
తిరువనంతపురం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రాష్టంలోని కొన్నిప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కొజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్టు జారీ చేసింది. అదే విధంగా మలప్పురం, ఇడుక్కి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇడుక్కి జిల్లాలో శుక్రవారం ఉదయం కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో తేయాకు తోట కార్మికులు నివసించే మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతంలో 70 నుంచి 80 మంది నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. (బిహార్‌లో వరద బీభత్సం: 21 మంది మృతి)
వీరిలో కనీసం మూడు కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని, మరో 10 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఘటన ప్రాంతానికి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజమాలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రజలను రక్షించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డిఆర్‌ఎఫ్) మొహరించామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పోలీసులు, అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. (రెడ్ అలర్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు)