calculator
-
మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో గణితంలో గాడితప్పుతున్నట్లు జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో 49 శాతం మంది కనీస సామర్థ్యాలు చూపలేకపోతున్నారని సర్వే పేర్కొంది. ప్రధాన రాష్ట్రాల్లో విద్యార్థుల మాతృ భాషల అభ్యసనతోపాటు గణితం సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను మదించి ఎన్సీఈఆర్టీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తెలంగాణలో 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించింది. బేసిక్స్ కూడా అంతంతే.. ఈ అధ్యయనం నివేదిక ప్రకారం... ప్రాథమిక విద్య చదువుతున్న వారిలో చాలా మంది బేసిక్స్‌లోనూ బాగా వెనుకబడ్డారు. టెన్త్ విద్యార్థుల్లో రెండంకెల లెక్కలకూ తడుముకొనే పరిస్థితి ఉంది. కరోనా కాలంలో విద్యార్థులు ఎల్రక్టానిక్ పరికరాలకు అతుక్కుపోవడం, స్వయం సామర్థ్యం పెంపు దెబ్బతినడానికి కారణమైంది. ఏ చిన్న లెక్కకైనా క్యాలిక్యులేటర్, ఆన్లైన్లో వెతుక్కొనే పద్ధతికి అలవాటయ్యారు. 8–10 తరగతుల విద్యార్థులు కాగితంపై లెక్కజేయడానికి అవసరమైన దానికన్నా రెండింతల సమయం తీసుకుంటున్నారు. మాతృభాషలో చదవలేని వారు 19 శాతం ఉన్నట్లు తేలింది. పట్టుమని పది పదాలు తప్పులు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన విద్యార్థులు 13 శాతం ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతమే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మూడో తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తోంది. రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో 43 శాతం మంది మూడో తరగతిలో ఉన్నారని సర్వేలో గుర్తించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి చర్యలు అనుసరిస్తాయనే విషయమై స్పష్టత ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. టీచర్ల కొరతా కారణమే ప్రభుత్వ పాఠశాలల్లో 18 సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనకన్నా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. పైగా ఈ పనులకే కచ్చితత్వం ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేథ్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు సరైన ప్రతిభ చూపే అవకాశం లేదు. దీనిపై విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, అధ్యక్షుడు, రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం -
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్ కాలిక్యులేటర్.. హైదరాబాద్‌లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్ ఇన్ ఇండియా కాలిక్యులేటర్ పరికరం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలిక్యులేటర్‌కు అనుసంధానంగా ఉండే టుహ్యాండ్స్ మొబైల్ యాప్ ద్వారా ఇది పనిచేయనుంది. ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, టీ–హబ్ సహకారంతో టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది. సోమవారం నగరంలోని ‘టీ–హబ్’లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఇలాంటి ఆవిష్కరణల కోసమే టీ హబ్‌ను ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది జపాన్, చైనాలు తయారు చేసి విక్రయిస్తున్న సాధారణ కాలిక్యులేటర్ల గుత్తాధిపత్యానికి కచ్చితంగా గండికొడుతుందని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్త ప్రవీణ్మిశ్రా మాట్లాడుతూ ఈ కాలిక్యులేటర్ చిన్న, మధ్యతరహా వ్యాపారుల బుక్ కీపింగ్‌లో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్‌తో కూడిన ఈ స్మార్ట్ కాలిక్యులేటర్ పవర్ రీచార్జ్ చేశాక 3 రోజులపాటు నడుస్తుందని వివరించారు. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు, టీఎస్ఐసీ సీఐఓ శాంతతౌతం, టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్తలు సత్యం సాహు, షణ్ముగ వడివేల్, అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. చదవండి: సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు -
నవ్వుల సడినీ, విషాదపు తడినీ కొలిచేస్తారు సుమండీ!
