
‘ఉడీ’ ప్రతీకారంపై నోరువిప్పనున్న మోదీ!
కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో శనివారం నుంచి బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాక్ ఉగ్రవాదుల దాడిలో 18మంది జవాన్లను కోల్పోయిన ఉడీ ఘటన నేపథ్యంలోపాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు తలెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ ప్రజల కోరిక మేరకు పాక్‌పై త్వరలోనే ప్రతీకార దాడులుంటాయని బీజేపీ నేత ఒకరు సంకేతాలిచ్చారు. శనివారం మోదీ కోజికోడ్ రానున్నారు.
కాగా, ఈ సమావేశాలకు ముందుగా.. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ భేటీని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా పేదల కోసం కేంద్రం చేపట్టిన పథకాలను మరింత పక్కాగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలకు తెలిపారు. కాగా, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ‘గరీబ్ కల్యాణ్’ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అంత్యోదయ (చివరి వ్యక్తి వరకు లాభం జరిగే)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ తెలిపారు.