జీనియస్‌ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్‌ | Meet Aaryan Shukla 14 Year Old 'Human Calculator' Know Interesting Facts About Him In Telugu | Sakshi
Sakshi News home page

జీనియస్‌ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్‌

Published Sat, Mar 1 2025 3:44 PM | Last Updated on Sat, Mar 1 2025 4:32 PM

Meet Aaryan Shukla 14 year 'Human Calculator'

పందొమ్మిదో ఎక్కం చెప్పమంటే తల గీరుకునే పిల్లలు ఉంటారు. చిన్న చిన్న కూడికలకు కాలిక్యులేటర్‌ వైపు చూసే వారూ ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే కాలిక్యులేటర్‌ కావాల్సిందే. కాని ఆర్యన్‌ నితిన్‌కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక కాలిక్యులేటర్‌.  అతని వయసు 14 ఏళ్లు.  ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు.

ఆర్యన్‌ ది మహారాష్ట్ర. ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు  ప్రోత్సహించారు. ఆర్యన్‌ రోజూ ఐదారు గంటల΄ాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి, టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో ‘మైండ్‌ స్పోర్ట్‌ ఒలింపియాడ్‌ మెంటల్‌ కాలిక్యులేషన్‌’ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించి, ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్‌ కాలిక్యులేషన్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొని మొదటిస్థానంలో నిలిచాడు. అంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్‌ మెంటల్‌ కాలిక్యులేటర్స్‌ అసోసియేషన్‌(జీఎంసీఏ)లో అతణ్ని ఫౌండింగ్‌ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటాడు. 

 గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి, రెండు కాదు.. ఒకేరోజు ఆరు ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 100 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, ఒక నిమిషం 9.68 సెకండ్లలో 200 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 50 ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం.. ఇలా అతను చేసిన మేధోవిన్యాసాలు చూసి గిన్నిస్‌ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్‌ కాలిక్యులేషన్‌ వరల్డ్‌ కప్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మన సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వదలకూడదని అంటున్నాడు ఆర్యన్‌.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement