ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh 2025) జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు, వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూశాం. యావత్తు భారతావనిలో ఆద్యాత్మికత శోభ ఎంతగా తనలోకి మేధావులు, మహా మహులను ఆకళింపు చేసుకుని కాంతిలీనుతోందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్తుడంటే..
భారతదేశపు ప్రాచీన జునా అఖారాకు(Juna Akhara) చెందిన నాగసాధుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి(Baba Rampuri,). అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్. గాన్స్‌కు జన్మించిన విలియం ఎ. గాన్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలాన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు.
ఇక్కడ బాబా రాంపరి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్‌లోని నిగూఢమైన నాగ సాధువులకు చెందిన జునా అఖారాలో నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆది శంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయడుగా నిలిచాడు బాబా రాంపురి.
అంతేగాదు ఆయన రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సాధు: యాన్ ఆంగ్రేజ్ అమాంగ్ నాగ బాబాస్" పుస్తకంలో 1971లో అలహాబాద్ మహా కుంభమేళా సమయంలో తాను నాగసాధువుగా మారిన క్రమం గురించి చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోని తీసుకరావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయం అని రాశారు.
ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్ని తనకు పరిచయమున్నట్లుగా అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్తసంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో, బాబాకు జూనా అఖారా కౌన్సిల్‌లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు 'అంతరాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్' అనే బిరుదుని కూడా పొందారు.
(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..)
Comments
Please login to add a commentAdd a comment