
వివిధ ప్రాజెక్టుల కోసం ముంబైలో వేలాది చెట్ల నరికివేత
తరుగుతున్న పచ్చదనం...పెరుగుతున్న వాయుకాలుష్యం
దీన్ని చక్కదిద్దేందుకు ఎంఎంసీ పార్కుల విభాగం కృషి
‘మియావాకీ’విధానంలో పార్కుల్లో మొక్కల పెంపకం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల విభాగం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మియావాకీ విధానాన్ని అనుసరిస్తూ మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ డిపార్ట్‌మెంట్ కార్యాలయ సిబ్బంది ఇటీవల పోవై ప్రాంతంలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్‌లో 2,000 మొక్కలను నాటారు. పార్క్ సూపరింటెండెంట్ జితేంద్ర పరదేశి, డిప్యూటీ సూపరింటెండెంట్ సాహెబ్రావ్ గవిట్, ఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ అధికారి రిషికేశ్ హెండ్రే నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముంబై నగరంలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం వేలాది చెట్లను నరికివేయడం వల్ల వాయుకాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. దీనిని నివారించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నడుంబిగించింది. నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు మియావాకీ పద్ధతిని కూడా అనుసరించాలని నిర్ణయించింది. ముంబై నగరానికి మరింత పచ్చదనాన్ని తీసుకురావడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు సహాయపతుతుందని నగరవాసులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.