
ఒక గ్రామంలోని రచ్చబండ వద్ద ఓ ఆధ్యాత్మికవేత్త ప్రవచనం చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా ‘‘ఈ సృష్టిలోని విషయాలు మనకి అంత సులభంగా అర్థం కావు. ఈ సృష్టిలో అన్నీ విలువైనవే. ప్రతి ఒక్కటీ ఏదో ఒక కారణంగా సృష్టింపబడుతుంది. మనకి ఉపయోగపడదని, మనకి తెలియదని దేన్నీ వృథాగా భావించ కూడదు’’ అని చెప్పాడు.
అప్పుడే ఒక పశువుల కాపరి అడవినుంచి జీవాలను ఇంటికి తోలుకుని వెళ్తున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసం విని కొద్దిసేపు ఆగి ‘‘ఈ మేక మెడ దగ్గర రెండు లింగాలు ఉన్నాయి. ఇవి దేనికి పనికి వస్తాయి. తోలుకూ మాంసానికీ రెండిటికీ పనికి రానివి కదా ఇవి’’ అని నిష్టూరంగా అడిగాడు.
చిరునవ్వు నవ్విన ఆధ్యాత్మికవేత్త ‘‘సృష్టి రహస్యాలు కనుక్కోవడం కష్టం. అవి ఎందుకు సృష్టింప బడ్డాయో మనకు తెలియకపోవచ్చు. నీకు బాగా అర్థమయ్యేట్లు నేను విన్న ఒక పాత కథ చెబుతాను విను.
పూర్వం ఒక ఋషి ఉండేవాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడికి కొన్ని శక్తులు వచ్చాయి. తను ఏది కోరుకుంటే అది జరిగేది. ఆ ఋషి ఒకరోజున నదీ స్నానం చేసి లేస్తున్నప్పుడు తన ముక్కు వెంట్రుకలు దట్టంగా పెరగడం గమనించాడు. కొంచెం అసౌకర్యంగా భావించాడు. ‘దేనికి పనికివస్తాయి ఇవి? ఇవి లేకుంటే మాత్రం నేను జీవించలేనా’ అని భావించి అవన్నీ రాలిపోయేట్లు కోరుకున్నాడు. అతడు కోరినట్లే జరిగింది. అది జరిగిన కొద్దిసేపటికే ఉచ్చ్వాసనిశ్వాసలు తీసుకోవడం కష్టమయ్యింది. రోజురోజుకీ ఆ ఋషి ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. చిన్న వెంట్రుకలైనా దాని విలువ దానికి ఉందని గుర్తించకపోవడం వల్ల జరిగిన అనర్థం అది.
కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక కార్య నిమిత్తం సృష్టింపబడిందే. కాకుంటే మనం వాటి ప్రయోజ నాలన్నిటినీ గుర్తించలేము. మనకు, మన ఆలోచనలకూ పరిమితులు ఉన్నాయి. కాబట్టి సృష్టి మర్మాలను మనం గౌరవించక తప్పదు’’ అని వివరించాడు.
‘అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా ఉండకూడదు అని ఆలోచించి లాభం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించడం ఉత్తమం’ అని గ్రహించిన పశువుల కాపరి జీవాలను తోలుకుని ఇంటివైపు నడిచాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు