kozhikode
-
ఎంబీబీఎస్ పూర్తి చేయని వైద్యుడితో చికిత్స.. హార్ట్ పేషెంట్ మృతి
కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్‌కు తెలిసింది. 2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారుఅయితే ఆర్ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్‌ను అబూ అబ్రహం లూక్గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్‌ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్మెంట్తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్మెంట్లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు. -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
Ankola Landslide: ఐదు రోజులుగా గాలింపు.. అర్జున్ ఆచూకీ దొరికేనా!
దేశ వ్యాప్తంగా వనలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో వరదలు ముంచెత్తున్నాయి భారీ వర్షాలతో అక్కడక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. భవనాలు కూలుతున్నాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సైతం వాటిల్లుతోంది. దీంతో పలు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.తాజాగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో నాలుగు రోజుల క్రితం అంకోలా తాలుకాలోని షిరూర్‌లో వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జూలై 16న 500 మీటర్ల ఎత్తు నుంచి ఓ కొండ షిరూర్ జాతీయ రహదారి మీద పడటంతో.. పక్కనే టీ దుకాణం వద్ద ఉన్న దాదాపు 10 మంది గల్లంతయ్యారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను గురువారం వెలికి తీయగా... మరో ముగ్గురి ఆచూకి తెలియాల్సి ఉంది.భారీ మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ అర్జున్ మూలడికుజియిల్ కూడా ఉన్నాడు. కన్నడిక్కల్కు చెందిన అర్జున్ (30) ట్రక్కులో కలపను ఎక్కించుకుని జగల్‌పేట నుంచి కోజికోడ్‌కు వెళ్లాడు. షిరూర్లోని ఓ హోటల్లో టీ తాగేందుకు ఆగి ప్రమాదానికి గురయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో అతనితోపాటు ట్రక్కు కనిపించకుండా పోయాయి.విషయం తెలుసుకున్న అర్జున్ కుటుంబం కేరళ సీఎం పినరయి విజయన్ను సంప్రదించడంతో ఆయన స్పందించి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. అర్జున్ను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అర్జున్ ఆచూకీ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ లాంటి వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసేందుకు కోజికోడ్ కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్‌ను నియమించారు.అర్జున్‌తోపాటు తప్పిపోయిన మరో ఇద్దరి కోసం గత అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారిపై ఉన్న మట్టిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం, ఇండియన్ నేవీ కృషి చేస్తున్నాయని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. అయితే ఎత్తైన భూఘాగం, భారీ వర్షాలు, పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి శనివారం ఉదయం తిరిగి ప్రారంభించారు.తాము చేరుకోలేని ప్రాంతాలలో శిథిలాల మధ్య, జాతీయ రహదారి పక్కనే ఉన్న నదిలో మృతదేహాలను వెతకడానికి హెలికాప్టర్‌తో సహాయం చేయమని కోస్ట్ గార్డ్‌కు లేఖ రాసినట్లు ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ లక్ష్మిప్రియా తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయం అసాధ్యంగా మారిందని చెప్పారు. కొన్ని రోజులుగా అర్జున్ ఆచూకీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అర్జున్ నడుపుతున్న లారీ జీపీఎస్ సిగ్నల్ చివరగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశం నుంచే అందుతుందని తెలిపారు.అర్జున్ కోసం ఆశగా..మరోవైపు అర్జున్ ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆయన భార్య కృష్ణప్రియ, తండ్రి ప్రేమన్, తల్లి షీలాతో పాటు బంధువులంతా ఆశగా ఎదురు చేస్తున్నారు. అధికారులు ఎలాగైనా తన తప్పుడిని కాపాడాలని, ఏదో అద్భుతం జరుగుతందనే నమ్మకం ఉందని అతడి సోదరి అంజు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అర్జున్ లాంగ్ ట్రిప్‌లకు వెళ్లిన ప్రతిసారీ మాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. నేను జూలై 16న చివరిసారి అతనితో మాట్లాడాను.మరుసటి రోజు నుండి అతనిని సంప్రదించలేకపోయాను.. శుక్రవారం ఉదయం డయల్ చేసినప్పుడు అర్జున్ రెండో మొబైల్ ఫోన్ రింగ్ అయింది’అని ఆయన భార్య కృష్ణప్రియ తెలిపారు.అయితే ప్రస్తుతం అర్జున్ కుటుంబం ప్రమాదంజరిగిన షిరూర్‌లో ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగడం లేదని ఆరోపించారు. పలు వాహనాలు బురదలో కూరుకుపోయినా అధికారులు కేవలం రెండు ఎర్త్ మూవర్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. కేరళ సీఎం, మంత్రులు, కేరళ-కర్ణాటక అధికారులు జోక్యం చేసుకోవడంతో నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెబుతున్నారు.కాగా కోజికోడ్‌లోని కినాస్సేరిలో అర్జున్ ఎనిమిదేళ్లుగాముక్కాంకు చెందిన ఓ వ్యాపారి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా అంతర్ రాష్ట్ర పర్యటనలకు వెళ్లేవాడు. అతను కలపను లోడ్ చేయడానికి క్రమం తప్పకుండా బెలగావికి వెళ్లేవాడు, రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేవాడు. అయిదుగురు సభ్యుల కుటుంబానికి అర్జున్ ఒక్కడే సంపాదకుడు. -
తొలి సాహిత్య నగరం కోజికోడ్.. యునెస్కో గుర్తింపు
దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్‌ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. అక్టోబర్ 2023లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ (యూసీసీఎన్)కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.కేరళలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్.. కోజికోడ్ సాధించిన విజయాన్ని ప్రకటించారు. కోల్‌కతా వంటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన నగరాలను పక్కకునెట్టి, యునెస్కో నుండి కోజికోడ్ ‘సిటీ ఆఫ్ లిటరేచర్’ బిరుదును దక్కించుకుందని మంత్రి తెలిపారు.కోజికోడ్‌లో 500కుపైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్‌లో ఉంటూ సాహిత్యరంగానికి ఎనలేని సేవలు అందించారు. యూసీసీఎన్‌లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా, కోజికోడ్ సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.యునెస్కో నుండి ఈ ఘనతను అందుకున్న ఇతర నగరాల్లో బుఖారా ‘క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్’ విభాగంలో, కాసాబ్లాంకా ‘మీడియా ఆర్ట్స్’ విభాగంలో, చాంగ్కింగ్ డిజైన్ విభాగంలో, ఖాట్మండు ఫిల్మ్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
నిందితుడి సమాచారం లీక్.. కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్
కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ విజయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది .కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడి అరెస్ట్, తరలింపు సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై విజయన్‌పై కేరళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా విజయన్ గతంలో కేరళ ఏటీఎస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. నిందితుడి తరలింపుకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని పేర్కొంటూ లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీపీ అజిత్ కుమార్ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ రిపోర్టులో నిందితుడు షారుక్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కేరళలోని కోజీకోడ్‌కు తరలిస్తున్న సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు తేలింది. అదే విధంగా ఈ కేసును దర్యాప్తుచేసిన బృందంలో లేని ఐజీ విజయన్, గ్రేడ్ ఎస్సై మనోజ్ కుమార్ కే.. నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకెళ్తున్న అధికారులను సంప్రదించినట్లు పేర్కొంది. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు విజయం.. ‘రాణాను అప్పగించండి’ పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ..ఏడీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై సమగ్ర విచారణ అవసరమని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది.ఏడీజీపీ నివేదిక ఆధారంగా దాని అధికారులపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది.ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్ను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) కె పద్మకుమార్ విచారణ జరుపుతారని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ జిల్లాలోని ఎలత్తూర్ సమీపంలోని కోరాపుళ వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఏడాది చిన్నారి సహా మహిళ వ్యక్తి ఉన్నారు. ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ పోలీసులు సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని సిట్ విచారణలో గుర్తించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు సైఫ్‌ను రత్నగిరిలో ఏప్రిల్ 5న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా కేరళకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. మీడియా, ప్రజల దృష్టి పడకుండా రోడ్డు మార్గాన ప్రైవేటు ఎస్‌యూవీలో తరలించారు. అయితే కన్నూరు జిల్లా గుండా వెళ్లుండగా ఉన్నట్టుండి నిందితుడిని తీసుకెళ్తున్న కారు టైర్ పేలడంతో వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయింది. ఆ సమయంలో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా నిందితుడిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు. చదవండి:రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి.. -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు.. మహిళలు రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తే..
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది. అసలేం జరిగిందంటే..ఈ ఏడాది ఫిబ్రవరి 8న కోజికోడ్ జిల్లాలోని నంది బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కవితా శిబిరంలో చంద్రన్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా తన చేయి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని ఆరోపించింది. అక్కడ తన ఒళ్లో కూర్చోవాలని అడిగాడని, ఛాతీ నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత కూడా తనకు పదే పదే ఫోన్లు చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదులో చంద్రన్‌పై 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఈ కేసుపై కోజికోడ్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. నిందితుడు బెయిల్ దరఖాస్తుతోపాటు అందజేసిన ఫోటోగ్రాఫ్స్‌ను పరిశీలిస్తే యువతి(బాధితురాలు) ఆ సమయంలో కావాలనే లైంగికంగా ప్రేరేపించే దుస్తులను ధరించినట్లు ఉందని అన్నారు. సెక్షన్ 354ఏ ప్రకారం అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే ఈ కేసు నిలబడదన్న జడ్జి.. 74 ఏళ్ల దివ్యాంగుడైన చంద్రన్ యువతిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఛాతిని నొక్కాడనే అరోపణలు నమ్మేలా లేవని తోసిపుచ్చారు. కాబట్టి నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
కేరళలో మరోసారి షిగెల్లా కేసు.. ప్రాథమిక లక్షణాలు ఇవే!
తిరువనంతపురం: కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రాథమిక లక్షణాలు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చదవండి👇🏿 భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! -
జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్ నిర్దోషులు
కొచ్చి: కోజికోడ్ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోజికోడ్ కేఎస్ఆర్టీసీ, మొఫుసిల్ బస్టాండ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి. 2011లో ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. నజీర్, షఫాస్ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్ దాఖలు చేసిన అప్పీలును కేరళ హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తుదితీర్పు వెల్లడించింది. ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
పరుగుల రాణి పీటీ ఉషపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు
తిరువనంతపురం: భారత దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదైంది. కేరళలోని కోజికోడ్ పోలీసులు పి.టి ఉషపై చీటింగ్ కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ చేసిన ఫిర్యాదు మేరకు ఉష సహా మరో ఆరుగురిపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిటి ఉష హామీతో.. జెమ్మా జోసెఫ్ కేరళలోని కొజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. అందుకోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 లక్షలు చెల్లించారు. సొమ్ము చెల్లించినా బిల్డర్ ఫ్లాట్‌ను జోసెఫ్‌కు రాసివ్వలేదు. దీంతో జోసెఫ్ కోజికోడ్ పోలీసులను ఆశ్రయించారు. పిటి ఉష హామీ మేరకే బిల్డర్‌కు డబ్బులు చెల్లించానని అయితే బిల్డర్ ఫ్లాట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. జోసెఫ్ ఫిర్యాదుపై కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. చదవండి: (ఒమిక్రాన్ సోకిన మహిళ తండ్రికి కరోనా పాజిటివ్) -
ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
ఆ తల్లి ఏమీ చదువుకోలేదు. ఆ తండ్రీ మామూలు తండ్రే. కాని కూతురు పుట్టడం శుభసూచకం అని తెలిసేంత తెలివి వారికుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది కుమార్తెలు పుట్టారు. ఆడపిల్లకు చదువుకు మించిన ధైర్యం లేదని ఆ తల్లిదండ్రులు వారిని చదివించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఆరుగురూ డాక్టర్లు అయ్యారు. ఆడపిల్ల విషయంలో పాతకాలపు భావాలున్న వారికి వీరి వైద్యం తప్పనిసరి కదూ. ‘నేను వరుసపెట్టి ఆడపిల్లలను కంటుంటే ఊళ్లో అందరికీ కంగారే. ఆ పిల్లల పరిస్థితి ఏం కాను. వాళ్ల పెళ్లిళ్లు ఎలా కాను అని. పెళ్ళిళ్లేమిటి... వాళ్లు ముందు చదువుకోవాలి కదా’ అంటుంది ఆరుగురు కుమార్తెలను కని, వారిని డాక్టర్లను చేసిన జైనా. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడటానికి భర్త ఉంటే బాగుండునని ఆమె అనుకుంటుంది గాని ఆయన మరణించి ఆరేడేళ్లు అయిపోతోంది. అతని పేరు అహమద్. వారిది కోజికోడ్ జిల్లాలోని నాదపురం అనే చిన్న పల్లె. ‘నాకు పన్నెండు పెళ్లయ్యేటప్పటికి. ఐదో క్లాసుకే చదువు మాన్పించి ఇంట్లో కూచోబెట్టి పెళ్లి చేశారు. మా ఆయన నాకు బంధువే. అతను మద్రాసులో ఉద్యోగం చేసేవాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఆ తర్వాత సంసారంలో పడ్డాను. మద్రాసు నుంచి మేము కతార్ వెళ్లాం. అక్కడ నా భర్త ఒక ఆయిల్ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే మా ఆరుమంది అమ్మాయిలు చదువుకున్నారు’ అంటుంది జైనా. అహమద్‌కు డాక్టర్ కావాలని ఉండేదట. కాని కాలేకపోయాడు. తమ్ముణ్ణి చేద్దామని అనుకుంటే ఆ తమ్ముడు టీచర్ అయ్యాడు. పిల్లలు డాక్టర్లు అయితే చూడాలనుకున్నాడు. జైనా కూడా అదే చెప్పింది. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. పిల్లల్ని ఇద్దరం చదివిద్దాం’ అంది. ఇక అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు తమ ప్రతి పైసా పిల్లల చదువుకు ఉపయోగించేవారు. ‘సాయంత్రం స్కూళ్లు అయ్యి పిల్లలు ఆడుకునే మూడ్‌లో ఉంటే పిలిచి ఒకటే మాట చెప్పేదాన్ని– మీరంతా బాగా చదువుకోవాలి. అందులో రాజీ లేదు అని’ అంటుంది జైనా. ఇంకో సంగతి ఏమిటంటే ఆ ఆరుమంది ఆడపిల్లలను కన్న అహమద్‌కు లోకజ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ. నా పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి అని రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా వారికి చదువు మీదే కాక జనరల్ నాలెడ్జ్‌లో కూడా పరిణితి ఉండేలా చేశాడు. ఆరుమంది ఆడపిల్లల్లో ఇప్పుడు డాక్టర్ ఫాతిమా అహమద్ (39), హాజరా అహమద్ (33), ఆయిషా అహమద్ (30), ఫైజా అహమద్ (28) ఇప్పటికే వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రీహానా అహమద్ (23) ఫైనలియర్ ఎంబిబిఎస్ చేస్తోంది. అమీరా అహమద్(19) మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌లో ఉంది. ‘మొదట నేను మెడిసిన్ చేశాను. అదేం పెద్ద విషయం కాదని నా చెల్లెళ్లకు చెప్పాను. వారు వరుస అందుకున్నారు’ అంటుంది పెద్ద కూతురు ఫాతిమా అహమద్. ఈమె అబూదాబిలోని మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తోంది. ‘కతర్ నుంచి మేము ఇండియాకు తిరిగొచ్చేసి రెండేళ్లు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాం. నా భర్తకు అంత అదృష్టమే ఉంది. ఆయన హార్ట్ ఎటాక్‌తో పోయారు’ అంది జైనా. అయితే భర్త చనిపోయినా ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. మిగిలిన కూతుళ్లను మెడిసిన్ చదివించాల్సిందే అనుకుంది. ‘నా మూడో కుమార్తె మాత్రం లా చేయాలని అనుకుంది. లా చేస్తే నీ భర్త ప్రాక్టీసు చేయించొచ్చు. మాన్పించవచ్చు. కాని మెడిసిన్ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉంది. డాక్టర్ని ఎవరు ఖాళీ పెడతారు అని సలహా ఇచ్చేసరికి మెడిసిన్ చేసింది’ అంది జైనా. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. ఇంకో విషయం డాక్టర్లకే ఇచ్చి చేస్తే ఇద్దరూ ఒకే రంగం కనుక ఒకరి సాధక బాధకాలు తెలుస్తాయని కూడా అనుకుంది. ఇప్పటికి పెళ్లయిన నలుగురి భర్తలూ డాక్టర్లే. పండక్కి పబ్బానికి అందరూ కలిస్తే తన ఆరుగురు కూతుళ్లను చూసుకుని ఆ తల్లి గుండె పొంగిపోతుంది. ‘నా పిల్లలు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని గర్వంగా ఇరుగు పొరుగు వారితో అంటుంది. కాకుంటే ఒకటే లోటు. ఆ ఆరుగురు ఆడపిల్లలు తండ్రితో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు. ‘ఏం పర్వాలేదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు’ అంటారా ఆడపిల్లలు. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కంటే కూతుర్నే కనాలి అని వీరు చెబుతున్నారు. అందరూ వినాల్సిన మాటే కదా అది. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. -
కేరళలో నిఫా కలకలం:రాష్ట్రానికి హుటాహుటిన తరలివెళ్లిన కేంద్ర బృందం
-
కేరళలో నిఫా కలకలం
కోజికోడ్: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్ బయటపడింది. నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది. బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించాం. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్ ఉన్న 20 మందిని కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచాం. వీరిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్ జాడలు బయటపడ్డాయి’అని ఆమె వివరించారు. ‘కోజికోడ్ మెడికల్ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశాం. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించాం’అని మంత్రి తెలిపారు. ‘ఇక్కడే నిఫా వైరస్ నిర్థారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని పుణె ఎన్ఐవీ అధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. కాగా, దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్ బారినపడిన 17 మంది చనిపోయారు. ఏమిటీ నిఫా..! ఇది›జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. లక్షణాలేమిటి? ► బ్రెయిన్ ఫీవర్ ► తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. ► ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ► ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వ రం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం. ► కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం ► 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది. ► మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు. గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్–టైమ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ–పీసీఆర్) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్ ఐసోలేషన్ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు. మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది? నిఫా వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి. చికిత్స ఉందా?: నిఫా వైరస్ బాధితులకు ప్రస్తుతానికి నిరి్ధష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్ డ్రగ్ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు. -
నిఫా కలకలం: 12 ఏళ్ల బాలుడు మృతి
తిరువనంతపురం: కోవిడ్‌తో విలవిల్లాడుతున్న కేరళను మరో మహమ్మారి భయపెడుతుంది. కేరళలో మరోసారి నిఫా వైరస్ వెలుగు చూసింది. తాజాగా కేరళలో నిఫా వైరస్ బారిన పడి ఓ బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో ఈనెల 3న కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అందులో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నిఫా వైరస్ కారణంగానే బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. వారందరిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పని ప్రారంభించామని తెలిపారు. (చదవండి: Covid-19: పదిరోజులు జాగ్రత్త.. లేదంటే..) కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిఫా వైరస్ వల్లే బాలుడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కోజికోడ్ పంపించింది. కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
పెగాసస్‌తో నిఘా పెట్టడం ఎలా?.. జనాల ఆసక్తి !
కోలికోడ్ (కేరళ): ఓవైపు పెగాసస్ స్పై వేర్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇతరుల ఫోన్లపై నిఘా వేయాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆన్లైన్లో, యాప్‌స్టోర్‌లో పెగసెస్ అని కనిపిస్తే చాలు డౌన్‌లోన్ చేసేస్తున్నారు. ఇతరుల ఫోన్లు, వారి ఆంతరంగిక విషయాల్లో తలదూర్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. స్టడీ మెటీరియల్ యాప్ కేరళలోని కోజికోడ్‌లో పెగాసస్ పేరుతో ఓ కోచింగ్ సెంటర్ ఉంది. దీని నిర్వాహకులు కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం చాన్నాళ్ల కిందట పెగసెస్ అనే పేరుతో ఓ ఆన్లైన్ యాప్‌ని రూపొందించారు. ఉద్యోగార్థులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు. అయితే గత నాలుగు రోజులుగా ఈ పెగసెస్ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు వారానికి వెయ్యి డౌన్లోడ్లు ఉంటే పెగసెస్ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే వేల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కేరళలోనే కాదు సౌత్, నార్త్ తేడా లేకుండా ఇండియా అంతటా ఈ యాప్‌ని డౌన్లోడ్ పెరిగిపోయింది. నిఘా ఎలా ? పెగాసస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నదే ఆలస్యం... వెంటనే తమ టార్గెట్ వ్యక్తుల ఫోన్లపై ఎలా నిఘా వేయాలా అని డౌన్లోడ్ చేసుకున్న వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ యాప్‌లో కేవలం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా యాప్ రూపొందించిన కోచింగ్ సెంటర్ నిర్వహకులకే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు డౌన్‌లోడర్లు. పెగాసెస్ యాప్‌ను ఎలా మేనేజ్ చేయాలో... ఎలా నిఘా వేయాలో చెప్పాలంటూ ఒకరి తర్వాత ఒకరుగా కోచింగ్ సెంటర్లకు ఫోన్ల పరంపర పెరిగిపోయింది. సంబంధం లేదు దేశం నలుమూలల నుంచి ఒక్కసారిగా ఫోన్లు పెరిగిపోవడంతో... అందరికీ సమాధానం చెప్పలేక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చారు. ఇజ్రాయిల్ స్పై వేర్ పెగాసస్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని, తమది కేవలం ఎగ్జామ్ మెటీరియల్ యాప్ మాత్రమే నంటూ వివరణ ఇచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. పెగసెస్ పేరు, యాప్ లోగోగా రెక్కల గుర్రం ఉండటంతో చాలా మంది తమది స్పై వేర్‌గా పొరపడినట్టు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వాల మధ్యనే టార్గెట్ పర్సన్ ఫోన్లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి.. నిఘా ఉంచే సాఫ్ట్వేర్ పెగాసస్. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ లావాదేవీలు సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి తప్పితే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఈ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఇవ్వలేదు. అయినా పెగాసస్‌తో ఇతరుల ఫోన్‌పై నిఘా వేయోచ్చు అనే ఒకే ఒక్క కారణంతో నెట్లో పెగాసెస్ గురించి మన వాళ్లు వెతికేస్తున్నారు. పెగాసెస్ పేరు కనిపిస్తే చాలు డౌన్లోడ్ చేసేస్తున్నారు. -
ఇంటి వద్ద దింపుతామని.. బస్‌లో యువతిపై అత్యాచారం
కోజికోడ్: ఆ యువతికి మతిస్థిమితం లేదు.. తాను ఇంటికి వెళ్లాలని రోడ్డు మీద వాహనాలను లిఫ్ట్ ఇవ్వమని అడిగింది. ఈ క్రమంలో ఆమె మీద ఓ ముగ్గురు వ్యక్తుల కన్ను పడింది. వారు ఆ యువతికి లిఫ్ట్ ఇచ్చి ఓ ప్రైవేటు బస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికొడ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. కేరళలోని కోజికొడ్ జిల్లాకు చెందిన 21ఏళ్ల ఓ యువతికి మతిస్థిమితం లేదు. ఆ యువతి తరచు తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వస్తుంది. అయితే జూలై 5న మరోసారి తన తల్లితో గొడవపడి ఊరి చివరకు వెళ్లింది. కొంత సమయం తర్వాత తాను ఇంటికి వెళ్లాలనుకొని రోడ్డుపై పలు వాహనాలను లిఫ్ట్ అడిగింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ ఇచ్చి ఇంటి వద్ద దింపుతామని బలవంతంగా ఓ ప్రైవేటు బస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఊరిలోని ఆటో స్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యారు. అయితే జరిగిన విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని చేవాయూర్ పోలీసులు తెలిపారు. -
మద్యం షాపు వద్దే వివాహం.. కారణం అదే!
తిరువనంతపురం: సాధారణంగా చాలా జంటలు తమ పెళ్లి వేడుకను కళ్యాణ మండపంలో గానీ గుడిలో గానీ చేసుకోవడానికి ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ జంట కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ వివాహ వేడుకను వైన్‌షాపు ముందర చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటుచేసుకుంది. అయితే, కోజికోడ్‌కు చెందిన ప్రమోద్, ధన్యాలు మద్యం దుకాణం ముందు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరు గత కొంత కాలంగా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా వివాహ వేడుకలకు 50 మందికి మాత్రమే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రమోద్, ధన్యాలు తెలిపారు. అందుకే తాము, ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ విధంగా మద్యం దుకాణం ముందు పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కోజికోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. మద్యం షాపుల దగ్గర,లిక్కర్ కోసం వందల మంది ఎగబడుతున్నారని విమర్షించారు. అయితే, అక్కడ పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాటరర్స్‌ను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం, తాజా సడలింపులలో భాగంగా పెళ్లి వేడుకలకు 100 మంది పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళలో దాదాపు, 2000 కుటుంబాలు క్యాటరింగ్ వ్యాపారంపై ఆధారపడ్డాయి. వీరందరు పెళ్లిళ్లకు ఆహారాన్నిసప్లైచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. కాగా, గత కొంత కాలంగా వీరికి ఎలాంటి ఆర్డర్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామని కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రేమ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వారిని ఆదుకోవాలి..’, ‘భలే ఉంది.. మీ ఐడియా..’, ‘ జాగ్రత్త సుమా.. తాగుబోతులు పక్కనే ఉన్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
డ్రీమ్ వీవర్ కీప్ మూవింగ్.. డోంట్ క్విట్
శ్రీలక్ష్మి సురేశ్... ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వెబ్ డిజైనర్, సిఈవోగా నిలిచిన అమ్మాయి. కేరళ కోజికోడ్‌లో తను చదువుతున్న స్కూల్ కోసం ప్రెజెంటేషన్.కామ్ అనే వెబ్ సైట్‌ను తయారుచేసి రికార్డు సాధించారు. అప్పుడు శ్రీలక్ష్మి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఇందుకుగాను శ్రీలక్ష్మి 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అత్యద్భుతంగా వెబ్ డిజైన్ చేసిందని మేధావుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ వెబ్మాస్టర్స్ సంస్థ శ్రీలక్ష్మికి తమ సంస్థలో సభ్యత్వంతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డ్ వెబ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ అసోషియేషన్‌లో 18 సంవత్సరాల లోపు ఉండి, సభ్యత్వం పొందిన ఏకైక అమ్మాయి తనే. ఎన్నో సత్కారాలు, అవార్డులు అందుకున్న శ్రీలక్ష్మి ఇప్పుడు సొంతంగా వెబ్ ఇడిజైనింగ్ కంపెనీ ప్రారంభించారు. (www. edesign.co.in) ఈ కంపెనీకి సిఈవో. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో సిఈవోగా రికార్డు సాధించారు శ్రీలక్ష్మి. ఇప్పుడు శ్రీలక్ష్మి సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో కలిసి ఆన్లైన్ పిక్సెల్ ట్రేడర్స్ సంస్థను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. శ్రీలక్ష్మి తండ్రి సురేశ్ మీనన్. ఆయన అడ్వొకేట్. తల్లి విజు సురేశ్. వెబ్ డిజైనింగ్ మీద తనకు ఆసక్తి కలగడానికి కారణం.. తన తండ్రి తనను చిన్నతనం నుంచి కంప్యూటర్ మీద పనిచేసుకోనివ్వటమే అంటారు. ‘కంప్యూటర్ నోట్పాడ్ మీద ఇంగ్లీషు అక్షరాలు టైప్ చేస్తూ నేర్చుకున్నాను’ అంటారు శ్రీలక్ష్మి. ఇంకా స్కూల్లో కూడా చేరకముందే మైక్రోసాఫ్ట్ పెయింట్‌లో బొమ్మలు వేయడం ప్రారంభించారు శ్రీలక్ష్మి. ‘కంప్యూటర్ నా ప్రాణ స్నేహితురాలు. నా ఆరు సంవత్సరాల వయసులో ఒక చిన్న కుర్రవాడు తయారు చేసిన వెబ్‌సైట్‌ని నాన్న నాకు చూపిస్తూ, నాకు ఇష్టమైతే నన్ను కూడా చేయమని చెప్పారు. అప్పుడు నేను ఎంఎస్ వర్డ్ ఉపయోగిస్తూ ప్రయత్నించాను, ఆ తరవాత ఎంఎస్ ఫ్రంట్ పేజీలో ప్రయత్నించాను. అలా నా మొదటి వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాను. అది కూడా మా స్కూల్ కోసం www.presentationshss.com పేరున తయారు చేశాను. అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు. ఇప్పుడు నేను వెబ్‌సైట్స్‌ని డ్రీమ్వీవర్ ఉపయోగిస్తూ డెవలప్ చేస్తున్నాను’ అని ఎంతో ఆనందంగా చెబుతారు శ్రీలక్ష్మి. టైనీలోగో (tinylogo) అనే సెర్స్ ఇంజిన్ కూడా తయారు చేశారు శ్రీలక్ష్మి. తనకు లోగోలను సేకరించటమంటే ఇష్టమని, అందుకోసమే ఈ సైట్ ప్రారంభించానని చెబుతారు. అయితే ఇతరుల అనుమతి లేకుండా వారి లోగోలను తీసుకోవటం నేరమని నాన్న చెప్పారు. అందువల్ల వారి దగ్గర నుంచి చట్టబద్ధంగా లోగోలను సేకరిస్తున్నట్లు చెబుతారు శ్రీలక్ష్మి. ఆ సమయంలోనే శ్రీలక్ష్మి ‘సైనల్ రైన్బో’ టెక్నాలజీతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అబిదీన్ (సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్) ని కలిసి, లోగోల ఆధారంగా వాటికి సంబంధించిన అంశాలను సెర్చ్ చేయటం గురించి చర్చించారు. ఆ విధంగా లోగో ఆధారంగా సమాచారాన్ని సేకరించేలా వారితో కలిసి సెర్చ్ ఇంజిన్ తయారుచేశారు. ‘‘నా మొదటి వెబ్సైట్ తయారు చేసుకున్నప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలియదు. అందువల్ల నాకు అస్సలు టెన్షన్ లేదు. ఇప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్‌గా ఉంటోంది. అందరూ మెచ్చుకునేలా చేయాలనే సంకల్పంతో, ఇప్పుడు ఎక్కువ సమయం వెబ్ డిజైనింగ్ గురించి బాగా చదువుతున్నాను. ఇంకా పిహెచ్‌పి, ఏఎస్పి... లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులంతా మెచ్చుకునేలా కష్టపడుతున్నాను’ అంటూ సంతోషంగా అంటారు శ్రీలక్ష్మిసురేశ్. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం వల్ల శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది నిపుణులతో చర్చించటానికి అవకాశాలు వస్తున్నాయి. ‘‘విదేశీ మార్కెట్ మీద ఆధారపడిన వారి పరిస్థితులు బాలేవు. నేను విదేశీ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయట్లేదు. చిన్నవి మాత్రమే చేస్తున్నాను. వెబ్సైట్ల అవసరం రోజురోజుకీ బాగా పెరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా వెబ్సైట్లు పెట్టుకుంటున్నారు. నేను ఎక్కువ ఆర్డర్లు తీసుకుని, చక్కగా చేసి ఇస్తున్నాను. అందువల్ల నా కంపెనీ భవిష్యత్తు గురించి నేను బాధపడనక్కర్లేదు’’ అంటారు ఎంతో ధీమాగా శ్రీలక్ష్మి. ప్రస్తుతం www.stateofkerala.in వెబ్సైట్లో కేరళ గురించి సమాచారాన్ని పొందుపరచి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా రూపొందిస్తున్నాను’’ అంటున్న శ్రీలక్ష్మి చదువుతో పాటు ఈ పనులన్నీ ఎంతో ప్రణాళికతో చేస్తున్నారు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుందని, అదేవిధంగా అందరికీ చాలా సౌకర్యంగా ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని ఉంది. పిల్లలు కూడా పెద్దవాళ్లు చేసినవన్నీ చేయగలరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతారు. ‘కీప్ మూవింగ్, డోంట్ క్విట్’ అనేది శ్రీలక్ష్మి నినాదం. -
సోలార్ స్కాం: సరితా నాయర్‌కు 6 ఏళ్ల జైలు
కోజికోడ్: సోలార్ ప్యానెల్ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్‌కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్ ప్రస్తుతం కోవిడ్‌తో క్వారంటైన్లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు. ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు గాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించా రు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ మజీద్ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
ఎంత అద్భుతంగా పాడుతున్నాడో!
కళాకారులకు మరణం ఉంటుందేమో గానీ.. కళ మాత్రం ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. లెజండరీ సింగర్ మహ్మద్ రఫీ ఈ లోకాన్ని వీడి ఎన్నో ఏళ్లు గడిచినా ఆయన అద్భుతమైన గాత్రం నుంచి వెలువడిన పాటలు మాత్రం అభిమానుల మనసుల్ని నేటికీ రంజింపజేస్తూనే ఉన్నాయి. విలక్షణమైన గొంతుతో తనదైన శైలిలో ఆయన ఆలపించిన గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎంతో మంది గొప్ప గొప్ప గాయకులు ఉన్నా రఫీకి వారెవరూ సాటిసారరని, మళ్లీ అలాంటి గొప్ప గాయకుడిని భవిష్యత్తులో చూసే అవకాశం దక్కుతుందో లేదోనని మదనపడుతూ ఉంటారు ఆయనను ఆరాధించేవారు. (అభిమాన నటుడికి బాలుడి అరుదైన నివాళి) అయితే కోళికోడ్‌కు చెందిన సౌరవ్ కిషన్ అనే 23 ఏళ్ల కుర్రాడు వారి కలను తీర్చే అవకాశం ఉందంటున్నారు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన శనివారం ఓ వీడియోను రీట్వీట్ చేశారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా కొత్త మహ్మద్ రఫీ కోసం మనం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించే సమయం వచ్చినట్లుగా అనిపిస్తోంది... ఈ క్లిప్ స్విచ్ఛాప్ చేయలేకపోతున్నా’’అని రఫీ ఆలపించిన పాటను సౌరవ్ పాడిన తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కేరళకు చెందిన సౌరవ్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నట్లు సమాచారం. అతడికి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. స్థానికంగా అతడికి చోటా రఫీ అనే పేరు కూడా స్థిరపడిపోయింది. We have been waiting for decades for a new Mohammed Rafi. It sounds as if we may have to wait no longer... I couldn’t switch this clip off... https://t.co/QhM3koPlVE — anand mahindra (@anandmahindra) September 12, 2020 -
నా రెండు చేతులూ పోయాయనుకున్నా..
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నా రెండు చేతులు పోయాయనుకున్నా. తీవ్రమైన నొప్పితో కనీసం కదపడానికి కూడా వీలు లేనంత బాధను భరించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెలకువ రాగానే నా సోదరుడిని నేను అడిగిన మొదటి ప్రశ్న నా చేతులు ఏవి అని. ఆ సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరో నన్ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ప్రతీ ఒక్కరిలో కరోనా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మాస్క్‌ను కొంచెం సేపు కూడా పక్కన పెట్టలేదు. ఎవరూ వాష్‌రూంకు కూడా వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అందరిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే పెద్ద శబ్ధం రావడంతో అందరం చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో తెలుసుకనేలోపే విమానం ముక్కలైంది. ఆ తర్వాత ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాం' అనే విషయాలను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (కోళీకోడ్ ప్రమాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు గాయాలపాలై ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారిలో ఆశిక్ ఆయన సోదరుడు మొహమ్మద్ అస్సియాస్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నామని, చాలామంది సహాయం చేయడానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి తన సోదరుడు ఏమై పోయాడో అని మళ్లీ వెనక్కి వచ్చి చూసుకున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని తనకు సహాయం చేసిన వైద్యులు, సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. (కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
కోళీకోడ్ ఘటన: హోం క్వారంటైన్లోకి సీఎం
తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మలప్పురం జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. వీరిలో జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్‌తో పాటు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. (కోళీకోడ్ ఘటన: 22 మంది అధికారులకు కరోనా) Kerala CM Pinarayi Vijayan & others who visited Kozhikode plane crash site are going into self-quarantine. Co-operation & Devaswom Minister Kadakampally Surendran will hoist national flag at Independence Day function to be held in Thiruvananthapuram tomorrow: Kerala CMO #COVID — ANI (@ANI) August 14, 2020 ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది మరణించారు. -
కోళీకోడ్ ఘటన: 22 మంది అధికారులకు కరోనా
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది మరణించారు. అయితే తాజాగా శుక్రవారం మరోక షాకింగ్ న్యూస్ తెలిసింది. విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మలప్పురానికి చెందిన 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. ఈ మేరకు మలప్పురం జిల్లా వైద్యాధికారి ప్రకటన చేశారు. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వార్త ఇప్పటికే బాధితులను భయపెడుతోంది. దీని గురించి కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దాని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. (చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!
చెన్నై: ‘‘నాకు హిందీ మాట్లాడటం వచ్చా? రాదా? అన్నది కాదు ఇక్కడ సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు’’ అంటూ డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరుపై మండిపడ్డారు. హిందీ భాషకు జాతీయతకు ముడిపెట్టడం సరికాదంటూ హితవు పలికారు. కాగా కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రాజకీయ దుమారం రేగింది.(ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్ఐఎఫ్ తీరును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని తేలింది. ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (కేరళలో కనిమొళికి చేదు అనుభవం) ఇందుకు ఆమె సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను? నా విద్యాభ్యాసం అంతా తమిళ, ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయినా ఇక్కడ సమస్య భాష గురించి కాదు. భాషను జాతీయతతో ముడిపెట్టడం గురించి. ఒకే భాష, ఒకే మతం, ఒకే సిద్ధాంతం పాటిస్తేనే భారతీయులా. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొందరు ఈ విషయం గురించి రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య’’ అంటూ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. -
కళ్లె దుటే ముక్కలైంది
సాక్షి, హైదరాబాద్ : కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో మొదటి, ఆఖరి 2–3 వరుసల్లోని సీట్లలో కూర్చున్నవారే తీవ్రంగా ప్రభావితమయ్యారని సీఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ సెక్టార్(సౌత్‌వెస్ట్) ఐజీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కాక్‌పిట్ సైతం ప్రభావితం కావడంతోనే పైలట్, కో–పైలట్లు మరణించారన్నారు. మధ్య వరుస సీట్లలో కూర్చున్నవారిలో మృతులు, క్షతగాత్రులు లేరని పేర్కొన్నారు. ఆ దుర్ఘటనలో సీఐఎస్ఎఫ్ సహాయకచర్యలకు సంబంధించి సీవీ ఆనంద్ ఆదివారం వెల్లడించిన వివరాలివి... పెరిమీటర్ గోడకు విమానం గుద్దుకుని.. కేవలం 3 కి.మీ. పొడవు టేబుల్ టాప్ రవ్వేతో కూ డిన కోళీకోడ్ విమానాశ్రయం చుట్టూ పెరిమీటర్ వాల్‌గా పిలిచే సరిహద్దు గోడ ఉంది. ఆ గోడకు ఉన్న ఎమర్జెన్సీ గేట్ నం.8 వద్ద శుక్రవారంరాత్రి ఏఎస్సై మంగళ్ సింగ్, పెరిమీటర్ గస్తీలో ఏఎస్సై అజిత్‌సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. రన్‌వే వీరికి 45–50 అడుగుల ఎత్తులో ఉంది. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతోపాటు ఎయిర్ ఇండియాకు చెందిన దుబాయ్–కోళీకోడ్ బోయింగ్ 737 విమానం పెరిమీటర్ గోడకు గుద్దుకుని రెండు ము క్కలవడం గమనించారు. వెంటనే మంగళ్, అజిత్‌లు వైర్లెస్ సెట్స్ ద్వారా ఎయిర్పోర్ట్ కంట్రోల్‌కు, సమీపంలోని బ్యారెక్స్‌లో విశ్రాంతి తీసుకునే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న ఐజీ సీవీ ఆనంద్ సీఐఎస్ఎఫ్ హెడ్– క్వార్టర్స్‌తోపాటు డీజీని అప్రమత్తం చేసి సహాయక చర్యల్ని పర్యవేక్షించడం ప్రారంభించారు. సీఐఎస్ఎఫ్ కృషి ఫలితంగానే.. కాప్‌పిట్ పెరిమీటర్ గోడను బలంగా ఢీ కొట్టడంతో పైలట్ అక్కడికక్కడేతమరణించగా, కో–పైలట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సీఐఎస్ఎఫ్, ఇతర విభాగాలు, స్థానికుల కృషి ఫలితంగానే మృతుల సంఖ్య 18కి పరిమితమైంది. పైలట్ అప్రమత్తత, వర్షం కారణంగా విమానంలో ఉన్న ఫ్యూయల్‌కు మంటలంటుకోలేదు. అదే జరిగితే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. విమానం లైట్ల వెలుతురులో నడుచుకుంటూ... ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ ఏరియాకు లోపలే ప్రమాదం జరగడం, పెరిమీటర్ గోడకు అవతల రోడ్లు ఉండటంతో సిబ్బంది, అంబులెన్స్‌లు, జేసీబీలు, స్థానికులు ప్రమాదస్థలానికి చేరుకోవడం తేలికైంది. ఇది కూడా మృతుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. భారీవర్షం, చిమ్మ చీకటి వల్ల సహాయకచర్యలకు ఇబ్బంది కలిగింది. విమానంలోని మొదటి, చివరి 2–3 వరుసల్లో కూర్చున్న వారిలో అత్యధికులు సీట్ల మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడటం, చనిపోవడం జరిగింది. విమానం లైట్లు వెలుగుతూనే ఉండటంతో చాలామంది ఆ వెలుతురులో నడుచుకుంటూ బయటకు రాగలిగారు. ఫ్లాష్లైట్ల వెలుతురులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 184 మంది ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్స్‌లో నలుగురు మినహా మిగిలినవారిని రాత్రి 9.45 గంటలకల్లా రెస్క్యూ చేయగలిగారు. విమానం నుంచి ఆఖరులో బయటకు తీసుకువచ్చిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
కేరళలో కనిమొళికి చేదు అనుభవం
సాక్షి, చెన్నై: ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది. ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోళీవుడ్ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను. అయితే, అక్కడున్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించాను. దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’అని ఎంపీ కనిమొళి ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. #hindiimpostion హ్యాష్ టాగ్‌ను పోస్టు చేశారు. కాగా, కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది. (26కి చేరిన మృతుల సంఖ్య) Today at the airport a CISF officer asked me if “I am an Indian” when I asked her to speak to me in tamil or English as I did not know Hindi. I would like to know from when being indian is equal to knowing Hindi.#hindiimposition -
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు. 184 మంది ప్రయాణికులతో దుబాయ్నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్ అనే ప్లంబర్ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 737ఐఎక్స్ 1344 విమానానికి చెందిన డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లు లభించాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. డీఎఫ్డీఆర్లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్ ప్రశంసించారు. విమాన ప్రమాదంలో కరోనా భయం విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు. పెళ్లి కోసం తిరిగివస్తూ... పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రియాస్ (24), సోదరుడు నిజాముద్దీన్‌తో కలిసి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్ కోళీకోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కో–పైలట్ భార్య నిండుగర్భిణి కోళీకోడ్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్ అఖిలేష్ కుమార్(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేష్‌కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్‌కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్ తెలిపారు. మొదట అఖిలేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణాలివేనా ? కోళీకోడ్‌లో విమానం దిగిన రన్ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్‌వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్ రాడార్ చెబుతోంది. రన్ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ అమర్ సింగ్ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్ టాప్ రన్ వేపై సాధారణ రన్ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. టేబుల్ టాప్ రన్ వేలు ప్రమాదకరం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్ టాప్ రన్ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు. అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ బీఎన్ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్ వే అచ్చంగా ఒక టేబుల్ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్‌వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు. కోళీకోడ్ విమానాశ్రయంలో రన్ వేకి రెండు వైపుల అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్ మార్షల్ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు. దేశంలో అయిదు మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. కోళీకోడ్ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), పాక్యాంగ్ (సిక్కిం), లెంగ్పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్ వేలు ఉన్నాయి. ఈ రన్ వేలపై షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ (ఎస్ఎఫ్పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు. -
‘మరోసారి విమానం ఎక్కాలని లేదు ’
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో ఉన్నవారిని ఊహించని ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఈ దుర్ఘటన ఓ పీడకలగా మారింది. అంతా 15 సెంకడ్లలో జరిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ముహమ్మద్ జునైద్ అనే ప్యాసింజెర్ చెప్పాడు. దేవుడి దయతో తాను బయటపడ్డానని, ఇంకోసారి విమాన ప్రయాణం చేయాలనే ఆలోచననే లేదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (చదవండి : భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..) ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు జునైడ్(25) ఒకరు. మూడేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నెలకు 75 వేల జీతం. అంతా బాగుంటుందన్న సమయంలో కరోనా మహ్మమారి అతని ఉపాధిని దెబ్బతీసింది. మే నెలలో సగం జీతం ఇచ్చిన కంపెనీ.. తర్వాత మూడు నెలలు సెలవులపై వెళ్లాలని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనుక భాగం చివరి సీట్లో కూర్చోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని జునైద్ చెప్పాడు. విమాన పైకప్పు తాకడం వల్ల తలకి, పెదాలకు చిన్న గాయం తప్పా ఎలాంటి ప్రమాదం జరగలేదని జునైద్ పేర్కొన్నారు. దేవుని దయతో బయటపడ్డానని, మరోసారి విమానం ఎక్కాలని లేదని చెప్పుకొచ్చారు. (చదవండి : కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్
తిరువనంతపురం: దుబాయ్ నుంచి వస్తోన్న ఎయిర్ ఇండియా విమానం కేరళ కోళీకోడ్‌లో ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి దుబాయ్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. తన ప్రాణం కాపాడిన దేవుళ్లంటూ ప్రశంసిస్తున్నాడు. ఆ వివరాలు.. టి. నౌఫాల్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఉద్యోగం పొగొట్టుకున్నాడు. దాంతో ఇండియాకు వెళ్లాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురయిన విమానంలోనే అతడు రావాల్సి ఉండింది. అయితే ఆఖరి నిమిషంలో అతడి ప్రయాణం వాయిదా పడింది. దుబాయ్ విమానాశ్రయంలో అతడి మీద ఓ జరిమానా పెండింగ్‌లో ఉంది. దాంతో సిబ్బంది అతడిని ఇండియాకు వెళ్లడానికి అనుమతించలేదు. అప్పుడు బాధపడినా.. ప్రమాదం గురించి తెలిసి తన అదృష్టానికి మురిసిపోతున్నాడు నౌఫాల్.(కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది) ఈ సందర్భంగా నౌఫాల్ మాట్లాడుతూ.. ‘ఇంటికి వెళ్లబోతున్నాను అని చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటి దగ్గర అందరికి చెప్పాను. ఎయిర్ పోర్టుకు వెళ్లాను. అయితే అధికారులు నా వివరాలు పరిశీలించి.. నేను ఇండియా వెళ్లడానికి వీళ్లేదన్నారు. నా మీద ఓ ఫైన్ పెండింగ్ ఉందని తెలిపారు. దాంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ అధికారిని ఎంతో బతిమిలాడాను. కానీ వారు నా అభ్యర్థనను పట్టించకోలేదు. దాంతో ఎయిర్‌పోర్టు నుంచి నా రూమ్‌కు వెళ్లాను. ఇంటికి ఫోన్ చేసి రావడం లేదని చెప్పాను. ఆ తర్వాత నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాను. కానీ ఎప్పుడైతే విమాన ప్రమాదం గురించి విన్నానో నాలో అనేక రకాల భావాలు వెల్లడయ్యాయి. అంతసేపు ఇంటికి వెళ్లలేకపోయినందుకు బాధపడ్డ నేను.. ఆ క్షణం ఆ విమానంలో లేకపోవడం నిజంగా నా అదృష్టం అంటూ ఆనందానికి లోనయ్యాను. మరోవైపు ప్రమాదానికి గురయిన వారిని తల్చుకుంటే చాలా బాధ కలిగింది. ఏది ఏమైనా జరిమానా నా ప్రాణం కాపాడింది’ అంటూ చెప్పుకొచ్చాడు నౌఫాల్. -
కోళీకోడ్ ఘటన: ‘మీరు దేశానికే ఆదర్శం’
తిరువనంపురం: గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఒకేరోజు రెండు ప్రమాదాలను చవిచూసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరదలతో ఇబ్బందులు పడగా.. రాత్రి భయంకరమైన విమాన ప్రమాదం కేరళను కుదిపేసింది. అయతే ఈ రెండు ఘటనలు వారిలోని స్పందించే హృదయాన్ని, మానవత్వాన్ని ఏం చేయలేకపోయాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు కేరళ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సోషల్ మీడియా బ్లడ్ బ్యాంక్ ఎదుట క్యూ లైన్లలో నిలిచిన యువత ఫోటోలతో నిండిపోయింది. శుక్రవారం రాత్రి నుంచే కేరళ యువత సహాయక చర్యలు ప్రారంభించారు. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తొలుత మల్లాపురం స్థానికులు రంగంలోకి దిగారు. బాధితులకు సాయం చేశారు. కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానాలను కన్నూర్‌కు మళ్లించడంతో స్వచ్ఛంధ సేవకులు అర్థరాత్రి వరకు పని చేసి ప్రయాణికులకు ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. (‘ఇప్పటివరకు 100 విమానాలు ల్యాండ్ అయ్యాయి’) ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ ‘విపత్తు సంభవించిన ప్రతిసారి కేరళలోని స్వచ్ఛంద సేవా స్ఫూర్తి మేల్కొంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. కోళీకోడ్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యువకులు బ్లడ్ బ్యాంక్‌ల ముందు క్యూ కట్టారు. మరికొందరు కన్నూర్ విమానాశ్రయానికి మళ్లించిన ప్రజల కోసం ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళ స్వచ్ఛంద సేవకులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘కేరళ స్థానికులు రంగంలోకి దిగారు. ఈ స్ఫూర్తి, ఐక్యతనే వీరిని భిన్నంగా చూపిస్తోంది. వరదలు ఓ వైపు, మహమ్మారి మరోవైపు.. తాజాగా విమాన ప్రమాదం. ఓ కష్టం ఎదురయ్యిందంటే చాలు జనాలు కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తారు. ఇదే నా కేరళ మోడల్ ’అంటూ అభినందిస్తూ ట్వీట్ చేశారు. Kerala kocals swing into action: What sets Malayalis apart is our spirit &unity, during floods, the pandemic &now the aircrash. When a mishap occurs, people throw themselves into the situation regardless of religion/caste/class. That’s my#KeralaModel! https://t.co/Wz5GlgwJP1 — Shashi Tharoor (@ShashiTharoor) August 8, 2020 -
కోళీకోడ్ ఘటన: ‘షాక్‌కు గురయ్యా’
ఢాకా: కేరళలోని కోళీకోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే మోమెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాల కొల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన శనివారం సంతాపం వ్యక్తం చేశారు. ‘కేరళలోని కోళీకోడ్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విని షాక్‌కు గురయ్యా. ఈ విషాద ఘటన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఈ విమాన ప్రమాదం ఎంతమంది విలువైన ప్రాణాలను బలికొంది. వీరి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలి, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాం తెలుపుతున్నాను. వారికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్న’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్‌తో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు భారత అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కోళీకోడ్ ఘటనపై స్పందించిన అశోక్) కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయం వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరూ పైలేట్లతో సహా 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సీవీల్ ఏవియేషన్(డీజీసీఏ) వారు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) -
భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..
సాక్షి, కోళీకోడ్: కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురై విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ దుర్ఘనటన తీవ్రమైన వేదనను మిగిల్చింది. ‘ఇది చాలా పెద్ద విషాదం. విమానం నేలపై కూలినపప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మమ్మల్ని మేము సమన్వయం చేసుకోవడానికి మా ముందు సీట్లను భయంతో గట్టిగా పట్టుకున్నాము. ఇక విమానం కూలిపోవటంతో అది రెండు ముక్కలుగా విరిగిపోయింది’ అని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు. ‘చుట్టు పక్కల అందరూ ఏడుస్తున్నారు. పైలట్లు, ఇద్దరు మహిళలు మృతి చెందారని ఎవరో నాకు చెప్పారు. ఆ తర్వాత పేపర్లో 18మంది చనిపోయినట్లు వచ్చింది. బహుశా ఈ ప్రమాదానికి వాతావరణం కారణం కావొచ్చని మరో బాధితుడు తెలిపారు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోతే మరో విమాశ్రయంలో ల్యాండ్ చేయల్సింది. కానీ ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక కలలా విమానం కూలి ప్రమాదం జరిగింది’ అని మరొక ప్రయాణికుడు చెప్పారు. ఐదుగురు బాధితులను విమ్స్ ఆస్పత్రిలో చేర్చినట్లు డాక్టర్ ముహమ్మద్ షఫీ పేర్కొన్నారు. అదే విధంగా చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ సత్య ప్రధాన్ తెలిపారు. శుక్రవారం రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు. -
‘ఇప్పటివరకు 100 విమానాలు ల్యాండ్ అయ్యాయి’
తిరువనంతపురం: కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు విమానం టేబుల్‌టాప్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేను ఒక కిలోమీటరు మేర తాకినట్లు రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ 737 ఎన్జీ విమానం రన్‌వేపై ఆగడానికి ముందు పట్టుతప్పిందని.. దాంతో నిటారుగా పడిపోయి రెండు ముక్కలయ్యిందని డీజీసీఏ తెలిపింది. అప్పటికే విమానం ల్యాండ్ అవ్వడానికి పలుమార్లు ప్రయత్నించిందని.. కానీ అందుకు వీలుపడలేదని తెలిపింది. అంతేకాక నిన్న విమానాశ్రయ ప్రాంతంలోనే కాక కేరళలోని పలు చోట్ల వర్షం కురిసిందని వెల్లడించింది. పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. డైవర్షన్ ల్యాండింగ్‌కు సరిపడా ఇంధనం విమానంలో ఉందని వెల్లడించారు. (‘ఆ రన్‌వేకు ఎక్స్టెన్షన్ అవసరం ఉంది’) దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 18 మంది మరణించగా.. వీరిలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు విమానంలో మంటలు చెలరేగకపోవడంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని అధికారలు తెలిపారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్‌వే కండిషన్‌పై వస్తోన్న విమర్శలను జూనియర్ విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ ఖండించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం ఉద్దేశించిన ‘వందే భారత్ మిషన్’లో భాగంగా మే 7 నుంచి దాదాపు 100 విమానాలు కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయని తెలిపారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) అంతేకాక రన్ వే పరిస్థితి గురించి ఇంతకుముందు వచ్చిన నివేదికలకు నిన్న జరిగిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిన్ననే పౌర విమానయాన మంత్రి స్పష్టం చేశారని మురళీధరన్ తెలిపారు. ప్రస్తుతం దక్షిణ భారతంలో రెండు టేబుల్‌టాప్ విమానాశ్రయాలు(కోళీకోడ్, మంగళూరు) ఉన్నాయన్నారు. అయితే వాటిని వినియోగించాలా వద్దా అన్నది చాలా పెద్ద ప్రశ్న అన్నారు మురళీధరన్. టెబుల్టాప్ విమానశ్రాయం టెబుల్టాప్ విమానాశ్రయం అనేది పీఠభూమి లేదా కొండను చదును చేసి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. -
కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది
తిరువనంతపురం : దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదాన్ని మంగళూరు ప్రమాదంతో పోల్చి చూడటం సరికాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోళీకోడ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. (‘ఈ ప్రమాదం గురించి 9 ఏళ్ల క్రితమే హెచ్చరించా’) మంగళూరు ప్రమాదం నుంచి పాఠం నేర్చుకున్నామని తాజా సంఘటనను పదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో పోల్చడం చాలా తొందరపాటు చర్య అవుతుందన్నారు. పైలట్ కెప్టెన్ దీపక్ సాతే, కో-పైలట్ అఖిలేష్ కుమార్‌లకు అత్యంత అనుభవజ్ఞులని మంత్రి తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన దుర్ఘటనకు, మంగళూరులో జరిగిన ప్రమాదానికి పోలీకలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విమానం కూడా టేబుల్‌టాప్ రన్వేనే. బోయింగ్ 737 రకానికి చెందిన విమానమే. 2010 మే 22న దుబాయ్ నుంచి మంగళూరుకు పయనమైన విమానం కూడా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యే సమయంలోనే ప్రమాదానికి గురైంది. అప్పటి విమానం కూడా ఎయిర్ ఇండియాకు చెందినదే . మంగళూరు ఘటనలో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం అది. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. (కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) -
కోళీకోడ్ ఘటనపై స్పందించిన అశోక్
న్యూఢిల్లీ: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాద ఘటనపై మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అన్నారు. భద్రత చాల ముఖ్యమని తెలిపారు. కోళీకోడ్ ఎయిర్ పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద విమానాలు దిగేందుకు ఎక్స్టెన్షన్ తప్పనిసరి అన్నారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) అయితే రన్ వేను ఎక్స్టెన్షన్ చేశారా.. లేదా అన్న విషయం తనకు తెలియదు అన్నారు అశోక్ గజపతిరాజు. ఎయిర్ పోర్టు, ఎయిర్‌క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు అశోక్ గజపతిరాజు. -
మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌గ్రేషియా
సాక్షి,తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదిగా అభివర్ణించింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. (కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది) 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు, 12 ఏళ్లలోపు మృతుల కుటుంబీకులకు 5 లక్షల రూపాయలు చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించనున్నామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చెల్లిస్తామని పేర్కొంది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ప్రయాణీకులకు తగిన సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1800222271టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. 10 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు చెల్లిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. (విమాన ప్రమాదం : కరోనా కలకలం) -
‘కోళీకోడ్ ఘటన ప్రమాదం కాదు.. హత్య!’
తిరువనంతపురం : కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉండటం, రన్‌వేకు రెండు వైపులా లోయలు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. దీనిపై తాము అనేకసార్లు సంబంధిత అధికారులకు విజ్ఙప్తి చేసిన వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. విమానాశ్రయ రన్‌వే వద్ద సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కోళీకోడ్‌లో జరిగిన సంఘటన లాంటిదే భవిష్యత్తులో జమ్మూకశ్మీర్, పాట్నా విమానాశ్రయాల్లో సంభవించే ప్రమాదం ఉందని వాయు భద్రతా నిపుణులు కెప్టెన్ మోహన్ రంగనాథన్ హెచ్చరించారు. (కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ స్వాధీనం) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భద్రతా సలహా కమిటీలో రంగనాథన్ సభ్యుడిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోళీకోడ్ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తాను ఒక నివేదికను సమర్పించినట్లు తెలిపారు. రంగనాథన్ మాట్లాడుతూ.. ‘నా హెచ్చరికను విస్మరించారు. నా అంచనాకు తగ్గట్లే అది ఇప్పుడు జరిగింది. నా అభిప్రాయంలో ఈ ఘటన ప్రమాదం కాదు. హత్య!. తమ సొంత భద్రతా చర్యల్లోనే సమస్యలు ఉన్నాయి. కోళీకోడ్ విమానశ్రయం టేబుల్ టాప్ రన్‌వే చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల అక్కడ ఎక్కువ భద్రతా చర్చలు అవసరం’అని తెలిపారు. కోళీకోడ్ విమనాశ్రయం రన్‌వే చివరలో 70 మీటర్ల డ్రాప్ ఉంది. మంగళూరులో ఇది 100 మీటర్లు ఉంది. ఒక విమానం అదుపు తప్పితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. సరిగ్గా ఇలాగే జమ్మూ, పాట్నాలో కూడా జరగవచ్చు. ఈ రెండు చోట్ల కూడా సరైన భద్రత చర్యలు లేవు’ అని తెలిపారు. (కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు) కోళీకోడ్ విమానశ్రయంలోని టేబుల్ టాప్ మిమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌షాట్ అవ్వడంతో రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఇంటి ఘటనే 2010లో మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో విమానం నుంచి మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) -
విమాన ప్రమాదం : కరోనా కలకలం
సాక్షి, తిరువనంతపురం : కేరళ విమాన ప్రమాద విషాదానికి తోడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలతో ప్రయాణికులను తరలిస్తున్నారు. కానీ శుక్రవారం నాటి కోళీకోడ్ విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన రేపింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మృతుల్లో ఒకరికి కరోనా సోకినట్టుగా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ప్రకటించారు. దీంతో ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. వీరి వివరాలను సేకరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. (ఆయన ధైర్యమే కాపాడింది!) My heart goes out to the families & friends of the 18 people who lost their lives in the air accident involving @FlyWithIX Flight IX-1344 in Kozhikode last evening & offer my heartfelt condolences. Reasons for the mishap are being investigated. pic.twitter.com/awEGpU9EmK — Hardeep Singh Puri (@HardeepSPuri) August 8, 2020 మరోవైపు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి,కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్, కేంద్ర మంత్రి వి మురళీధరన్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. -
విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ స్వాధీనం
తిరువనంతపురం : కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకున్నది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఇవాళ ఉదయం డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్(డీఎఫ్ఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్)ను తీశారు. ఇది విమాన ఎత్తు, స్థితి, వేగం, అలాగే పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేస్తుంది. ప్రమాదానికి గురయ్యే ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్లాక్‌బాక్స్ దోహదపడుతుంది. (విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు) కేరళలోని కోళీకోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయి- కోళీకోడ్ ఎయిరిండియా విమానం (ఐఎక్స్ - 1344) ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్ వే నుంచి జారిపోయిన విషయం తెలిసిందే. దీంతో విమానం రెండు ముక్కలైంది. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఎయిరిండియా ప్రత్యేక సహాయ బృందం ఇప్పటికే కోళీకోడ్‌కు చేరుకుంది. ‘ఏంజిల్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా’ అని పిలువబడే ప్రత్యేక సహాయ బృందాన్ని ఢిల్లీ, ముంబై నుంచి కోళీకోడ్‌కు పంపించినట్లు ఎయిర్ ఇండియా తెలిసింది. వీరు సహాయక చర్యలను సమన్వయం చేయడం, బాధితులకు, మృతులకు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం వారి విధి. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) కాగా ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ రన్ వేనే కారణమని తెలిపింది. కేరళలో భారీ వర్షాల కారణంగా విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై తడిగా ఉండటంతో విమానం ఓవర్ షాట్ అయ్యి జారి లోయలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ టేబుల్ రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ఇరువైపులా, ముందూ వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేల కంటే వీటి నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా అయోమయాన్ని కలిగిస్తాయి. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) -
విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు
సాక్షి, తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ కేరళ కోళికోడ్ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్ వసంత్ సాథే సారధ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే...మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలు మోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం. అయితే ఇంతటి ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) న్యూస్ మినిట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు. (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? ) స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్‌లోని రెడ్ క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. 'గుర్తు తెలియని కవలలు' పేరుతో జిల్లా అధికారులు పేరుతో వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. వారి సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. -
రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు
సాక్షి, కోళీకోడ్: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాద దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. ప్రమాద స్థలంలో భయంతో పిల్లల రోదనలు మిన్నంటిన దృశ్యం హృదయాల్ని కదిలించక మానవు. రక్తమోడే దుస్తులతో కకావికలమైన ప్రయాణికులు ఒకవైపు..ఏం జరిగిందో తెలియని గందరగోళంలో తీవ్ర నొప్పితో క్షతగ్రాతుల ఆర్తనాదాలు, మరోవైపు అంబులెన్స్ సైరన్ల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ప్రమాద తీవ్రతను గమనించేలోపే ప్రయాణీకుల ప్రాణాల్లో కలిసిపోయిన వైనం బాధితుల బంధువుల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. (ఆయన ధైర్యమే కాపాడింది!) రెండు ముక్కలై పోయిన విమాన శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్న స్థానిక సివిల్ పోలీసులతో సహా రెస్క్యూ సిబ్బంది బాధితులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిన్న పిల్లలు సీట్ల క్రింద చిక్కుకుపోయిన దృశ్యం చాలా బాధ కలిగించిందని స్థానికులు చెప్పారు. భయంకరమైన శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు... కొందరికి, చేతులు కాళ్ళు విరిగిపోయాయి.. వారిని తరలిస్తున్న సమయంలో తమ చేతులు, దుస్తులు రక్తంలో తడిచిపోయాయంటూ తన భయంకర అనుభవాన్ని వివరించారు. నాలుగైదు సంవత్సరాల లోపు పిల్లలు భయంతో తమకు అతుక్కుపోయారంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అంబులెన్స్‌లు చేరుకోడానికే ముందే గాయపడిన వారిని కార్లలో వివిధ ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించామన్నారు. కాగా ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 10 మంది చిన్నారులతోపాటు 174 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉండగా, ఇద్దరు పెలెట్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. షార్జా, దుబాయ్‌లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. -
ఘోర ప్రమాదం; రెండు ముక్కలైన విమానం
-
విమాన ప్రమాదం; ఆయన ధైర్యమే కాపాడింది!
తిరువనంతపురం: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అసువులు బాసిన పైలట్ దీపక్ వసంత్ సాథే (59) అసమాన ప్రతిభ గురించి అనేక కీలక విషయాలను సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 22 ఏళ్ల అపార అనుభవం, విమానాలు నడపడంలో నిష్ణాతుడైన వసంత్ సాథే వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే విమానాన్ని నియంత్రించలేక పోయారనీ, విమానం రెండు ముక్కలైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు) వింగ్ కమాండర్ దీపక్ వసంత సాథే గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్21) పైలట్‌గా పనిచేశారు. ఖరాక్ వస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 58వ బ్యాచ్‌కు చెందిన సాథే అనేక మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో పైలెట్ సాథేది అందె వేసిన చెయ్యి. అంతేకాదు జూన్, 1981లో హైదరాబాద్ లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ అందుకున్నారు. 2003లో వాయుసేన నుంచి రిటైరైన అనంతరం 2005లోఎయిరిండియాలో చేరారు. అంకితభావం, అపారమైన నైపుణ్యం సాథే సొంతమని రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించారంటూ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. (రెండు ముక్కలైన విమానం) మరోవైపు ఆయన అప్రమత్తత వల్లనే ప్రాణాలతో బయటపడ్డామని, ఈ ప్రమాదంలో గాయపడిన వారు వ్యాఖ్యానించారు. ఆయన అనుభవం, ధైర్యంతోనే ప్రమాదం జరిగిన తరువాత మంటలను నివారించగలిగా రంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షం కారణంగా వాతావరణం అస్సలు బాలేదని ల్యాండింగ్ ముందే హెచ్చరించారు. రెండుసార్లు సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని ఇబ్రహీం అనే ప్రయాణికుడు తెలిపారు. కానీ ఆయన తెగువతో తాము అద్భుతంగా తప్పించుకుని స్వల్ప గాయాలతో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది మరణించిన సంగతి తెలిసిందే.. -
విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!
తిరువనంతపురం : దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు. (విమాన ప్రమాదం : 17 మంది దుర్మరణం) క్యారిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పైలట్లు ఇద్దరూ చనిపోయారని, క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయి. (విమాన ప్రమాదం: అత్యవసర సమావేశం) The Dubai-Kozhikode aircraft was at full speed while landing at the Karipur Airport & overshot the runway: Directorate General of Civil Aviation (DGCA) to ANI https://t.co/GpIvVe3BJs — ANI (@ANI) August 7, 2020 -
ఘోర ప్రమాదం; రెండు ముక్కలైన విమానం
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కోళీకోడ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోయలో పడిపోయింది. దాంతో బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. కోళీకోడ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అగ్ని ప్రమాదం జరగలేదని పేర్కొంది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన సహాయ బృందాలు క్షతగాత్రులను వైద్యశాలలకు పంపించాయి. సహాయ కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి మొయిదీన్ పర్యవేక్షిస్తున్నారు. కోళీకోడ్, మలప్పుర్ జిల్లాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి తరలించారు. ‘అది టేబుల్ టాప్ రన్‌వే. విమానం లోతైన లోయలో పడిపోయింది. మరణాలే కాకుండా, దాదాపు ప్రయాణీకులందరికీ గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకే, పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను, ఇతర సహాయ సామగ్రిని ఘటన స్థలికి పంపించాం’ అని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు. వర్షం, వెలుతురు సరిగ్గా లేకపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారాయన్నారు. దాదాపు 100 మందిని సమీప వైద్యశాలలకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రన్‌వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించింది. విమానం ల్యాండింగే సరిగ్గా జరగనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని డీజీసీఏ డైరెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రమాదస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కేరళ సీఎం విజయన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే సహాయ చర్యలకు ఆదేశించామని విజయన్ ప్రధానికి వివరించారు. సహాయ చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటనపై గవర్నర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నానని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన చెందుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: కేరళలోని కోళీకోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురికావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్‌వే షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలు ఘటనలో మరణించిన, గాయపడిన ప్రయాణీకులు, సిబ్బంది వివరాలు తెలిపేందుకు షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్లైన్లను ప్రారంభించారు. బాధితుల కుటుంబ సభ్యులకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి భారత రాయబారి డాక్టర్ అమన్ పురి తెలిపారు. కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్ కలెక్టర్ తెలిపారు. -
విమాన ప్రమాదం : 17 మంది దుర్మరణం
తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ప్రమాద వివరాలను వెల్లడించింది. మృతుల్లో పైలెట్‌తో పాటు ఆరుగురు సిబ్బంది, ప్రయాణికులు ఉన్నారని, వారి వివరాలను కాసేపట్లో వెల్లడిస్తామని తెలిపింది. విమానం తీవ్రంగా దెబ్బతినడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విమాన ప్రమాదంపై యావత్ దేశ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. (ఎయిరిండియా విమానానికి ప్రమాదం) విమాన ప్రమాదంపై మోదీ ఆరా కోజికోడ్ విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎయిర్ ఇండియా అధికారులకు సైతం ఫోన్ చేసి ప్రమాద ఘటన గురించి చర్చించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను మరింత ముమ్మరం చేయాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. విమాన ప్రమాదం బాధకు గురిచేసిందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులు సంఘటనా స్థలంలోనే ఉన్నట్లు బాధితులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. కోజికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన విచారకరమన్నారు. ప్రమాదం గురించి తెలిసి బాధకు గురైనట్లు తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అమిత్ షా ఆదేశించారు. -
కోజికోడ్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం
-
రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం
తిరువనంతపురం: కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో తీవ్రగాయాలపాలైన పైలట్, మరో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 20 అంబులెన్స్‌లు ఘటనాస్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. మరోవైపు ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాద సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది. కోజికోడ్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం ఫోటోలు ఇక్కడ క్లిక్ -
అర్ధరాత్రి స్వతంత్రం
తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం. ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్డౌన్ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్ బేకింగ్’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. బయట మార్కెట్లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే. ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది. క్రాఫ్ట్ బేకింగ్ కోర్సు ఫస్ట్ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్ నేషనల్ ట్రస్ట్, కోళికోడ్ పరివార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్.ఎ.పి. (అడిషనల్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్ బేకింగ్’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే. కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు. సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్’. ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్కీ వీలవుతుంది షైజాకు. లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్ చేయాలని ఎ.ఎస్.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట. బార్బీ కేకు, వైట్ వాంచో కేక్ -
సీరియల్ కిల్లర్ జూలీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, కోజికోడ్ : కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం చేతిని కోసుకుంది. దీంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం జూలీని కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆస్తి కోసం 14 ఏళ్ల వ్యవధిలో సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ హతమార్చింది. అంతేకాకుండా కట్టుకున్న భర్త రాయ్ థామస్‌ను కూడా ఆమె దారుణంగా హతమార్చి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కట్టుకథ అల్లింది. అయితే కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. (14 ఏళ్లు.. 6 హత్యలు) కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. రాయ్ థామస్ సైనైడ్ ప్రయోగంతో చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురి మరణాలపై పోలీసులు దర్యాప్తును కొనసాగించగా వారుకూడా సైనైడ్ ప్రయోగంతోనే ప్రాణాలు విడిచారని తేలింది. ఈ మరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఒక్కొక్కటిగా ఆమె అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘శాంతి, సామరస్యాల సమాహారం భారత్’
న్యూఢిల్లీ: విశ్వవ్యాప్తమైన హింస, ద్వేషం, ఉగ్రవాదం, ఘర్షణల నుంచి విముక్తి కోరుకునే ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఒక ఆశారేఖ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. శాంతి, సామరస్యపూర్వక జీవన విధానం కారణంగానే భారతీయ నాగరికత వర్ధిల్లిందన్నారు. బల ప్రదర్శన ద్వారా కాకుండా, శాంతి చర్చల ద్వారానే ఘర్షణలను నిరోధించగలమన్నది భారతీయుల విధానమన్నారు. కేరళలోని కోజికోడ్–ఐఐఎంలో గురువారం ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ పేరుతో జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఆంక్షలు లేనిచోటే సృజనాత్మకత, భిన్నాభిప్రాయం సహజంగా వస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మన విధానాలు సులభంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయని తెలిపారు. ‘భారత్ అభివృద్ధి సాధిస్తే ప్రపంచం పురోగమిస్తుంది. ప్రపంచం అభివృద్ధి చెందితే భారత్‌కు లబ్ధి చేకూరుతుంది. ఇదే మన విశ్వాసం’ అన్నారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. -
సైకిళ్లు అక్కడే; షాప్ మూసేశాడు!
తిరువనంతపురం: తమ సైకిళ్లను రిపేర్ చేయకుండా ఆలస్యం చేస్తున్న వ్యక్తిపై ఓ పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాపు యజమానితో మాట్లాడి.. ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించారు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. కోజికోడ్‌కు చెందిన అబిన్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో తన సైకిల్‌తో పాటు తన అన్న సైకిల్ కూడా పాడైపోవడంతో దగ్గర్లో ఉన్న షాపులో సెప్టెంబరు 5న రిపేరుకి ఇచ్చాడు. అయితే రెండు నెలలు గడిచినా షాపు యజమాని మాత్రం వారి సైకిళ్లు బాగుచేయలేదు. దీంతో తమ సైకిళ్లను రిపేర్ చేయించేలా మెకానిక్‌ను ఆదేశించాలని నవంబరు 25న అబిన్ పోలీసులకు లేఖ రాశాడు. తమ సైకిళ్లను తిరిగి ఇవ్వకుండా షాపు మూసేశారని లేఖలో పేర్కొన్నాడు ఈ క్రమంలో అబిన్ అభ్యర్థనను మన్నించిన పోలీసులు ఓ మహిళా అధికారిని షాపునకు పంపించి.. సైకిళ్లను రిపేర్ చేయించారు. తన కొడుకు పెళ్లి కారణంగా మెకానిక్ రెండు నెలలుగా షాపు మూసివేసినట్లుగా వెల్లడించారు. ఈ విషయాన్ని కేరళ పోలీసులు ఫేస్బుక్లో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. సైకిళ్లతో పాటు అబిన్ అతడి సోదరుడు ఉన్న ఫొటోలు చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారుల సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదే విధంగా అబిన్ ధైర్యాన్ని కూడా కొనియాడుతున్నారు. -
‘నన్నెవరు కిడ్నాప్ చేయలేదు’
అబుదాబి: కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చినట్లు ప్రచారం జరుగుతున్న కేరళ యువతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వివరాలు.. కేరళ కోజికోడ్‌కు చెందిన 19 ఏళ్ల సియానీ బెన్ని అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి సియానీ కనిపించకుండా పోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సియానీ అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దాంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సియానీ మీడియా ముందుకు వచ్చారు. తనను కిడ్నాప్ చేశారంటూ వస్తోన్న వార్తల్ని ఖండించారు. ప్రేమించిన యువకుడి కోసం తాను అబుదాబి వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సియానీ మాట్లాడుతూ.. ‘అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకోవడం కోసమే నేను అబుదాబి వెళ్లాను. నా ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. భారత్‌కు చెందిన నేను మేజర్ని. నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది’ అని తెలిపారు. అంతేకాక తన ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారానని అబుదాబి కోర్టులో కూడా తెలిపానన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం తనను కలుసుకోవడానికి అబుదాబి వస్తున్నారని పేర్కొన్నారు సియానీ. తనకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదని.. ఇక్కడే ఉంటానని.. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని సియానీ స్పష్టం చేశారు. అంతేకాక తనను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం చేస్తోన్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
బుర్ఖా నిషేధం.. చంపేస్తామని బెదిరింపులు
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎస్ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీచేసిన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎంఈఎస్ నిర్ణయం తీసుకుందని, దానిని వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కాల్ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనలు మేరకు డ్రస్‌కోడ్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని, దానికి అనుగుణంగానే ఎంఈఎస్ విద్యాసంస్థల పరిధిలో బుర్ఖాని నిషేధించామని పోలీసులు వద్ద వాపోయారు. కాగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ ఫజల్ గఫూర్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే దీనిపై కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యాసంస్థల్లో బుర్ఖాపై నిషేధం
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. ఇస్లాం మతాన్ని పాటించడంలో తప్పులేదని కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను సాటించడం సరికాదని ఫజల్ గఫూర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ ముధుక్కోయ థంగల్ మాట్లాడుతూ మత పరమైన అంశాలను ఎంఈఎస్ నిర్ణయించలేదన్నారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ తీసుకున్న నిర్ణయం సరి కాదన్నారు. బుర్ఖాను ధరించడం ఇస్లాం సాంప్రదాయంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మత సాంప్రదాయాన్ని వారు పాటించే హక్కు అందరికీ ఉందని.. నిబంధనలపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జఫ్రీ కోరారు. అయితే జఫ్రీ వ్యాఖ్యలపై స్పంధించిన ఎంఈఎస్ కేవలం కళాశాల ఆవరణంలోనే ఈ ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టమని వివరించారు. -
వణికిస్తున్న వెస్ట్ నైల్ వైరస్
తిరువనంతపురం: కేరళలో గతేడాది నిఫా వైరస్ సృష్టించిన అలజడి మరువకముందే.. తాజాగా వెస్ట్ నైల్ వైరస్ భయాందోళనలు రేకతిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్ నైల్ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడి వైద్యులకు సహాయం అందించడానికి ఎన్సీడీసీ గురువారం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. సోమవారం ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు. వెస్ట్ నైల్ వైరస్‌ను తొలుత 1937లో యుగాండాలో కనుగొన్నారు. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఉత్తర అమెరికాలో ఎక్కువగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదు అవుతాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ నివారించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందులు లేదు. దోమలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండచ్చు. వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మలప్పురం జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఉత్తర మలబార్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు మరెవరికి వెస్ట్ నైల్ వైరస్ సోకినట్టుగా కేసులు నమోదు కాలేదు. కాగా, గతేడాది నిఫా వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధితులకు వైద్యం అందిస్తున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడి మృతిచెందారు. -
కేరళ వరదలు : సర్టిఫికెట్లు లేవని యువకుడి ఆత్మహత్య
తిరువనంతపురం : కేరళను ముంచెత్తుతున్న వరదలు ఒక పంతొమ్మిదేళ్ల యువకుని భవిష్యత్తుని కూడా మింగాయి. వరదల్లో సర్టిఫికెట్లు నాశనం అయిన విషయం తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కొజికోడ్కు చెందిన కైలాష్ మరి కొద్ది రోజుల్లో ఐటీఐ కోర్సులో జాయిన్ కావాల్సి ఉంది. అందుకోసం కొంత డబ్బుతో పాటు కొత్త బట్టలు కూడా కొని పెట్టుకున్నాడు. కానీ అనుకోని ప్రమాదంలా వచ్చిన వరదలు అతని ఆశల్ని చిదిమేసాయి. కేరళను ముంచెత్తిన భారీ వరదల్లో కైలాష్ నివాసం కూడా మునిగి పోయింది. దాంతో కైలాష్ తల్లిదండ్రులతో కలిసి సమీప సహాయక శిబిరానికి వెళ్లాడు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు లేవని ప్రకటించడంతో కైలాష్ ఆదివారం తన నివాసానికి చేరుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల చూసిన అతనికి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ వరదల్లో కైలాష్ ఇంట్లోని వస్తువులే కాక అతని ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్లు కూడా నాశనమయ్యాయి. దాంతో మనస్తాపం చెందిన కైలాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళను వీడని వర్షాలు : 10 మంది గల్లంతు
సాక్షి, తిరువనంతపురం : కేరళను ముంచెత్తిన వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. వరద తాకిడికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోజికోడ్, కన్నూర్‌లలో వరద తాకిడికి తొమ్మిదేళ్ల బాలిక మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన బృందాలు, రాష్ట్ర బృందాలు కోజికోడ్‌లో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 22,918 ఎకరాల పంట ధ్వంసమైంది. పంప, మణిమాల, కకత్తార్ నదులు పొంగిపొర్లుతున్నాయని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోజికోడ్‌లో కుండపోత కారణంగా వీధుల్లో మోకాలిలోతు నీళ్లు చేరాయి. కాగా, భారీ వర్షాలతో కేరళలో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 25కు చేరింది. -
వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి మరీ..
సాక్షి, కోజికోడ్ : ధనార్జనే ధ్యేయంగా యాంత్రికంగా సాగుతున్న సమాజంలో వృత్తిని ప్రాణంగా ప్రేమించే వైద్యులు అరుదవుతున్న రోజుల్లో ఓ వైద్యుడి చర్య అందరినీ కదిలించింది. ప్రాణాంతక నిపా వైరస్‌తో మరణించిన రోగి అంత్యక్రియలను జరిపేందుకు బంధువులే వ్యాధి సోకుతుందనే భయంతో వెనుకాడితే డ్యూటీని పక్కనపెట్టి మరీ వైద్యుడు స్వయంగా ఆ తతంగం పూర్తిచేశారు. కోజికోడ్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ గోపకుమార్ స్వయంగా నిపా వైరస్‌తో మరణించిన 12 మంది మృతదేహాలకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి అంతిమ యాత్రను పర్యవేక్షించారు. ముగ్గురు నిపా బాధితుల అంత్యక్రియలను తాను నిర్వర్తించానని 41 ఏళ్ల గోపకుమార్ పేర్కొన్నారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటివరకూ 17 మంది మరణించారు. వీరిలో 14 మంది కోజికోడ్‌లో మరో ముగ్గురు పొరుగన ఉండే మలప్పురంలో తుదిశ్వాస విడిచారు. నిపా వైరస్‌తో మరణించిన 17 సంవత్సరాల బాలుడి అంత్యక్రియలను తాను నిర్వహించానని, నిపా వైరస్ సోకిందనే అనుమానంతో అతడి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడ్ని చూసే పరిస్థితిలోనూ లేరని గోపకుమార్ చెప్పారు. బాలుడి అంతిమయాత్రలో అతని సమీప బంధువులు, కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడం తనను బాధించిందని అన్నారు. అయితే బాలుడి అంత్యక్రియలను హిందూ సంప్రదాయాల ప్రకారం పూర్తిచేయాలని భావించి పూర్తి లాంఛనాలతో జరిపించానని చెప్పారు.ఇది తన బాధ్యతగా చేపట్టానని డాక్టర్ గోపకుమార్ చెప్పడం అక్కడివారిని కదిలించింది. -
‘ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లిని కేరళ హైకోర్టు కూడా ధ్రువీకరించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు. నేను చచ్చేవరకు హిందువుగానే జీవిస్తాను. ఇక అనీస్ హమీద్ కూడా జీవితాంతం ముస్లింగానే జీవిస్తాడు’ అని 24 ఏళ్ల శృతి మెలెడత్ వ్యాఖ్యానించారు. అనీస్ హమీద్‌తో జరిగిన వివాహాన్ని అక్టోబర్ 19వ తేదీన హైకోర్టు ధ్రువీకరించాక ఆమె మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె ఎర్నాకులంలోని ‘శివశక్తి యోగ విద్యా కేంద్రం’లో అనుభవించిన నరకయాతనను, తనను పెళ్లి చేసుకోవడం కోసం ఆరు నెలలపాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ హమీద్ అనుభవించిన బాధను మీడియాతో పంచుకున్నారు. కన్నూర్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న పిలాతర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శృతి, హమీద్‌లు 2010 నుంచి 2013 వరకు కలసి చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ కోసం శృతి, కన్నూర్ యూనివర్శిటీకే అనుబంధంగా ఉన్న తాలిపరంబ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరారు. డిగ్రీ తర్వాత కోజికోడ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సు చేసిన హమీద్ ఎంబీఏ కరస్పాండెన్స్ కోర్సు కూడా పూర్తి చేసి 2015లో ఢిల్లీలోని ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. పీజీ పూర్తి చేసిన శృతిని పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుండడంతో అప్పటికీ టచ్‌లో ఉన్న హమీద్‌తో విషయం చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో హమీద్, శృతి ఇంటికి తన తల్లిని తీసుకొని వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారు. అందుకు శృతి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు. ఇక ఎప్పటికీ తమ పెళ్లిని శృతి తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రహించిన శృతి, హమీద్‌లు గత మే 16వ తేదీన ఢిల్లీకి పారిపోయారు. అక్కడి సోనెపట్‌లో కొన్ని రోజులు కలసి జీవించారు. ఇంతలో శృతి తలిదండ్రులు హమీద్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేయడంతో కేరళ పోలీసులు వచ్చి శృతి, హమీద్‌లను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. శృతిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన పోలీసులు మే 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌కు ‘లవ్ జిహాద్’ కేసని వివరించారు. శృతిని తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించారు. పోలీసులు అలాగే చేశారు. తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లాక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవద్దంటూ శృతికి నయాన, భయాన చెప్పి చూశారు. ఎంతకు వినిపించుకోకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని శివశక్తి యోగా విద్యా కేంద్రంలో చేర్చారు. అక్కడ నరకాన్ని చూశాను! ఇతర మతంలోకి మారిన హిందువులను లేదా ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను హితబోధ ద్వారా మళ్లీ హిందూ మతంలోకి తీసుకరావడం ఈ యోగా విద్యా కేంద్రం ప్రధాన లక్ష్యం. కేరళలో ఇలాంటి కేంద్రాలు ఇంకా మూడు, నాలుగు పనిచేస్తున్నాయి. ఆ కేంద్రంలో తనతో అరవ చాకిరి చేయించారని, ఉదయం 4 గంటలకు ముఖాన నీళ్లు చల్లి బలవంతంగా లేపేవారని, వంట పాత్రలను కడగడంతోపాటు వంట చేయడం, యోగా కేంద్రాన్ని ఊడవడంతో సహా రాత్రి పది గంటల వరకు ఎడతెగని పని చేయించేవారని శృతి వివరించారు. తాను కేంద్రానికి వెళ్లినప్పుడు తనతోపాటు ఇతర మతాల యువకులను ప్రేమించిన 60 మంది యువతులు ఉన్నారని, వారందరితోని కూడా చాకిరి చేయించారని ఆమె చెప్పారు. హిత బోధనలు చేయడం కన్నా మతం మారినా, మతాంతర వివాహం చేసుకున్నా చంపేస్తామనే ఎక్కువ బెదిరించారని ఆమె తెలిపారు. జూన్ 26 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు అందులో నరకం అనుభవించానని చెప్పారు. కోర్టు జోక్యంతో న్యాయం హమీద్ తనను పెళ్లి చేసుకోవడం కోసం హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయపోరాటం మొదలుపెట్టి విజయం సాధించారని శృతి తెలిపారు. కోర్టు జోక్యంతో తాము తిరిగి కలుసుకునే అవకాశం లభించడంతో అక్టోబర్ 9వ తేదీన ‘స్పెషల్ మారేజెస్ యాక్ట్’ కింద పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి రోజే హైకోర్టుకు హాజరయ్యాం. సిరియాలో ఐఎస్ టెర్రరిస్టుల తరఫున యుద్ధం చేయడం కోసమే హమీద్ తనను పెళ్లి చేసుకున్నారని ప్రాసిక్యూటర్ వాదించారన్నారు. దాన్ని తాను తీవ్రంగా ఖంచించానని, కాలేజీ రోజుల నుంచి తమ మధ్యనున్న అనుబంధం గురించి వివరించానని చెప్పారు. చచ్చేవరకు హిందువుగానే జీవిస్తానని కూడా చెప్పానని ఆమె అన్నారు. తన ధైర్యానికి కోర్టు కూడా మెచ్చుకున్నదని తెలిపారు. తమ పెళ్లి చెల్లుతుందని కోర్టు ప్రకటించిందని చెప్పారు. అత్తా మామలను కూడా కోరుకుంటున్నాను మీడియాతోని శృతి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా ఉన్న హమీద్, తాను అత్తామామలతో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వారు మనసు మార్చుకునే వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని అన్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండంటూ మీడియా విష్చేయగా, ఇంకా తమ కష్టాలు తీరలేదని, ఈ పాటికి తన ఉద్యోగం పోయే ఉంటుందని హమీద్ అన్నారు. తనకు ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వచ్చిన కేరళ పోలీసు అధికారి తన బాస్‌తో చెప్పారని, అది బాస్ నమ్మి ఉంటే ఉద్యోగం పోవడం ఖాయమన్నారు. (ఇప్పటికీ మతతత్వ శక్తుల నుంచి శృతి, హమీద్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారి ఫొటోలను గుర్తించేలా ప్రచురించడం లేదు) -
పట్టపగలే అత్యాచార యత్నం.. వీడియో వైరల్
-
పట్టపగలే అత్యాచార యత్నం.. వీడియో వైరల్
సాక్షి, తిరువనంతపురం : మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్‌లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. ఈ నెల 18న వైఎంసీఏ రోడ్డులో అప్పుడే ఊరి నుంచి వచ్చిన యువతి తాను ఉంటున్న హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నిందితుడు ఆమెను అనుసరించాడు. వీధి చివరకు వెళ్లాక.. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను పొదల్లోకి లాక్కెళ్లాలని యత్నించాడు. ఆమె గట్టిగా అరుస్తూ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ఆధారంగా జంషీర్ ను గుర్తించిన నడక్కవ్ పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడిని 33 ఏళ్ల జంషేర్గా గుర్తించిన పోలీసులు.. గతంలోనూ అతనిపై పలు అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
జూన్‌లో చేరి.. సెప్టెంబర్‌లో ఉరేసుకుని!
సాక్షి, కోజికోడ్ : ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం కేరళలోని కోజికోడ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ క్రిష్ణ (23) ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. కోజికోడ్‌లోని నేషనల్ ఇన్స్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నానో టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో కోజికోడ్ నిట్‌లో చేరిన అరుణ్ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన రూమ్మేట్ ఇంటికి వెళ్లిపోవడంతో గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం ఉదయం ఓ విద్యార్థి అరుణ్ రూమ్ తలుపుతట్టగా ఎలాంటి స్పందనరాలేదు. ఎంతసేపు పిలిచిన అలికిడి లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. అరుణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అదివరకే ఆ విద్యార్థి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కోజికోడ్ నిట్‌లో, అరుణ్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి సూసైడ్ లేఖ లభ్యం కాలేదని సమాచారం. -
'మతం మారు.. లేదంటే నరికేస్తాం'
తిరువనంతపురం: 'మతం మారు లేదంటే ఆరు నెలల్లో కాలు, చేయి నరికేస్తాం' అంటూ మలయాళీ ప్రముఖ రచయిత కేపీ రామనుణ్ణికి బెదిరింపు లేఖ వచ్చింది. ఆరు నెలల్లో ముస్లిం మతంలోకి మారకుంటే ఆయన కుడి చేతిని, ఎడమకాలిని నరికేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బెదిరింపు లేఖ పంపించారు. కోజికోడ్‌లోని ఆయన నివాసానికి ఆరు రోజుల కిందట ఈ లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ లేఖ విషయంలో తనకు ఎవరిపైనా అనుమానం లేదని అంటున్నారు. ఈ లేఖపై ఉన్న చిరునామా ప్రకారం అది మళప్పురం జిల్లాలోని మంజేరీ ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. 'ఈ బెదిరింపు లేఖ ఎవరు ఉన్నారనే విషయం నాకు తెలియదు. నేను కోజికోడ్‌లో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాను. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని విచారిస్తామని చెప్పారు. తొలుత ఈ లేఖ వచ్చాక నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొంతమంది అనుభవజ్ఞులు ఇచ్చిన సలహా మేరకు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఆయన తెలిపారు. ఇటీవల ముస్లిం యువతను తప్పుదోవ పట్టించేలా రామనుణ్ణి రచనలు చేస్తున్నారని, వారికి విరుద్ధంగా రచనలు చేస్తున్న ఆయన వెంటనే ముస్లిం మతంలోకి మారాల్సిందేనని లేదంటే కాళ్లు, చేతులు నరికేస్తానని హెచ్చరించారు. -
ఇక్కడ బాంబు వేస్తే.. అక్కడ తగలబెట్టారు
కోజికోడ్: కేరళలో అధికార సీపీఎం, ఆర్ఎస్ఎస్ల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపినవాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన తర్వాత హింసాత్మక చర్యలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రావత్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత గురువారం రాత్రి కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే కోజికోడ్‌లోనే సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు సీపీఎం కార్యాలయాన్ని తగలబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. పరస్పర దాడులతో కోజికోడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సంబంధిత వార్తలు చదవండి సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి! ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత -
పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న భర్తపై చర్యలు
కోజీకోడ్: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న ఓ వ్యక్తిపై కోజీకోడ్ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు. 'ఏ మతం కూడా పుట్టిన బిడ్డను ఆకలితో ఉంచమని చెప్పదు.. ఈ చర్యకు పాల్పడిన, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే' అంటూ కలెక్టర్ ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా ముక్కమ్ లోని ఓ ఆసుపత్రిలో అబూబాకర్ సిద్ధిక్ అనే వ్యక్తి భార్య బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టమని ఆసుపత్రి సిబ్బంది తల్లికి సూచించారు. అయితే.. బిడ్డకు పాలివ్వడానికి వీలు లేదంటూ అబూబాకర్ భార్యను అడ్డుకున్నాడు. పుట్టిన బిడ్డ ప్రార్థనలు వినేంతవరకు పాలుపట్టడానికి వీలు లేదంటూ అడ్డుకున్నాడు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అబూబాకర్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతడు మాత్రం తన పట్టు వీడలేదు. తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు సైతం ఇలాగే చేశానని.. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడంటూ వాదించాడు. అంతేకాదు.. బిడ్డకు ఏదైనా జరిగితే ఆసుపత్రి వారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం తరువాతే బిడ్డకు పాలుపట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు శుక్రవారం అబూబాకర్, ఆయన భార్యను విచారించారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై అబూబకర్ నుంచి వివరణ కోరామని తెలిపారు. -
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలివ్వకుండా..
కోజికోడ్: మతవిశ్వాసాల పేరుతో ఓ వ్యక్తి అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా 24 గంటలు అడ్డుకున్న ఘటన కేరళలో జరిగింది. అబు బక్ర్ అనే వ్యక్తి భార్య కోజికోడ్‌లోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, మసీదులో ఐదు ప్రార్థనలు (ఆజాన్) పూర్తయ్యేవరకు శిశువుకు మొదటి ఆహారం అందివ్వకూడదంటూ అతడు అడ్డుకున్నాడు. అతని తీరుపై వైద్యులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలపాటు తల్లిపాలు ఇవ్వకుంటే శిశువు ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముందని చెప్పారు. దీంతో వాదనకు దిగిన అతను తన భార్య, శిశువును తీసుకొని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారనే సమాచారం తెలియరాలేదు. ‘ఐదు అజాన్లు వినేవరకు అతను తన కొడుకుకు తల్లిపాలు ఇవ్వనివ్వబోనని అడ్డుకున్నాడు’ అని ఆస్పత్రి వైద్యుడు సాజి సీకే తెలిపారు. ‘ఇలా చేయడం వల్ల శిశువు ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశమందని చెప్పినా అతను వినిపించుకోలేదు. నవజాత శిశువుకు ప్రతిరెండుగంటలకు ఒకసారి తల్లిపాలు, లేదా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల శిశువుకు ఎలాంటి ప్రాణాపాయ ముప్పు వాటిల్లకుండా చూడొచ్చు’ అని ఆయన తెలిపారు. భార్యను శిశువును తీసుకొని వెళ్లతున్న అతనిని ఒప్పించేందుకు వైద్యులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, సిటీ మెడికల్ కాలేజీకి వెళుతున్నానంటూ అతను గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
పేదల సంక్షేమమే బీజేపీ మూల సిద్ధాంతం: మోదీ
కొజికోడ్: 'ఒకరు ఉన్నతంగా ఉండి, మరొకరు కుంగిపోయి ఉంటే.. పైనున్నవాళ్లు తమను తాము తగ్గించుకుని కిందున్నవాళ్ల చెయ్యి పట్టుకుని నడిపించాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే అనుసరించాల్సిన విధానమిదే అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉద్భోధించారు. భారత్ లో ముస్లింలు మిగతావారితో సమానంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు బీజేపీ కార్యకర్తలంతా పునరంకితం కావాలి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దన్ దయాళ్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం కొజికోడ్(కేరళ)లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. అప్పట్లో ఇతర పార్టీల్లోనూ మంచి వ్యక్తులు ఉండేవారని, అయితే బీజేపీని స్థాపించినవాళ్లు ఇతర పార్టీల్లోని వారికంటే మంచివాళ్లని, పార్టీ సిద్ధాంతాలుగానీ, విధానాలుగానీ పేదలకు మేలు చేసేలా ఉండటమే అందుకు నిదర్శనమని నరేంద్ర మోదీ అన్నారు. పేదల సంక్షేమమే బీజేపీ మూల స్వరూంమని, తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ చేయడానికేనని, సంపాదన కోసం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ మారాలి సువిశాల భారతావనిలో సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ మారాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణం. అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుతోంది. తద్వారా సామాన్యుడికి మరింత మేలు జరగడమేకాక ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మేం నమ్ముతున్నామని పేర్కొన్నారు. హింసోన్మాదులపై నిప్పులు 'బీజేపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో భాగంగా గడిచిన మూడు రోజులుగా కొజికోడ్ లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న నేను కొందరు కార్యకర్తలను కలిశాను. ప్రత్యర్థులు తమపై జరుపుతున్న పాశవిక దాడుల గురించి వాళ్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో హింసోన్మాదులకు చోటులేదు. దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా ప్రజల కోసం పోరాడాలికానీ మా కార్యకర్తపై దాడులు చేయడం హేయం'అని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో బీజేపీ కార్యకర్తపై జరుగుతోన్న దాడులపై రచించిన 'ఆహుతి' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. 'ఆహుతి'పై అన్ని రాష్ట్రాల్లో చర్చ జరగాలి. కేరళ కార్యకర్తలకు దేశమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే బీజేపీ మూల సిద్ధాంతం
-
యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: ప్రధాని మోదీ
కోజికోడ్: ఉడీ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ పాకిస్థాప్ పై నిప్పులు చెరిగారు. 18 మంది జవాన్లను పోగొట్టుకున్న ఉడీ ఘటనను భారత్ ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భాగంగా శనివారం కేరళలోని కోజికోడ్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సభలో ఆయన మాట్లాడారు. 'పాకిస్థాన్ ప్రజలారా.. ఇండియా గడ్డ నుంచి మీతో మాట్లాడుతున్నా.. చరిత్ర మొదలు 1947 వరకు మీ పూర్వీకులు ఇక్కడి నేలకు నమస్కరించినవారేనని గుర్తుంచుకోండి. విడిపోయిన తర్వాత మీ పాలకులు ఏ విధంగా మారిపోయారో ఒక్కసారి గమనించండి. గడిచిన కొద్ది నెలల్లో ఒక్క కశ్మీర్ లోనే 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఎవరి బిడ్డలు? ప్రస్తుతం భారత్ నుంచి అన్ని దేశాలకు ఇంజనీర్లను పంపుతున్నాం. కానీ మీ దేశం(పాకిస్థాన్) ఏం చేస్తోంది? ఉగ్రవాదులను పంపుతోంది.. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోంది. పాక్ అన్నదమ్ములారా.. మీతో కలిసి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. రండి.. పేదరికంపై, ఆకలిదప్పులపై యుద్ధం చేద్దాం. అప్పుడు పాకిస్థాన్, ఇండియాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..' అని మోదీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఉగ్రవాదులూ చెవులు రెక్కించి వినండి.. ఉరీ ఘటనను మేం మర్చిపోం. అని హెచ్చరికలు జారీచేశారు. ఇంకా.. '21వ శతాబ్ధంలో అద్భుతాలు సాధించాలనే దిశగా ఆసియా దేశాలన్నీ కలలు కంటున్నాయి. ఒకేఒక్క దేశంతప్ప! ఆ దేశం(పాకిస్థాన్) వల్ల ఒక్క భారతేకాదు ఆసియా దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొటున్నాయి. పాకిస్థాన్ ను నిందిస్తున్నాయి. ఆ దేశం తీరు ఎలా ఉంటుందో చూడండి.. ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో కశ్మీర్ లోని కొంత భాగం(పీవోకే), బలూచిస్థాన్, గిల్గిట్ లు ఉన్నాయి కదా, వాటినైనా సరిగ్గా పరిపాలిస్తున్నారా? అక్కడి ప్రజల సమస్యలు తీరుస్తున్నారా? అలా చెయ్యకపోగా వాళ్ల(పాకిస్థాన్ కన్ను) మన కశ్మీర్ పై పడింది. పాకిస్థాన్ కు నేను గట్టిగా చెప్పదలుచుకున్నా.. పీవోకే, గిల్గిట్, బలూచ్ లలో ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా'అని మోదీ అన్నారు. -
‘ఉడీ’ ప్రతీకారంపై నోరువిప్పనున్న మోదీ!
కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో శనివారం నుంచి బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాక్ ఉగ్రవాదుల దాడిలో 18మంది జవాన్లను కోల్పోయిన ఉడీ ఘటన నేపథ్యంలోపాక్పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు తలెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ ప్రజల కోరిక మేరకు పాక్‌పై త్వరలోనే ప్రతీకార దాడులుంటాయని బీజేపీ నేత ఒకరు సంకేతాలిచ్చారు. శనివారం మోదీ కోజికోడ్ రానున్నారు. కాగా, ఈ సమావేశాలకు ముందుగా.. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ భేటీని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా పేదల కోసం కేంద్రం చేపట్టిన పథకాలను మరింత పక్కాగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలకు తెలిపారు. కాగా, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ‘గరీబ్ కల్యాణ్’ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అంత్యోదయ (చివరి వ్యక్తి వరకు లాభం జరిగే)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ తెలిపారు. -
23-25 మధ్య బీజేపీ జాతీయ మండలి సమావేశాలు
న్యూఢిల్లీ: కేరళలోని కోజికోడ్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే బీజేపీ జాతీయ మండలి సమావేశాలను పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌కు అంకితమివ్వనున్నారు. 25న ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాలను, ఆయన స్మృత్యర్థం ఏడాది పాటు జరిగే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌కు ఉపాధ్యాయ్ 1967లో ఇదే వేదికలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సమావేశాల్లో ‘పేదల సంక్షేమం’ను ప్రధాన ఎజెండాగా చేపడుతారు. 2 వేల మంది పార్టీ ప్రతినిధులకు వసతి కల్పించే స్వప్న నగరిలోని ప్రాంతానికి ఉపాధ్యాయ్ పేరు పెడతారు. అక్కడ ఓ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తారు. ఆధునిక కాల రాజకీయ నాయకుల్లో ఉపాధ్యాయ్‌కు తగిన గుర్తింపు దక్కలేదని బీజేపీ నేతలు తరచూ ఆవేదన చెందుతున్నారు. 25న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతారు. తరువాత మోదీ ముగింపు ప్రసంగం చేస్తారు. దళితులపై వరస దాడులు, ధనికుల అనుకూల ప్రభుత్వం అని విమర్శలు ఎదురవడంతో పేదలకు చేరువయ్యేందుకు బీజేపీ ‘గరీబ్ కళ్యాణ్(పేదల సంక్షేమం)’ ఎజెండాను ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. -
'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'
కోజికోడ్: లౌకికవాదులు ఎప్పుడూ హిందూ మతవాదులనే ప్రశ్నిస్తారుగానీ.. ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు అని వివాదాస్పద రచయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ అన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. శనివారం కోజికోడ్‌లో జరుగుతున్న 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్' కు హాజరయ్యారు. ఇండియాలో అసహనం ఉందని తాను భావించడంలేదన్న తస్లీమా ఇక్కడ ఒకరి నమ్మకాలపై మరొకరు సహనంతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. భారత చట్టాలు అసహనానికి మద్దతు పలకవని, అయినప్పటికీ ఇక్కడ అసహనానికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీకాదని అన్నారు. లౌకికవాదులు గా పేరుపొందినవారు కేవలం హిందూ మతవాదులనే ప్రశ్నించి ఊరుకుంటారని, ముస్లిం మతవాదుల జోలికి పోరని, ఇలాంటి బూటకపు లౌకికవాద ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదని తస్లీమా అభిప్రాయపడ్డారు. -
ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ పేజీ...!
ఇటీవల స్వ ప్రయోజనాలకోసం సామాజిక మాధ్యమాలను వినియోగించుకొంటున్నవారిని ఎందరినో చూస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, రచయితలు ఇలా ప్రతివారూ తమను తాము పరిచయం చేసుకొనేందుకు , తాము చేసే పనులను ప్రచారం చేసుకొనేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటుంటారు. అయితే ఆ ప్రభుత్వాధికారి మాత్రం ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయడం కోసం ఫేస్ బుక్ ను ఆయుధంగా చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ జిల్లా ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండి, వారి సమస్యలను తీరుస్తూ లక్షకు పైగా ఫాలోయర్స్ తో ఆ పేజీకే సార్థకత చేకూరుస్తున్నారు. ఫేస్ బుక్ లో 'కలెక్టర్ కోజికోడ్' పేరున కొనసాగుతున్న ఆ పేజీకి అతడొక్కడే నాయకుడు. కేరళలోని కోజికోడ్ జిల్లా కలెక్టర్... ప్రశాంత్ నాయర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న ఈ పేజీ జిల్లా పరిపాలనకు నేతృత్వం వహిస్తూ... స్థానిక ప్రజల ప్రశంసలనందుకుంటోంది. వివిధ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు నాయర్ ఈ సోషల్ మీడియాను ప్రచార సాధనంగా వినియోగిస్తున్నారు. కలెక్టర్ కోజికోడ్ పేరున కొనసాగుతున్న ఈ పేజీలో వచ్చే ప్రతి వ్యాఖ్యకు ప్రభుత్వాధికారులు సమాధానం ఇవ్వడం మొత్తం సోషల్ మీడియాలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతిరోజూ ప్రజా సమస్యలపై చర్చిస్తూ, వారికివ్వాల్సిన సూచనలిస్తూ.. మంచి ప్రచార సాధనంగా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో నాయర్ ఉనికిని రాజకీయ నాయకులు ఎన్నోసార్లు విమర్శించినా అతడు వెనుకంజ వేయలేదు. అంతేకాదు సాధ్యమైనంతమందికి అందుబాటులో ఉండాలంటూ నిర్వాహకులకు నాయర్ సూచించడం విశేషం. ఫేస్ బుక్ పేజీ... జిల్లా ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రశాంత్ నాయర్ కు ఎంతగానో సహకరిస్తోంది. స్థానికులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాక వచ్చిన ప్రతి కామెంట్, ఫిర్యాదులు, సలహాలకు ప్రశాంత్ వెంటనే స్పందింస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఆకలి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రారంభించిన ఆపరేషన్ సలైమణి... కోజికోడ్ పేజీలో ఎంతో గుర్తింపు కూడ పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా పలు కారణాలతో భోజనానికి డబ్బు వెచ్చించలేని ప్రజలకు సలైమణి కూపన్లను అందించి వారి ఆకలి తీరుస్తుంటారు. పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రెస్టారెంట్లు, దుకాణాల వద్ద విద్యార్థి వాలంటీర్లు ఈ కూపన్లను పంపిణీ చేస్తుంటారు. కూపన్ తో ఆ ప్రాతంలో ఆహారం విక్రయించే వారివద్ద ఉచితంగా భోజనం పొందవచ్చు. సదరు భోజనశాల, హోటల్ నిర్వాహకులకు సలైమణి క్యాంపెయిన్ నిర్వహించే సంస్థ డబ్బు చెల్లిస్తుంది. దీనికితోడు స్థానిక మానసిక ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాక బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనకు వ్యతరేకంగా.. ఛాయాచిత్రాలను పంపించే త్రిమూర్తి ఫొటో పోటీని కూడ ఆన్ లైన్ లో ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారో... ఎక్కడ అందుబాటులో ఉంటారో ప్రభుత్వాధికారులు అక్కడ ఉండాలి అన్నది ప్రశాంత్ నాయర్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆయన సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. ఒకప్పటిలా కార్యాలయాల్లో బోర్డులకు నోటీసులు అంటించడం ప్రస్తుతం పనికి రాదని ప్రజల్లోకి పారదర్శకంగా పాలన వెళ్ళాలంటే సోషల్ మీడియా ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మార్గం అని ప్రశాంత్ సూచిస్తున్నారు. -
విద్యార్థి ప్రాణం తీసిన చెట్టు
కోజికోడ్: కొబ్బరి చెట్టు కూలిపోయి మీద పడడంతో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కేరళలోని చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలోని మీనచంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులు వీయడంతో కొబ్బరిచెట్టు కూలి ఆడుకుంటున్న విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో షిజిల్ అహ్మద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఎర్నాకులం జిల్లా కొత్తమంగళంలో గతనెలలో స్కూల్ బస్సుపై చెట్టుపడి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. -
కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు
సీఐఎస్ఎఫ్ జవాను మృతి, మరొకరికి గాయాలు కోజికోడ్(కేరళ): కోజికోడ్ దగ్గర్లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ జవాన్లకు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఇది కాల్పులకు దారితీయడంతో ఓ జవాను మృతిచెందాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణతో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. ఈ పరిణామాలపై కేరళ హోంమంత్రి రమేశ్ విచారణకు ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన అగ్నిమాపకదళ అధికారిని సోదా చేసే క్రమంలో తలె త్తిన వాదన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ జైపాల్ యాదవ్ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీలతో ప్రయాణికులను కొట్టి, విమాన సర్వీసులను అడ్డుకున్నారని సాక్షులు తెలిపారు.