
ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ.. 108 మంది అరెస్టు
యూనివర్సిటీలో పటిష్ట బందోబస్తు
బీఆర్‌ఎస్ నేతలు దిలీప్, క్రిషాంక్‌పై కేసు నమోదు
గచ్చిబౌలి : కంచ గచ్చిబౌలిలోని భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గురువారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ, నగరం నుంచి ఆటోలు, బస్సుల్లో కార్యకర్తలు హెచ్‌సీయూ వద్దకు చేరుకున్నారు. పోలీసుల దృష్టి మరల్చి పదుల సంఖ్యలో నిరసనకారులు పలుమార్లు వర్సిటీ సర్వీస్ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది.
ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 108 మంది ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల్లో మొయినాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. హెచ్‌సీయూ కేంద్రంగా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు.
గురువారం హెచ్‌సీయూ ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన రహదారి, గోపన్‌పల్లి గేట్, 400 ఎకరాలు ఉన్న వైపు, క్యాంపస్ లోపల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు 400 ఎకరాల భూముల విష యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని అరుణ్‌రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణతం దిలీప్,తో పాటు డాక్టర్ క్రిషాంక్ తదితరులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 353 (1)(బి), 353 (1)సి, 353(2), 192, 196(1), 61(1)(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
లాఠీఛార్జి చేయలేదు: డీసీపీ
హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. బారికేడ్లను దాటుకొని వస్తున్న విద్యార్థులను కేవలం తాళ్లతో అడ్డుకున్నామని చెప్పారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసు సిబ్బందిని నెట్టేసి, హోల్డింగ్ తాడును లాక్కోవడానికి ప్రయత్నించారని, దీంతో లాఠీలను నేలపై, తాళ్లపై కొడుతూ విద్యార్థులను అక్కడి నుంచి పంపించామని వివరించారు.
వర్షంలోనే పాటలు.. డ్యాన్స్‌లు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్నా.. డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.