
షేగావ్ నుంచి పండరీపూర్ వరకు యాత్ర
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పండరీపురంలో జరగనున్న ఆషాడీ ఏకాదశి మహోత్సవం సందర్భంగా శ్రీసంత్ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర జూన్ 2న ఉదయం 7 గంటలకు షేగావ్ నుంచి వైభవంగా ప్రారంభమవుతుంది. శతాబ్దాలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యాత్ర 56వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డప్పులు, మృదంగాల శబ్దాలతో, చేతుల్లో భగవద్ ధర్మ పతాకాలు పట్టుకుని హరినామ జపం చేస్తూ వందలాది మంది వార్కారీలు ఈ పుణ్య యాత్రలో భాగమవుతున్నారు. ఈ పల్లకీ ఊరేగింపు ద్వారా భక్తులు విఠోబా దర్శనం చేసుకునేందుకు పండరీపురం చేరుకుంటారు. ఈ యాత్రలో జెండా మోసే వారు, గాయకులు, ముండాగ్ వాయించే కళాకారులు, సేవకులు కలిపి సుమారు 700 మంది పాల్గొంటున్నారు.
యాత్రలో ఒక వినికారి, ఒక తల్కారి, ఒక జెండా మోసేవాడు తదితరులు క్రమశిక్షణతో నడుస్తూ ప్రతి గ్రామంలో భజన, కీర్తన, ఉపన్యాసాల ద్వారా భగవద్ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా వార్కారీలు హరినామ స్మరణతో ముందుకు సాగుతారు. జూన్ 2న నాగజారి శ్రీ క్షేత్రం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు సాగి జూలై 4న పండరీపురానికి చేరుకుంటుంది. మంగళవేదం వద్ద చివరి బస అనంతరం శ్రీ పల్లకీ పండరీపురం ప్రవేశిస్తుంది. అక్కడ జూలై 4 నుంచి 9 వరకు ఉత్సవాల్లో పాల్గొని, జూలై 10న తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
షేగావ్‌లో జూలై 31న యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో పరాస్, గైగావ్, అకోలా, పర్లి, అంబజోగై, షోలాపూర్ వంటి అనేక పట్టణాలు, గ్రామాలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతి రోజు ఉదయం హరిపథ్, భజనలు, శ్రీచి ఆరతి వంటి కార్యక్రమాలతో ఈ యాత్ర ప్రత్యేకంగా సాగుతోంది. పండరీభూమి అడుగుపెట్టే ముందు వార్కారీలు అక్కడి మట్టిని నుదుటిపై పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. యాత్ర ముగిసే వరకు వారి నడకదారిలో విఠల్ విఠల్ నినాదమే ప్రతిధ్వనిస్తుంది.
ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో