ఫైనాన్షియల్ కాలిక్యులేటర్ ఇండియా...
దేశీయంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్కీమ్స్‌కి సంబంధించిన లెక్కలను తక్షణం అందించే కాలిక్యులేటర్ ఇది. ఇందులో బ్యాంక్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ స్కీమ్స్, బీమా పథకాలు, సాధారణ అంశాలకు సంబంధించిన కాలిక్యులేటర్స్ ఉన్నాయి. బ్యాంక్‌లు లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు .. రికవరింగ్ డిపాజిట్లు చేస్తే ఎంత వడ్డీ రేటుకి ఎంత మొత్తం వస్తుంది వంటి వివరాలు అందిస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారంగా రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలను కూడా లెక్కవేసుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ల శ్రేణి వివరాలను ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.
మరోవైపు మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) వంటి పెట్టుబడి సాధనాల గురించిన సమగ్రమైన సమాచారం ఈ యాప్ అందిస్తుంది. అలాగే సిప్ రూపంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వచ్చే అవకాశముందో తెలియజేస్తుంది. ఇక ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా వంటి బీమా పథకాల్లో ఏ వయస్సు వారు ఎంత ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది తదితర వివరాలు పొందవచ్చు. అలాగే రిటైర్మెంట్ ప్లాన్స్ కి సంబంధించిన పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఎంత పొందాలనుకుంటున్న దానిపై అటల్ పెన్షన్ యోజన మొదలైన వాటిల్లో ఎంత కట్టాల్సి ఉంటుందన్నది తెలుసుకోవచ్చు.