Ankola Landslide: ఐదు రోజులుగా గాలింపు.. అర్జున్‌ ఆచూకీ దొరికేనా! | Ankola Landslide: Search for Kozhikode Lorry Driver Arjun continues on fifth day | Sakshi
Sakshi News home page

Ankola Landslide: ఐదు రోజులుగా గాలింపు.. అర్జున్‌ కోసం ఆశగా ఎదురుచూపు

Published Sat, Jul 20 2024 4:24 PM | Last Updated on Sat, Jul 20 2024 4:57 PM

Ankola Landslide: Search for Kozhikode Lorry Driver Arjun continues on fifth day

దేశ వ్యాప్తంగా వనలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో వరదలు ముంచెత్తున్నాయి భారీ వర్షాలతో అక్కడక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. భవనాలు కూలుతున్నాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సైతం వాటిల్లుతోంది. దీంతో పలు రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

తాజాగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో  నాలుగు రోజుల క్రితం అంకోలా తాలుకాలోని షిరూర్‌లో వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జూలై 16న  500 మీటర్ల ఎత్తు నుంచి ఓ కొండ షిరూర్  జాతీయ రహదారి మీద పడటంతో.. పక్కనే టీ దుకాణం వద్ద ఉన్న దాదాపు 10 మంది గల్లంతయ్యారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను గురువారం వెలికి తీయగా... మరో ముగ్గురి ఆచూకి తెలియాల్సి ఉంది.

భారీ మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్‌ అర్జున్‌ మూలడికుజియిల్ కూడా ఉన్నాడు. కన్నడిక్కల్‌కు చెందిన అర్జున్ (30) ట్రక్కులో కలపను ఎక్కించుకుని జగల్‌పేట నుంచి కోజికోడ్‌కు వెళ్లాడు. షిరూర్‌లోని ఓ హోటల్‌లో టీ తాగేందుకు ఆగి ప్రమాదానికి గురయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో అతనితోపాటు ట్రక్కు కనిపించకుండా పోయాయి.

విషయం తెలుసుకున్న అర్జున్‌ కుటుంబం కేరళ సీఎం పినరయి విజయన్‌ను సంప్రదించడంతో ఆయన స్పందించి..  కర్ణాటక సీఎం  సిద్ధరామయ్యకు లేఖ రాశారు. అర్జున్‌ను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అర్జున్ ఆచూకీ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ లాంటి వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసేందుకు కోజికోడ్‌ కలెక్టర్‌ స్నేహిల్‌ కుమార్‌ సింగ్‌ను నియమించారు.

అర్జున్‌తోపాటు తప్పిపోయిన మరో ఇద్దరి కోసం గత అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారిపై ఉన్న మట్టిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు,  అగ్నిమాపక దళం, ఇండియన్‌ నేవీ  కృషి చేస్తున్నాయని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. అయితే ఎత్తైన భూఘాగం, భారీ వర్షాలు, పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి శనివారం ఉదయం తిరిగి ప్రారంభించారు.

తాము చేరుకోలేని ప్రాంతాలలో శిథిలాల మధ్య,  జాతీయ రహదారి పక్కనే ఉన్న నదిలో మృతదేహాలను వెతకడానికి హెలికాప్టర్‌తో సహాయం చేయమని  కోస్ట్ గార్డ్‌కు లేఖ రాసినట్లు ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మిప్రియా తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయం అసాధ్యంగా మారిందని చెప్పారు. కొన్ని రోజులుగా అర్జున్‌ ఆచూకీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అర్జున్ నడుపుతున్న లారీ జీపీఎస్‌ సిగ్నల్ చివరగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశం నుంచే అందుతుందని తెలిపారు.

అర్జున్‌  కోసం ఆశగా..
మరోవైపు అర్జున్‌ ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆయన భార్య కృష్ణప్రియ, తండ్రి ప్రేమన్, తల్లి షీలాతో పాటు బంధువులంతా  ఆశగా ఎదురు చేస్తున్నారు. అధికారులు ఎలాగైనా తన తప్పుడిని కాపాడాలని, ఏదో అద్భుతం జరుగుతందనే నమ్మకం ఉందని అతడి సోదరి అంజు ఆశాభావం వ్యక్తం చేశారు.  

‘అర్జున్‌ లాంగ్ ట్రిప్‌లకు వెళ్లిన ప్రతిసారీ మాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. నేను జూలై 16న చివరిసారి అతనితో మాట్లాడాను.మరుసటి రోజు నుండి అతనిని సంప్రదించలేకపోయాను.. శుక్రవారం ఉదయం  డయల్ చేసినప్పుడు అర్జున్ రెండో మొబైల్ ఫోన్ రింగ్ అయింది’అని ఆయన భార్య కృష్ణప్రియ తెలిపారు.

అయితే ప్రస్తుతం అర్జున్‌ కుటుంబం ప్రమాదంజరిగిన షిరూర్‌లో ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగడం లేదని ఆరోపించారు. పలు వాహనాలు బురదలో కూరుకుపోయినా అధికారులు కేవలం రెండు ఎర్త్ మూవర్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. కేరళ సీఎం, మంత్రులు, కేరళ-కర్ణాటక అధికారులు జోక్యం చేసుకోవడంతో నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెబుతున్నారు.

కాగా కోజికోడ్‌లోని కినాస్సేరిలో  అర్జున్  ఎనిమిదేళ్లుగాముక్కాంకు చెందిన ఓ వ్యాపారి వద్ద  లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా అంతర్‌ రాష్ట్ర పర్యటనలకు వెళ్లేవాడు. అతను కలపను లోడ్ చేయడానికి క్రమం తప్పకుండా బెలగావికి వెళ్లేవాడు, రెండు వారాల తర్వాత  తిరిగి వచ్చేవాడు. అయిదుగురు సభ్యుల కుటుంబానికి అర్జున్‌ ఒక్కడే సంపాదకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement