కుల్గాం : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశారు.
అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో భద్రతపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పట్టాయి.
ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని చింగామ్,సౌత్ కాశ్మీర్ కుల్గామ్ అనే ప్రాంతాలలో నివసించేందుకు టెర్రరిస్ట్‌లకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్‌ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశాయి.
మదర్గాంలో తొలి ఎన్‌కౌంటర్ జరగ్గా.. రెండో ఎన్‌కౌంటర్ కుల్గాం జిల్లా చింగాం అనే ప్రాంతంలో జరిగింది. సైనికులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు టెర్రరిస్ట్‌లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం చెందారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బర్డి తెలిపారు.
ఇక ఎన్‌కౌంటర్‌లో హతమైన టెర్రరిస్ట్‌లు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందినవారని,వారిలో ఒకరు లోకల్ కమాండర్‌గా పోలీసులు నిర్ధారించారు.
చింగాంలో హతమైన నలుగురు టెర్రరిస్ట్‌లు యావర్ బషీర్ దార్,జాహిద్ అహ్మద్ దార్, త్వాహిద్ అహ్మద్ రాతీర్, షకీల్ అహ్ వ్వానిలు కాగా, మదర్గాంలో మృతి చెందిన టెర్రరిస్ట్‌లు ఫైసల్, అదిల్‌లుగా గుర్తించారు.
మదర్గాంలో జరిగిన టెర్రరిస్ట్‌ల ఎదురు దాడిలో పారా కమాండో, లాన్స్ నాయక్ ప్రదీప్ నాయిన్, చింగాం గ్రామంలోని ఫ్రిసాల్ ఏరియాలో వన్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన హవల్దార్ రాజ్‌కుమార్ వీరమరణం చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment