ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.
రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది.
ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్‌రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు.
2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి.
Comments
Please login to add a commentAdd a comment