తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నా రెండు చేతులు పోయాయనుకున్నా. తీవ్రమైన నొప్పితో కనీసం కదపడానికి కూడా వీలు లేనంత బాధను భరించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెలకువ రాగానే నా సోదరుడిని నేను అడిగిన మొదటి ప్రశ్న నా చేతులు ఏవి అని. ఆ సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరో నన్ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ప్రతీ ఒక్కరిలో కరోనా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మాస్క్‌ను కొంచెం సేపు కూడా పక్కన పెట్టలేదు. ఎవరూ వాష్‌రూంకు కూడా వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అందరిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే పెద్ద శబ్ధం రావడంతో అందరం చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో తెలుసుకనేలోపే విమానం ముక్కలైంది. ఆ తర్వాత ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాం' అనే విషయాలను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (కోళీకోడ్ ప్రమాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం)
దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు గాయాలపాలై ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారిలో ఆశిక్ ఆయన సోదరుడు మొహమ్మద్ అస్సియాస్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నామని, చాలామంది సహాయం చేయడానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి తన సోదరుడు ఏమై పోయాడో అని మళ్లీ వెనక్కి వచ్చి చూసుకున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని తనకు సహాయం చేసిన వైద్యులు, సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. (కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్)
Comments
Please login to add a commentAdd a comment