meaning
-
ఖో..ఖో : ఇంట్రస్టింగ్ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది. ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి. -
బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!
నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా గుర్తు ఉంటాయి. సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి. ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి. ఉలక్కి పడి లేచి ..హమయ్య కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే.. కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్‌బర్గ్ ప్రకారం, శిశువు కలలో కనిపిస్తే కొత్త ప్రారంభానికి సూచిక. చేస్తున్న పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే సానుకూల సంకేతమని లోవెన్‌బర్గ్ చెప్పారు. ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు, అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్‌బర్గ్ వివరించాడు. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా! నిజానికి శతాబ్దాలుగా కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్ అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు కార్ల్ జంగ్ అంటాడు. కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఇంపల్షన్స్ మాత్రమే. ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్. -
పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?
మాములుగా అందరం ఆరోగ్యం కోసం పళ్లను తినడం జరుగుతుంది. అయితే చాలా పండ్లలో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. ఎందుకిలా స్టిక్కర్లు అంటిస్తారనేది చాలామందికి తెలియదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయోమో అనుకుంటాం . మరికొందరూ అలా స్టిక్కర్లు ఉన్న పళ్లే మంచివని కూడా అనుకుంటారు. అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు?. దానికేమైన అర్థం ఉందా? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!. పండ్లపై ఉండే స్టిక్కర్ల గురించి ఇటీవలేఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు, వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది. ఇక ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం..నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి. ఫ్రూట్స్‌కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9తో మొదలైతే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు ఉడి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్‌తో పండించారని, ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి. (చదవండి: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!) -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్‌కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్‌కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
అసలు గాంధారి వాన ఏమిటి?..ఎందుకలా పిలుస్తారు?..
నేచురల్ స్టార్ నాని చేసిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో ఓ ఊపూ ఊపేసిని జానపద పాటలో వస్తుంది ఈ గాంధరి వాన గురించి. అందులో కురస కురస అడివిలోన పిలగా..కురిసినీ గాంధారి వాన అంటూ.. మంచి బీట్తో సాగిపోతుంది. అసలు ఇంతకీ గాంధారి వాన అంటే ఏమిటి? ఎప్పుడైనా దాని గురించి విన్నారా? అయినా మహాభారతంలోని దృతరాష్ట్రుని భార్య గాంధారికి, ఈ వానకి సంబంధం ఏమిటి? ఎందకని అలా వానను ఆమె పేరుతో పిలుస్తున్నారు?.. గాంధారి వాన అంటే..అవసరం లేనప్పుడు అదును లేనప్పుడూ కురిసే పెద్ద వానను గాంధారి వాన అంటారు. గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాకుమారి. దుర్యోధనుని తల్లి. ఆమెకు నూరుగురు సంతానం అని మనందరికి తెలిసిందే. దుస్సల అనే కూతురుతో కలిపి మొత్తం నూటొక్కమంది పిల్లలు ఆమెకు. ఇక ఆమె పేరు మీదగానే వానను పిలవడానికి కారణం ఏంటంటే..ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె తన భర్తకు కళ్లు లేవని, తన భర్త చూడని లోకం తాను చూడనంటూ కళ్లకు గంతలు కట్టుకున్న మహాసాధ్వీమణి గాంధారి. కాని దానివల్ల ఎలాంటి నష్టం జరిగిందో మహాభారతంలో చూశాం. ఇక్కడ ఒక కుటుంబానికి రెండు చక్రాలాంటి వాళ్లు తల్లిదండ్రలు. అందులో ఒక చక్రం పరిస్థితి బాగోనప్పుడూ ఇంకో చక్రం పూర్తిస్థాయిలో ఆధారభూతమై నిలబడి సంసారాన్ని లాగాలి. ఇక్కడ ఆమె భర్తపై ఉన్న అమితమైన ప్రేమతో చేసిన పని కాస్తా తన పిలల్లను చెడు మార్గంలో పయనించేలా చేసింది. గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకోవడంతో పిల్లలను తడిమి చూసుకునేదేగానే..వాళ్లు ఎలా పెరుగుతున్నారు, వారి బుద్ధే ఏ మార్గంలో పయనిస్తుందో చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కౌరవులు పాండవులపై చేయరాని అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక్కడ గాంధారి, దృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వారిని సరైన మార్గంలో పెట్టకుండా అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించారు. అలాగే సయమం కాని సమయంలో..అకాలంగా అవసరం లేకుండా ధారగా కురిసిన వాన వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కేవలం నష్టమే తప్ప. పంట అదునుతో సంబంధం లేకుండా వర్షం అచ్చం గాంధారిలా.. పిల్లల ఎదుగుతున్న విదానంపై దృష్టి పెట్టకుండా చూపిన అవ్యాజ ప్రేమ మాదిరిగా వర్షం కురిస్తే..అచ్చం కౌరవులు నాశనం అయినట్లే..పంటలు పాడవుతాయి. దీనివల్ల అంతమంచి వర్షమైనా.. నిరుపయోగమే అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని గాంధారి వాన అని పిలిచారు. ఈ మాట రాయలసీమ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువగా ఆపాదించవచ్చు. (చదవండి: ఈ తల్లులు ప్రకృతి మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు) -
ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా?
ప్రేమను ఎన్ని పదాల్లోనూ, ఎన్ని విధాల్లోనూ వర్ణించినా తీరనిది. ప్రేమకు భాషతో పని లేదు భావం చాలు.. ఎంతటి వారినైనా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ప్రేమ మాయలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారంటారు. అలాంటి ప్రేమను గెలవాలంటే మన మనుసులోని మాటను ముందుగా ఎదుటి వారికి తెలియజేయాలి. ప్రేమను తెలిపేందుకు ఎన్ని మార్గాలున్నా.. సూటిగా చెప్పే పదం ఐ లవ్ యూ. దీనినే షార్ట్‌కట్‌లో 143 అంటారు. చంటి పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు కూడా ఈ పదం సుపరిచితమే.. మరి 831 224 అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దీని గురించి విన్నారా..? ప్రస్తుతం ఈ నెంబర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇది ఏంటో తెలుసుకుందాం. 831 224 అనే సంఖ్య కూడా ప్రేమకు సంబంధించినదే. ‘ఐ లవ్ యు టుడే, టుమారో, ఫర్ ఎవర్’ (I love you today, tomorrow, forever) అనే అర్థంలో దీనిని వాడతారు. అయితే ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే.. సాధారణంగా స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ వంటి వాటిల్లో 831ను తరుచూ వాడుతుంటారు. 831 అనేది "ఐ లవ్ యు" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే సంక్షిప్త పదం. ఇందులోని ప్రతి సంఖ్యకు నిర్దిష్ట నిర్వచనం ఉంటుంది. 8 = "ఐ లవ్ యు" అనే పదసమూహంలోని మొత్తం అక్షరాల సంఖ్య. 3 = "ఐ లవ్ యు" అనే పద సమూహంలోని మొత్తం పదాల సంఖ్య. 1 = ఈ ఎనిమిది అక్షరాలు, మూడు పదాల అర్థం ఒక్కటే. అయితే 224 సంఖ్యను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాడుతుంటారు. నేడు, రేపు, ఎప్పటికీ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే పదం 2 = ‘టు’డే (ఈరోజు) 2 = ‘టు’మారో(రేపు) 4 = ‘ఫర్’ ఎవర్ (ఎప్పటికీ) ఇప్పుడు తెలిసిందిగా 831 224 నెంబర్‌ను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో.. ప్రస్తుతం ఈ సంఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాగే ఇటీవల మరో నెంబర్ 5201314 కూడా వైరల్ అయ్యింది. దాని అర్థం "నేను నిన్ను జీవితకాలం ప్రేమిస్తున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం మరి మీ ప్రియురాలు/ ప్రియుడిని ఇలా కొత్తగా, ఢిఫరెంట్‌గా ప్రపోజ్ చేసి చూడండి. చదవండి: Viral Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఏమాత్రం సిగ్గు పడకుండా ఆమెకు ముద్దు పెడుతూ.. -
మ్యాడ్స్కిల్స్కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే?
మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్ స్కిల్స్. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే? ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం. ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్ స్కిల్స్’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్ స్కిల్స్ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్ స్కిల్స్ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్ స్కిల్స్’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కంటే ‘మ్యాడ్ స్కిల్స్’ను అరుదైన, అవసరమైన స్కిల్స్గా భావిస్తున్నాయి కంపెనీలు. ఒక మేనేజర్ పోస్ట్ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది. రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్ అండ్ ట్రావెల్స్’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్ స్కిల్స్’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్ స్కిల్స్ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం. ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది. ‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది. ‘ఒక మేనేజర్ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్ స్కిల్స్ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్ బీ ఏ మేనేజర్ మై సన్’ పుస్తక రచయిత్రి సాండ్రిన్. ఆటలు (ఫుట్‌బాల్ నుంచి చెస్ బాక్సింగ్ వరకు), ఆర్టిస్టిక్ యాక్టివిటీస్(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్ (యూనిక్ క్రియేటివ్ స్కిల్స్) విభాగంలోకి వస్తాయి. ‘జాబ్ ఔట్లుక్ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్ సాల్వింగ్–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్ స్కిల్స్... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్ స్కిల్స్’లోనే ఉన్నాయి! అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్ప్రెషన్ మ్యాడ్ స్కిల్స్. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్ స్కిల్స్’ ట్రెండ్‌గా మారింది. ‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు. ‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్. (క్లిక్ చేయండి: వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?) -
Idiom: మేక్ నో బోన్స్ ఎబౌట్ ఇట్.. ఈ జాతీయం ఎప్పుడు వాడతారో తెలుసా?
Make No Bones About It: ఏదైనా విషయంపై ఊగిసలాట ధోరణి లేకుండా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం, నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, నేను సాధించగలను...అనే గట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం...మొదలైన సందర్భాల్లో ఉపయోగించే ఇడియమ్ ఇది. ఉదా: 1. ది పేరెంట్స్ ఆర్ మేకింగ్ నో బోన్స్ ఎబౌట్ దేర్ డిస్ప్లేజర్ వోవర్ ఆన్లైన్ టీచింగ్ డూరింగ్ ది పాండమిక్ 2. మేక్ నో బోన్స్ ఎబౌట్ ఇట్. వుయ్ ఆర్ గోయింగ్ టు విన్ అలా పుట్టింది! ఇక దీన్ని మూలాల్లోకి వెళితే... 15వ శతాబ్దం ఇంగ్లాండ్‌లో విందులో భాగంగా ఇచ్చే సూప్‌లో ఎముకలు కనిపిస్తే చాలు ఏం ఆలోచించకుండా ముఖం మీద నిలదీసేవారు. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. బోన్స్ లేని సూప్ ఉత్తమం అని, బోన్స్ ఉన్న సూప్ చెత్త అని నమ్మకం ఉండేది. ఈ నేపథ్యం నుంచి పుట్టిందే...మేక్ నో బోన్స్ ఎబౌట్ ఇట్. చదవండి: Cold Turkey Idiom: కోల్డ్ టర్కీ.. ఈ జాతీయం అర్థం తెలుసా? ఎప్పుడు వాడతారంటే! Meet One's Waterloo Origin: ఈ జాతీయాన్ని ఎప్పుడు వాడతారో తెలుసా? -
Cold Turkey: కోల్డ్ టర్కీ.. ఈ జాతీయం అర్థం తెలుసా? ఎప్పుడు వాడతారంటే!
ఏదైనా చెడు అలవాటును మానేసే సందర్భంలో ‘కోల్డ్ టర్కీ’ అనే ఇడియమ్‌ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మద్యం, ధూమపానం... మొదలైన అలవాట్ల విషయంలో దీన్ని వాడతారు. ఈ ఎక్స్ప్రెషన్ మొదట బ్రిటిష్ కొలంబియా న్యూస్‌పేపర్ ‘ది డైలీ కాలనిస్ట్’లో 1921 ఎడిషన్‌లో కనిపించింది. ఈ ఇడియమ్ ఎలా వచ్చింది? అనే విషయంలో రకరకాల వెర్షన్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి... వ్యసనపరులు తమ చెడు అలవాటును మానుకోవడానికి వైద్యుల దగ్గరికి వస్తే వారికి ‘కోల్డ్ టర్కీ’ పేరుతో ఒక రకమైన చికిత్స చేసేవారట. దీని నుంచే వచ్చింది అనేది ఒకటి. ‘కోల్డ్ టర్కీ’ అనే వంటకం నుంచి వచ్చింది అనేది మరొకటి. ఈ వంటకాన్ని అప్పటికప్పుడు చేయవచ్చునట. ‘తక్కువ టైంలో’ అనే అర్థంలో ఇది వాడకంలోకి వచ్చిందనే వెర్షన్ ఉంది. టాక్ టర్కీ లేదా టాక్ కోల్డ్ (ఏదైనా విషయాన్ని సూటిగా, నిజాయితీగా చెప్పడం) అనే ఎక్స్ప్రెషన్ల నుంచి కోల్డ్ టర్కీ పుట్టిందనేది ఒక వాదన. చదవండి: పెరుగు మంచిదే కానీ..! -
హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్.. ఫ్లాష్‌బ్యాక్ ఏంటో తెలుసా?
జాతీయాలు అంటే వాక్యాలు, మాటలు కాదు. జీవితసత్యాలు. మాట్లాడే భాషకు ఇడియమ్స్ కూడా తోడైతే ఎంతో బాగుంటుంది. ఈవారం మచ్చుకు ఒకటి... ఒక కార్యక్రమం లేదా ప్రదర్శనలో ప్రధానమైన వ్యక్తి రాకపోతే, కనిపించకపోతే ‘హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్’ అంటారు. దీని ఫ్లాష్‌బ్యాక్ ఏమిటో తెలుసుకుందాం... అది 1775 సంవత్సరం. లండన్ కేంద్రంగా వచ్చే ‘ది మార్నింగ్ పోస్ట్’ దినపత్రికలో ఒక వార్త ప్రచురితమయ్యింది. ‘హేమ్లెట్ విత్ఔట్ ది ప్రిన్స్’ ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. చదివితే అసలు విషయం బోధపడింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే... లండన్‌లో ఒక థియేటర్లో షేక్స్పియర్ ‘హేమ్లెట్’ నాటకం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది.. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) ‘ప్రేక్షకమహాశయులకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు కూడా నాటకం ప్రదర్శించబడుతుంది. అయితే ఈ ఒక్కరాత్రి మాత్రం నాటకంలో హేమ్లెట్ పాత్ర ఉండదు’ ‘హేమ్లెట్ లేని నాటకం ఏమిటి!’ అని ప్రేక్షకులు తిట్టుకున్నారా, అడ్జస్టైపోయారా అనేది వేరే విషయంగానీ ఒక కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తి రాకపోతే ఈ ఇడియమ్‌ను ఉపయోగించడం పరిపాటి అయింది. (క్లిక్: డూ యూ వన్నా హ్యాంగవుట్?) -
ఈ పదాన్ని 645 విధాలుగా ఉపయోగిస్తారు!
Run అనే ఆంగ్లపదంలో ఉన్నవి మూడు అక్షరాలే. కాని ఇది మోస్ట్ కాంప్లికేటెడ్, మల్టీ ఫేస్డ్ వర్డ్‌గా పేరు మోసింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ఎడిటర్స్ చెబుతున్నదాని ప్రకారం ‘రన్’ను రకరకాల సందర్భాలను బట్టి 645 విధాలుగా ఉపయోగిస్తున్నారు. ‘కాంటెక్ట్స్ ఈజ్ ఎవ్రీ థింగ్’ కదా మరి! 'రన్' అనే పదానికి తెలుగులో పరుగు అనే అర్థం ఉంది. ‘రన్’కు క్రియాపదం అయిన ‘రన్నింగ్’కు మాత్రం సందర్భానుసారం అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ‘రన్’ ఇంగ్లీషు భాషను నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదని భాషా నిపుణులు అంటున్నారు. (Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?) -
అప్పు చేసే వాళ్లకు పంచాక్షరి మంత్రం!
‘‘ఏమిటయ్యా ఎప్పుడు చూసినా వీల్లేదు వీల్లేదు అంటారు’’ అని అప్పుల గుంపు ఆ ఇంట్లోకి బలవంతంగా తోసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.‘‘చెప్పాను గదయ్యా వీలులేదు’’ అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్లాంటి వాడు.అప్పుడే అక్కడికి భజగోవిందం వచ్చాడు. ఈయన ది గ్రేట్ రామదాసుగారి గుమస్తా.రామదాసుగారికి అప్పులు చేయడం మంచినీళ్లు తాగినంత సులభం. ఈయన నుంచి డబ్బు రాబట్టడం ఇసుక నుంచి ఆయిల్ తీసేంత కష్టం.అప్పులవాళ్లను చూసి...‘‘రండి బాబు రండీ. చెంచయ్యా... వీళ్లందరికి టిఫిన్ పట్రా’’ అని ఆర్డర్ వేశాడు భజగోవిందం.‘‘టిఫిన్ వద్దూ పాడూ వద్దూ. మా బాకీ మాకు పారెయ్యండి చాలు’’ అని ఒంటికాలి మీద లేచి అరిచాడు ఒక అప్పాయన.‘‘అరే.. బాకీకి టిఫిన్‌కు ఎందుకు ముడిపెడతారు? తినండి బాగా తినండి. ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుంది’’ అన్నాడు భజగోవిందం. ఆయన మాటలో ఎన్నో అర్థాలు కనిపించాయి. అవి వెక్కిరిస్తున్నాయి కూడా. కానీ వీళ్లకు వెక్కిరింపులతో ఏంపని?‘‘చాల్లే ఊరుకో. నీకు అంతా వేళాకోళంగా ఉంది. అప్పిచ్చి రాత్రింబవళ్లు నిద్ర పట్టక మేము ఛస్తున్నాం’’ అన్నాడు ఆ గుంపులో బక్కపలచటి వ్యక్తి.‘‘అయితే బాదంలో తినండి. బాగా నిద్రపడుతుంది. చెంచయ్యా... ముందు ఆ బాదం ప్లేట్లు అవి పట్రా’’ అని అరిచాడు భజగోవిందం. ఈ అరుపులోనూ వేళాకోళం ధ్వనించింది. ‘‘చాల్లేవయ్యా, రామదాసుగారిని పిలువు’’ అంటూ భజగోవిందం మీద భగ్గుమన్నాడు ఒకడు.ఈలోపు రామదాసుగారు రానే వచ్చారు. అప్పటి వరకు బెంగాల్ టైగర్‌గా కనిపించిన అప్పుల వాళ్లు ఏదో మంత్రం వేసినట్లు మ్యావ్గా మారిపోయారు. (ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడకపోయినా అప్పు ఇచ్చిన వారికి భయపడాలని, గజగజవణుకుతూ వారిని గౌరవంగా పలకరించాలని పెద్దలు ఎన్నడో చెప్పారు) ‘‘ఎందుకొచ్చారు?’’ దబాయిస్తున్నట్లుగా అడిగాడు రామదాసు. ‘‘మీకు అప్పు ఇచ్చాం కదండి. మా డబ్బు మాకు ఇవ్వండి. తిరగలేక ఛస్తున్నాం’’ అనాలి లెక్క ప్రకారం. అలా ఏం అనలేదు. ఇలా మాత్రం అన్నారు... ‘‘ఏ... ఏమీ లేదండి. తమకు రావుబహుదూర్ బిరుదు వచ్చిందని తెలిసి చూసిపోదామని వచ్చాం’’ ‘‘ఓహో...చూశారుగా. ఇక దయచేయండి’’ అని వెక్కిరించినంత పని చేశాడు రామదాసు. ‘‘అంతేనంటారా!’’ అని నీళ్లు నములుతూనే ‘‘మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?’’ అడిగారు అప్పులవాళ్లు. ‘‘ఎందుకు రావడం?’’ అన్నాడు రామదాసు.\ ‘‘పాత బాకీ కోసం అండీ’’ సూటిగా పాయింట్లోకి వచ్చారు అప్పులవాళ్లు. ‘‘ఇస్తాను లేవయ్యా బోడి పదివేలు. లక్షలు లక్షలిచ్చిన వాళ్లే నోరెత్తడం లేదు’’ అరిచినంత పనిచేశాడు రామదాసు.\ ‘‘నువ్వు మాత్రం తగులుకున్నావు చెవి కింద జోరీగలాగా’’ అని బాసుకు వంత పాడాడు భజగోవిందం. ‘‘ఆయన్ని అడుగుతుంటే మధ్యన మీకెందుకండి’’ భజగోవిందాన్ని కొరకొరా చూశాడు అప్పాయన. ‘‘అడగడానికి వేళాపాళా ఉండనక్కర్లేదూ’’ అంటూనే ‘రణ...దీప్’ అని కేకేశాడు. రణ... దీప్ అనే సౌండ్ వినగానే వాళ్లు భయపడిపోయారు. ఎందుకంటే ఈయన రామదాసు బాడీగార్డ్. అంత్తెత్తున ఉంటాడు. అందుకే.... ‘‘మేం వెళతాం లెండి... వెళతాం లెండి’’ అని ఎక్కడి వాళ్లు అక్కడ జారుకున్నారు. అద్దం ముందు మేకప్ చేసుకుంటున్న భజగోవిందానికి ఏదో అలికిడై చూసీచూడనట్లు వెనక్కి తిరిగాడు. అమ్మో...అప్పుల వాళ్లు! వాళ్లు వస్తున్నారని గ్రహించి రాని ఫోన్‌ను చెవిలో పెట్టుకొని ‘హలో హలో’ అంటున్నాడు. అప్పుడే అప్పులవాళ్ల గుంపు వచ్చింది. ‘ఎందుకయ్యా అందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు?’’ అసహనంగా అన్నాడు భజగోవిందం. ఆయన మధ్య వాళ్ల మధ్య మాటలు ఊపందుకోబోతున్న సమయంలో సీన్లోకి రామదాసు వచ్చాడు. ‘‘ఎవరోయి వీళ్లంతా భజగోవిందం?’’ అని ఆరాతీశాడు. ‘‘వీళ్లంతా నా బాకీ వాళ్లండి. పప్పులు ఉప్పులు... అంతా చిల్లరగ్రహాలండి’’ వినయంగా చెప్పాడు భజగోవిందం. ‘‘సరే, రేపు ఇస్తాడు పోండి’’ అని అప్పులవాళ్లను గద్దించాడు రామదాసు. ‘‘వెళ్లమంటున్నారుగా. వెళ్లండి’’ భజగోవిందం కూడా బాసుకు మద్దతుగా గద్దించాడు. ‘‘అయితే భజగోవిందం నువ్వూ అప్పులు చేస్తావన్నమాట’’ ఆశ్చర్యంగా అన్నాడు రామదాసు. ‘‘అబ్బే! నేను చేయలేదండి. అప్పు చేస్తే దొరుకుతుందా? మన పరపతినిబట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమస్తాననేసరికి మన పరపతి పెరిగింది.వాళ్లు నా వెంట పడ్డారు. వద్దనడం ఎందుకు? ఖాతాలు పెట్టాను. ఇక చూస్కోండి. మా మామ అందులోనే, మరదలు అందులోనే, చెంచయ్య అందులోనే, నాటకం వాళ్లు, వాళ్ల బంధుమిత్ర సమేతంగా అందరూ అందులోనే వాడేవారంతా’’ ‘‘సరి సరి. ఇంకా నువ్వు అప్పు చేయడంలో కొత్త బిచ్చగానిలా కనబడుతున్నావు. నే చెప్తాను ఆ కిటుకు. నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా ఫర్వాలేదు. కానీ అప్పుల వాళ్లు ఎక్కువమంది ఉండకూడదు. ఒక్కడ్నే అడిగావనుకో అందరూ వెంటబడతారు. ఇక ముందు నీకు వెయ్యి రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకోవద్దు. పదిమంది దగ్గర పది వందలుగా మాత్రమే తీసుకో’’ అని లెక్చర్ దంచాడు రామదాసు. ‘‘ఆహా... అప్పు చెసేవాళ్లకు ఇది పంచాక్షరి మంత్రమండి. మీరు నాకో వెయ్యిరూపాయలిస్తే తొందరపెట్టేవాళ్లందరికీ ఇచ్చేస్తా’’ అని అట్టి పంచాక్షరి మంత్రాన్ని ఆయనపైనే ఎక్కుపెట్టాడు భజగోవిందం. ‘‘తొందరపడేవాళ్లేమిటోయ్ ఇంకో అయిదొందలైనా సరే అందరికీ సర్దెయ్. ఇప్పుడు మనకు కూడా చిల్లరబాకీలు తీర్చడానికి రెండు లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు’’ అంటూ భజగోవిందం ప్రయోగించిన బాణాన్ని నేలకూల్చాడు రామదాసు. ‘‘రెండు లక్షలా? ఎక్కడ చూడనండి! ఇప్పుడు బజారులో మనకేం పరపతిలేదు’’ కుండబద్ధలు కొట్టాడు భజగోవిందం. ‘‘పరపతి ఉంటే నువ్వేందుకోయ్ ఏడ్వడానికి? వాళ్లే ఇంటికి తెచ్చిస్తారు. పో...పో... పొయ్యి కొత్తవాళ్లనెవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లా ఎప్పటికప్పుడు మనం కొత్తవాళ్లను పట్టాల్సిందే’’ అన్నాడు రామదాసు. ‘‘మరి వడ్డీ సంగతి!’’ అని భజగోవిందం అమాయకంగా అడిగితే... ‘‘వడ్డీ ఎంతయితే ఏమిటి? ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు’’ అన్నాడు గడుసుగా రామదాసు. -
ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం
సత్ గ్రంథం కాలాన్ని అనుసరించి కర్మలను చేయాలంది శాస్త్రం. ఏకాలంలో ఏ పనులు చేయడం శ్రేయస్కరమో ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి సద్గ్రంథాలలో పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే ఈ రోజుల్లో అంతటి ఉద్గ్రంథాలను చదివే ఓపిక, తీరిక ఉన్నవారు అరుదు. ఒకవేళ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా, గ్రాంథిక భాషలో ఉండే ఆయా విషయాలను అర్థం చేసుకోవడం కష్టం. ఈ లోటును పూరించేందుకుగానూ పాత్రికేయుడు, అధ్యాపకుడు డా. కప్పగంతు రామకృష్ణ అనేకమైన ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి, ఏ మాసంలో ఏయే పనులు చేయాలో వివరిస్తూ, ‘నిత్యోత్సవము’ అనే పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకంలో చైత్రం మొదలుకొని, ఫాల్గుణం వరకు ప్రతి మాసం విశిష్టతతోబాటు ఏ మాసంలో... ఏ తిథిలో ఏ పనిని చేయాలో వివరంగా తెలియజేశారు. ఇక జనమందరూ శూన్యమాసాలుగా చిన్నచూపు చూసే ఆషాఢ, భాద్రపద, పుష్యమాసాలను అనంత ఫలాల మాసమనీ, పితృప్రీతికరమాసమనీ, పుణ్యఫలాల మాసమనీ సంభావిస్తూ, ఆ మాసాల వైశిష్ట్యాన్ని వివరించడం అభినందనీయం. ప్రతి మాసాన్నీ శుక్లపక్షం- కృష్ణపక్షంగా విభజిస్తూ, ఏ తిథిన ఏ పర్వదినమో, ఆనాడు ఏ విధిని నిర్వర్తించాలో వాడుక భాషలో చెప్పడం వల్ల పెద్దబాలశిక్షతోనో, ప్రాథమిక విద్యతోనో సరిపెట్టేసిన వారు సైతం సులువుగా అర్థం చేసుకోగ లరు. నిత్యోత్సవము (మహిమాన్విత మాసాలు; రచన: డాక్టర్.కె.రామకృష్ణ) పుటలు: 104; వెల: రూ.75 (తపాలా ఖర్చులు అదనం); ప్రతులకు: శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్; 11-25-119, మెయిన్ రోడ్, విజయవాడ-520 001; కె.లక్ష్మీనారాయణ, ఇం.నం. 9-22, కొత్తూరు తాడేపల్లి పోస్ట్, వయా మిల్క్ ప్రాజెక్ట్, విజయవాడ-12. సెల్:9032044115 - డి.వి.ఆర్. -
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
మార్కాపురం : ‘సాక్షి’ స్పెల్‌బీ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్లో విశేష స్పందన లభిస్తోంది. నిత్య జీవితంలో తరచూ వాడే పదాలు, ఇంగ్లిషు స్పెల్లింగ్, అర్థాలు, అవగాహన, వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్చుకోవడం, భాషపై పట్టు సాధించాలనే లక్ష్యంతో సాక్షి స్పెల్‌బీ చేపట్టిన కార్యక్రమానికి డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో వివిధ పాఠశాలల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇంగ్లిషు భాషపై ఒకటో తరగతి నుంచే పట్టుసాధించేందుకు స్పెల్‌బీ ఉపయోగపడుతుందని పలువురు విద్యార్థులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లిషుపై పట్టుసాధిస్తే ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాణించవచ్చనే నమ్మకం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిషు భాషపై, నిత్యం వాడుతున్న పదాలపై పట్టుసాధించేందుకు సాక్షి స్పెల్‌బీ పుస్తకం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి 5 విభాగాలుగా విభజించి అక్టోబర్ 15న మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ, నవంబర్ 23న మూడో దశ, డిసెంబర్ 5న చివరి దశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో 1, 2 తరగతులు, రెండో విభాగంలో 3, 4 తరగతులు, మూడో విభాగంలో 5, 6, 7 తరగతులు, నాలుగో విభాగంలో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పట్టణంలోని ఓం సాయివికాస్ విద్యానికేతన్, విశ్వశాంతి పబ్లిక్ స్కూల్, కమలా కాన్సెప్ట్ స్కూల్, సాయిచైతన్య స్కూల్, తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.