‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్‌ డాటర్స్‌..! | Siddipet Ramachandram Who Made Daughters Doctors By Doing tailoring | Sakshi
Sakshi News home page

‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్‌ డాటర్స్‌..!

Published Sun, Oct 13 2024 11:01 AM | Last Updated on Sun, Oct 13 2024 11:07 AM

Siddipet Ramachandram Who Made Daughters Doctors By Doing tailoring

కుటుంబంలో ఒకరు డాక్టర్‌ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే! టైలరింగ్‌ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం – శారద దంపతులు. వారి కలలు నిజమై ఇప్పుడు ఆ ఇల్లే వైద్యుల నిలయంగా మారి΄ోయింది.  

సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్‌), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం – శారద టైలరింగ్‌ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తిచేయగా, మరొకరు ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్‌లో సీట్లు సాధించారు. ‘నలుగురు కూతుళ్లేనా..’ అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.

ఒక్కరైనా డాక్టర్‌ కావాలని..
రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్‌తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్‌తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించక΄ోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని...  కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్‌ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్ల లో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.

చదువులోనూ కవలలే..
రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్‌ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రై వేట్‌ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాక΄ోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్‌టర్మ్‌ శిక్షణతో ప్రిపేర్‌ అయ్యారు. దీంతో 2024 నీట్‌లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేదగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్‌ కళాశాలలో సీట్లు తీసుకున్నారు. 

నాన్న కల నాకు లక్ష్యమైంది
డాక్టర్‌ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018–2024లో ఎంబీబీఎస్‌ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్‌ లేదా జనరల్‌ మెడిసిన్‌ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు. 
– డాక్టర్‌ మమత, ఎంబీబీఎస్‌(7009)

అక్క చూపిన దారి
ఇంటర్‌మీడియెట్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్‌ చదవలేనేమో అని, డిప్రెషన్‌కు లోనయ్యాను. హైదరాబాద్‌లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్‌ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.
– మాధురి, ఎంబీబీఎస్‌, ఫైనల్‌ ఇయర్‌(7012)

మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్‌ మోడల్‌. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్‌ ఇచ్చారు. 
– రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం(7011)

నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్‌లో చదివిస్తున్నామని చాలామంది సూటి;yటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్‌ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్‌ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చి΄ోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుంది.
– రామచంద్రం, శారద 

– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట
ఫోటోలు: కె సతీష్,
ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604 ను 
సంప్రదించవచ్చు. 

(చదవండి: సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement