ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.
ద్లాపూర్‌లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.
‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.
కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment