
ఢిల్లీ: హెచ్‌సీయూ భూముల (HCU Land Issue) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఢిల్లీలో ఉన్న అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘ లగచర్లలో ఒత్తిడి వస్తే దాన్ని మేము విత్ డ్రా చేసుకున్నాం. మా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధం. హెచ్ సీయూ భూములను మేము తీసుకోలేదు.
పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి చేస్తాం. నెమలి, జింకలు ఉన్నాయని ఏఐ గ్రాఫిక్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వేలాది ఎకరాలను కొంతమంది దోచుకున్నారు. 111 జీవో ఎత్తివేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం హెచ్ సీయూ భూముల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పర్యావరణ విధ్వంసాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.