సొంత పోలీస్‌స్టేషన్, సొంత చట్టాలు
నాగ సాధువులే రక్షక భటులు
నిబంధనలు అతిక్రమిస్తే తగు శిక్షలు
తీవ్ర నేరాలైతే బహిష్కరణ వేటు
అంతర్గత వివాదాలపై కోర్టుకెక్కడం నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: జీవితం మీద అసంతృప్తితో ఈ భవ బంధాలన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు కొందరు. ఏదైనా అనుభవిస్తే కానీ అసలు విషయం తెలియదంటారు మన పెద్దలు. అవును..లోతుగా పరిశీలిస్తే సన్యాసం కూడా అంత సులువైంది కాదని అర్థమవుతుంది. అక్కడా నియమాలు పాఠించాలి. సన్యాస అఖాడా (ఆశ్రమం)ల్లోనూ సొంత చట్టాలు ఉంటాయి. వాటిని అమలు చేసేందుకు వారికి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లు (కొత్వాలీలు) ఉంటాయి. సభ్యులు ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కొన్నిసార్లు వింత శిక్షలు, నేరాలు చేస్తే కఠిన శిక్షలు, తీవ్ర నేరాలకు పాల్పడితే అఖాడా నుంచి బహిష్కరణ వేటు తప్పదు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహాకుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు వచ్చిన నాగా సాధువుల జీవన శైలి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం...
దేశంలో 13 అఖాడాలు
అఖాడా అనేది సంస్కృత పదం. కుస్తీ బరి లేదా చర్చ వేదిక అని అర్థం. సన్యాస దీక్ష తీసుకున్న వారు, సాధువులు, నాగ సాధువులు, సంతులకు ఆశ్రయం ఇస్తాయి. వీటి కేంద్రంగానే వారు సంప్రదాయాలకు అనుగుణంగా దైవాన్ని ఆరాధిస్తారు. 2019 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 13 అఖాడాలున్నాయి. వీటిలో ఏడింటిని ఆది శంకరాచార్య స్థాపించారు. 13 అఖాడాల్లో ఏడు శైవ అఖాడాలు. ఇక్కడ శివుడిని ఆరాధిస్తారు. మూడు వైష్ణవ అఖాడాలు. వీటినే బైరాగి అఖాడాలనీ అంటారు. వీరు విష్ణు మూర్తిని కొలుస్తారు. మిగతా మూడు ఉదాసిన్ అఖాడాలు. వీరు గురునానక్ పెద్ద కుమారుడు శ్రీచంద్ బోధనలను అనుసరిస్తారు. అలాగే ట్రాన్స్‌జెండర్లకూ ప్రత్యేకంగా కిన్నెర అఖాడా ఉంది. ఆది శంకరాచార్య స్థాపించిన జూనా అఖాడా అతి పెద్దది. కిన్నెర అఖాడా దీని పరిధిలోనే ఉంటుంది.
కొత్వాల్‌దే బాధ్యత
దశానమి సంప్రదాయాన్ని పాఠించే అన్ని శైవ అఖాడాలకు సొంత చట్టాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో అఖాడాకు ఒక పోలీస్‌స్టేషన్ (కొత్వాలీ) ఉంటుంది. అఖాడా నియమ నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒకరికి కొత్వాల్‌గా బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే అంతర్గత భద్రత బాధ్యత కూడా వీరిదే. ఆయన అఖాడాలోని నాగ సాధువులను, ఇతర సాధువులను నియంత్రిస్తాడు. అఖాడా సభ్యుడు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. అఖాడాల్లో ఏదైనా అంతర్గత వివాదం తలెత్తిదే దానిపై కోర్డును అశ్రయించేందుకు అఖాడాలు అనుమతించవు. అంతా కలిసి సమావేశమై వివాదాన్ని పరిష్కరించుకుంటారు. అఖాడా భద్రత కోసం వేర్వేరు రక్షక భటులు ఉంటారు. నాగ సన్యాసులు మాత్రమే కొత్వాల్ పదవికి అర్హులు.
శిక్షించే అధికారం అతడిదే
అఖాడాలో రూల్స్ అమలు పరిచేందుకు నియమించిన కొత్వాల్‌కు మాత్రమే శిక్షలు కూడా అమలు చేసే బాధ్యత ఉంటుంది. ఆయనకు వెండి పూత కలిగిన ఒక దండాన్ని ఇస్తారు. నిబంధనలు అతిక్రమించిన వారిని కొత్వాల్ వద్దకు తీసుకువస్తారు. విచారణ తర్వాత చిన్న తప్పుకు చిన్న శిక్షలే ఉంటాయి. చేసిన తప్పులు గ్రహించే విధంగా కూడా శిక్షలు విధిస్తారు. కొత్వాల్ సమక్షంలో గంగానదిలో 108 మునకలు వేయడం. ౖ అఖాడాలోని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి పళ్లు తోముకునేందుకు పళ్లపొడి లేదా పళ్లపుల్ల ఇవ్వడం. ఒక వారం పాటు అఖాడాలో శుచీ శుభ్రత బాధ్యతలు చూసుకోవడం, అఖాడా గురువు వినియోగించే పాత్రలను శుభ్రం చేయడం వంటి శిక్షలు విధిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉంటే కఠిన శిక్షలు ఉంటాయి. వివాహం, అత్యాచారం, ఆర్థిక నేరం వంటి ఆరోపణలు నిరూపణ అయితే అఖాడా నుంచి బహిష్కరిస్తారు. ఈ శిక్షల్లో ఎక్కువగా జరిమానాలను విధించడం వంటివి ఉండవు. అఖాడాలోని పరిస్థితులను బట్టి కొత్వాల్‌ను కూడా మారుస్తారు.
దీక్షకు ముందే పిండ ప్రదానం
హిందూ మతంలో ఒక వ్యక్తి మరణానంతరం మాత్రమే పిండ ప్రదానం చేస్తారు. కానీ అఖాడాలో సన్యాస దీక్ష తీసుకోవాలంటే ముందుగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పూరీ్వకుల రుణం నుంచి విముక్తి పొందడానికి ఈ విధి తప్పనిసరి. అలాగే ఈ ప్రక్రియతో అతని సామాజిక బాధ్యతలన్నిటితో బంధాలు తెగిపోయినట్లే. దీక్ష తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా సామాజిక జీవితంలోకి తిరిగి రాలేడు.
Comments
Please login to add a commentAdd a comment