కాలుక్యులేటర్ ను వాడి వస్తున్నారు!
న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ లో గత కొద్దిరోజులుగా ఉగ్రదాడులు పెరగడానికి గల కారణాన్ని భారత్ ఆర్మీ కనుగొంది. ఒక కాలుక్యులేటర్ సాయంతో వారు భారత భద్రతా దళాల కళ్లుగప్పి దేశంలోకి చొరబడుతున్నట్లు తేల్చింది. ఉగ్రవాదులు వద్ద దొరికిన స్మార్ట్ ఫోన్లను పరిశీలించిన ఆర్మీ ప్లే స్టోర్ లో లభ్యమయ్యే ఓ కాలుక్యులేటర్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని దాని ద్వారా ఎటువంటి సెల్యులార్ లేదా వైఫై లు అందుబాటులో లేకపోయినా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని తమ స్థావరాలకు ఎస్ఎమ్మెస్ లు పంపుతున్నట్లు వెల్లడించింది. ఈ రకమైన టెక్నాలజీని అమెరికాలో తొలిసారి పొంచివున్న హరికేన్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో ఈ మెకానిజంను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ టెక్నికల్ టీం.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) సాయం కూడా తీసుకుంటోంది.
లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులను విచారిస్తున్న సందర్భంగా వాళ్లు ప్రత్యేకమైన యాప్ కాలుక్యులేటర్ ను తయారుచేసుకుని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బోర్డర్లలో చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 35 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాలీ ఏరియా ఈ బలగాలు భద్రతను పెంచనున్నాయి. చలికాలం ప్రతికూల వాతవరణం కారణంగా చొరబాటు తక్కువగా ఉంటోంది. కానీ, ఈ ఏడాది చలి తక్కువగా ఉండటంతో ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 2015లో 121 చొరబాటు ప్రయత్నాలు జరుగగా 33 మంది దేశంలోకి ప్రవేశించారని, 2014లో 222 మంది చొరబాటుకు ప్రయత్నించగా65 మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.