వర్షించే మేఘాలనూ, శీతాకాలం వణికించే మంచురాత్రులనూ, సెగలుపుట్టించే వేసవి వేడినీ కొలిచే సాధనాలున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ మానవాళి ముఖకవళికలను బట్టి వారిలోని ఆనందాశ్చర్యాలకూ లెక్కకట్టేస్తున్నారు పరిశోధకులు. మీలోని దుఃఖాన్నీ, ఆనందాన్నీ, కోపాన్నీ, విషాదాన్నీ స్కేల్‌తో కొలిచిమరీ మీ అభివ్యక్తిని ఇట్టే పట్టేస్తారు. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? ఉంటే ఎంత సంతోషంగా ఉన్నారు? కోపమా? అయితే దాని బరువెంత? ఇలా మీ ముఖాన విరిసే అన్ని హావభావాలనూ ముఖ కండరాల కదలికలను బట్టి అంచనా కట్టేస్తున్నాయి తాజా అధ్యయనాలు. అలా లెక్కలు వేసే ప్రపంచంలో ఎన్ని రకాల నవ్వులు పూయించొచ్చో, ఎన్ని రకాలుగా మీలోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారో తేల్చి చెప్పేశారు. ఆనందానికి 17 వ్యక్తీకరణలు.. ప్రపంచవ్యాప్తంగా మనుషులు విసుగుని ప్రదర్శించడానికి ఒకే ఒక్క ముఖ కవళిక ఉందట. కానీ మనలోని సంతోషాన్నీ, ఆనందాన్నీ, ఉట్టిపడే ఉల్లాసాన్నీ 17 రకాలుగా మనం వ్యక్తీకరిస్తున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మనలో భయాన్ని మాత్రం కేవలం మూడు రకాలుగా ప్రదర్శిస్తున్నాం. ఆశ్చర్యాన్ని నాలుగురకాలుగా అభివ్యక్తీక రిస్తే, ప్రపంచ ప్రజలంతా తమలోని కోపాన్నీ, విషాదాన్నీ మాత్రం ఐదు విభిన్న ముఖ కవళికల ద్వారా, ముఖాకృతుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. మన ముఖంలోని కండరాల కదలికలను బట్టి మన నవ్వునీ, నవ్వుతున్న ప్పుడు మన కళ్ళ దగ్గర పడే చర్మపు ముడతలని బట్టి మనలోని ఆనందాన్ని చాలా సునాయాసంగా కొలిచేయొచ్చంటున్నారు పరిశోధకులు. ‘‘ఈ పరిశోధన చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే సంతోషంలోని క్లిష్టమైన విషయాలెన్నింటినో ఇది విడమరిచి చెప్పింది’’అని ఓహియో యూనివర్సిటీ అధ్యాపకులు అలెక్సీ మార్టినెజ్ పేర్కొన్నారు. 35 రకాల ఎమోషన్స్ కామన్ మనుషులు తమలోని ఆనందం, కోపం, సంతోషం, దుఃఖం, విషాదం లాంటి ఉద్విగ్నభరిత క్షణాలను వేనవేల రకాలుగా వ్యక్తీకరిస్తుంటారు. అయితే అందులో కేవలం 35 రకాల అభివ్యక్తులు మాత్రమే ఉంటాయని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వివిధ రకాల ఫీలింగ్స్‌ని వివరించే 821 రకాల పదాలను ఇంటర్నెట్లో పరిశోధించి వాటిని మనుషుల ముఖాభినయాలతో పోల్చి చూసినట్టు ఐఈఈఈ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో వివరించారు. స్పానిష్లోనూ, చైనా భాషలోకీ, పార్సీ, రష్యన్ మొదలుకొని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల్లోని మొత్తం 31 దేశాల భాషల్లోకి ఈ పదాలను అనువదించి సంబంధిత ముఖచిత్రాలతో పోల్చి చూశారు. ఈ అధ్యయనంలో దాదాపు 72 లక్షల ఫొటోల్లోని ముఖాభినయాలను పరిశీలించారు. అయితే కంప్యూటర్ ఆల్గరిథమ్స్ ఆధారంగా ముఖ కండరాల కదలికలను బట్టి 16,384 రకాలుగా మనుషులు తమలోని భావోద్వేగాలను వ్యక్తీకరించగలరని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. అయితే 72 లక్షల ఫొటోలను పరిశీలించిన మీదట అందులో 35 రకాల ఎమోషన్స్ సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. -
ఫైనాన్షియల్ కాలిక్యులేటర్ ఇండియా...
దేశీయంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్కీమ్స్‌కి సంబంధించిన లెక్కలను తక్షణం అందించే కాలిక్యులేటర్ ఇది. ఇందులో బ్యాంక్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ స్కీమ్స్, బీమా పథకాలు, సాధారణ అంశాలకు సంబంధించిన కాలిక్యులేటర్స్ ఉన్నాయి. బ్యాంక్‌లు లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు .. రికవరింగ్ డిపాజిట్లు చేస్తే ఎంత వడ్డీ రేటుకి ఎంత మొత్తం వస్తుంది వంటి వివరాలు అందిస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారంగా రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలను కూడా లెక్కవేసుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ల శ్రేణి వివరాలను ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) వంటి పెట్టుబడి సాధనాల గురించిన సమగ్రమైన సమాచారం ఈ యాప్ అందిస్తుంది. అలాగే సిప్ రూపంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వచ్చే అవకాశముందో తెలియజేస్తుంది. ఇక ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా వంటి బీమా పథకాల్లో ఏ వయస్సు వారు ఎంత ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది తదితర వివరాలు పొందవచ్చు. అలాగే రిటైర్మెంట్ ప్లాన్స్ కి సంబంధించిన పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఎంత పొందాలనుకుంటున్న దానిపై అటల్ పెన్షన్ యోజన మొదలైన వాటిల్లో ఎంత కట్టాల్సి ఉంటుందన్నది తెలుసుకోవచ్చు. -
కాలుక్యులేటర్ ను వాడి వస్తున్నారు!
న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ లో గత కొద్దిరోజులుగా ఉగ్రదాడులు పెరగడానికి గల కారణాన్ని భారత్ ఆర్మీ కనుగొంది. ఒక కాలుక్యులేటర్ సాయంతో వారు భారత భద్రతా దళాల కళ్లుగప్పి దేశంలోకి చొరబడుతున్నట్లు తేల్చింది. ఉగ్రవాదులు వద్ద దొరికిన స్మార్ట్ ఫోన్లను పరిశీలించిన ఆర్మీ ప్లే స్టోర్ లో లభ్యమయ్యే ఓ కాలుక్యులేటర్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని దాని ద్వారా ఎటువంటి సెల్యులార్ లేదా వైఫై లు అందుబాటులో లేకపోయినా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని తమ స్థావరాలకు ఎస్ఎమ్మెస్ లు పంపుతున్నట్లు వెల్లడించింది. ఈ రకమైన టెక్నాలజీని అమెరికాలో తొలిసారి పొంచివున్న హరికేన్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో ఈ మెకానిజంను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ టెక్నికల్ టీం.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) సాయం కూడా తీసుకుంటోంది. లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులను విచారిస్తున్న సందర్భంగా వాళ్లు ప్రత్యేకమైన యాప్ కాలుక్యులేటర్ ను తయారుచేసుకుని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బోర్డర్లలో చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 35 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాలీ ఏరియా ఈ బలగాలు భద్రతను పెంచనున్నాయి. చలికాలం ప్రతికూల వాతవరణం కారణంగా చొరబాటు తక్కువగా ఉంటోంది. కానీ, ఈ ఏడాది చలి తక్కువగా ఉండటంతో ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 2015లో 121 చొరబాటు ప్రయత్నాలు జరుగగా 33 మంది దేశంలోకి ప్రవేశించారని, 2014లో 222 మంది చొరబాటుకు ప్రయత్నించగా65 మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
స్మార్ట్ గా పొట్టన పెట్టేసుకుంది!
సాంకేతికం చేతిలో పర్సులేని వారు కనిపిస్తున్నారు కానీ ఫోన్ లేని వారు కనిపించడం లేదు. అది మొబైల్ ఘనత. బహుశా ఇంతవరకు మనిషి కనిపెట్టిన వస్తువుల్లో అత్యధిక వేగంతో జనాన్ని చేరిన ఏకైక వస్తువు ఇదే. అతి తక్కువ కాలంలో అనేక రకాలుగా రూపాంతరం చెందిన ఉత్పత్తి కూడా ప్రపంచంలో మరొకటి లేదు. గ్రాహంబెల్ ల్యాండ్‌ఫోన్ కనిపెడితే అది వందేళ్ల అనంతరం కూడా ఫోన్గానే ఉపయోగపడింది. అదే కేవలం కొన్నేళ్ల క్రితం వచ్చిన మొబైల్ ఫోన్ ఏటికేడాది కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ ప్రపంచాన్ని తాను లేనిదే నడవలేని పరిస్థితికి తెచ్చింది. మరి ఈ మొబైల్ ఫోన్ మింగేసిన వస్తువులేంటో చూద్దామా? కెమెరా ఒకప్పుడు ఫొటో దిగడం అంటే ఎంతో ముచ్చట. కెమెరా ఇంట్లో ఉంటే ఎంతో గొప్ప. ఒక ఫొటో తీసి ఎలా వచ్చామో చూసుకోవడానికి రోజులతరబడి వేచిచూసేవాళ్లం. ఒక రీలంతా పూర్తవడమో, కనీసం అందులో ఓ పది ఫొటోలు తీసుకోవడమో జరిగితే గాని ఆ ఫొటో చూసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత డిజిటల్ కెమెరాలు రావడంతో వెంటనే ఫొటో చూసుకునే అవకాశం వచ్చింది. స్మార్ట్ ఫోన్లు వచ్చాకైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కావల్సినంత మెగాపిక్సల్ కెమెరాలు స్మార్ట్ఫోన్లలో ఉండటం, అప్పటికపుడు ఆన్లైన్లో ఎవరితో అయినా పంచుకోగలగడంతో కెమెరాను ఓ లగేజీలాగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఫోన్లో కెమెరా నిత్యం మనవెంటే ఉంటే ఇంకేం కావాలి. దాంతో వేలకోట్ల కెమెరా ఇండస్ట్రీ స్మార్ట ఫోన్ వల్ల బాగా దెబ్బతినిందనే చెప్పాలి. మ్యూజిక్ ప్లేయర్స్ ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిన మ్యూజిక్ ప్లేయర్సని కూడా ఫోన్ పొట్టన పెట్టుకుంది. కావల్సినంత జీబీతో ఫోన్లు లభిస్తుండటం వాటిలోనే ఇన్‌బిల్ట్‌గా క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్లు ఉండటంతో అవి అతికొద్దికాలంలోనే మాయమయ్యాయి. ఫోన్లో అయితే ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపీ3 ప్లేయర్లలో ఆ అవకాశం ఉండదు. పైగా స్మార్ట్ ఫోన్లను ఏ స్పీకర్లతో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేనా, బ్లూటూత్‌తో వైర్‌లెస్‌గా కూడా ప్లే అయ్యే సదుపాయం వచ్చింది. క్యాలిక్యులేటర్, అలారం, టార్చ్‌లైటు మార్కెట్లో దొరికే ప్రతిఫోన్లో తప్పనిసరిగా ఉండేవి క్యాలిక్యులేటర్, అలారం, టార్చిలైటు. ఒకప్పుడు మార్కెట్లో క్యాలిక్యులేటర్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. ప్రతి ఇంట్లో ఇదో తప్పనిసరి వస్తువుగా ఉండేది. ఇప్పుడు ఫోన్లలో ఇది కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లలో అయితే హై ఎండ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అలాగే పెద్ద బండ అలారాన్ని పెట్టుకోనక్కర్లేకుండా అన్నిఫోన్లలో ఈ సదుపాయం ఉంటోంది. అంతేకాదు, ఉదయాన్నే మనకు నచ్చిన కీర్తననో, ట్యూన్నో, పాటనో అలారంగా పెట్టుకునే అవకాశం వీటిల్లో ఉంటుంది. జీపీఎస్ నావిగేషన్! ఇక జీపీఎస్ టెక్నాలజీ డివైస్ల పరిస్థితి అయితే మరీ ఘోరం. వీటిని పుట్టీ పుట్టకముందే స్మార్ట ఫోన్ మింగేసింది. బుల్లి స్క్రీన్‌తో ఉండే ఈ డివైస్ ద్వారా లొకేషన్ తెలిస్తే చాలు ఎవర్నీ దారి అడక్కుండా గమ్యానికి చేరుకోచ్చు. ఇప్పుడిది ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉంది. పైగా చక్కటి వాయిస్‌తో కూడా వినేయొచ్చు. ఉత్తరాలు ఈ విషయంలో మొబైల్‌కి నెగెటివ్ షేడ్ కూడా ఉందనాలి. లేఖలు రాసుకోవడం ఒక సంతృప్తికరమైన వ్యాపకంగా, జ్ఞాపకంగా ఉండేది. మొబైల్స్‌లో ఎప్పుడూ మాట్లాడుతూండడం వల్ల బంధుమిత్రుల రాకపోకలు అనేవి ఒక మామూలు ప్రక్రియగా మారిపోయాయి. పది నిమిషాల కోసారి ఎక్కడున్నారో అడుగుతూ ప్రయాణాలు చేస్తున్నారు. వీడియో గేమ్‌లు ఇంట్లో పిల్లలుంటే వీడియో గేమ్‌లు తప్పనిసరిగా ఉండేవి. ఇప్పుడా ఆ అవసరాన్ని కూడా ఫోన్లు తీర్చాయి. ఎప్పటికపుడు అప్డేట్ అయ్యే మొబైల్ గేమ్‌ల వల్ల ఎప్పుడూ ఒకటే గేమ్ ఆడే బాధ పిల్లలకు తప్పింది. అమ్మా, నాన్న ఇంట్లో ఉంటే వారి ఫోన్లు కచ్చితంగా పిల్లల చేతిలోనే ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఆటలేఆటలు. ఎప్పటికపుడు ఎన్నెన్నో కొత్త గేమ్‌లు పిల్లలను విపరీతంగా అలరిస్తున్నాయి. స్మార్టఫోన్ల రాకతో కంప్యూటర్ గేములు ఆడటం కూడా బాగా తగ్గింది. మొబైల్లో ఆడుకోవడానికే పిల్లలు ఇష్టపడుతున్నారు. కొసమెరుపు: పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. కానీ ఈ టెలిఫోన్ వ్యవహారంలో బుల్లి మొబైల్.. పెద్ద ల్యాండ్‌లైన్‌ను మింగేసింది. మొబైల్ రాకతో ల్యాండ్ లైన్ ఫోన్లు ఆఫీసుల్లో, పెద్ద ఇళ్లలో తప్ప ఎక్కడా కనిపించడం లేదు.