడా అనుకుంది. ఇప్పటికి పెళ్లయిన నలుగురి భర్తలూ డాక్టర్లే.

పండక్కి పబ్బానికి అందరూ కలిస్తే తన ఆరుగురు కూతుళ్లను చూసుకుని ఆ తల్లి గుండె పొంగిపోతుంది. ‘నా పిల్లలు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని గర్వంగా ఇరుగు పొరుగు వారితో అంటుంది. కాకుంటే ఒకటే లోటు. ఆ ఆరుగురు ఆడపిల్లలు తండ్రితో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు.

‘ఏం పర్వాలేదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు’ అంటారా ఆడపిల్లలు. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కంటే కూతుర్నే కనాలి అని వీరు చెబుతున్నారు. అందరూ వినాల్సిన మాటే కదా అది.
 
ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement