‘‘ఏమిటయ్యా ఎప్పుడు చూసినా వీల్లేదు వీల్లేదు అంటారు’’ అని అప్పుల గుంపు ఆ ఇంట్లోకి బలవంతంగా తోసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.‘‘చెప్పాను గదయ్యా వీలులేదు’’ అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్‌లాంటి వాడు.అప్పుడే అక్కడికి భజగోవిందం వచ్చాడు. ఈయన ది గ్రేట్ రామదాసుగారి గుమస్తా.రామదాసుగారికి అప్పులు చేయడం మంచినీళ్లు తాగినంత సులభం. ఈయన నుంచి డబ్బు రాబట్టడం ఇసుక నుంచి ఆయిల్ తీసేంత కష్టం.అప్పులవాళ్లను చూసి...‘‘రండి బాబు రండీ. చెంచయ్యా... వీళ్లందరికి టిఫిన్ పట్రా’’ అని ఆర్డర్ వేశాడు భజగోవిందం.‘‘టిఫిన్ వద్దూ పాడూ వద్దూ. మా బాకీ మాకు పారెయ్యండి చాలు’’ అని ఒంటికాలి మీద లేచి అరిచాడు ఒక అప్పాయన.‘‘అరే.. బాకీకి టిఫిన్‌కు ఎందుకు ముడిపెడతారు? తినండి బాగా తినండి. ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుంది’’ అన్నాడు భజగోవిందం. ఆయన మాటలో ఎన్నో అర్థాలు కనిపించాయి. అవి వెక్కిరిస్తున్నాయి కూడా. కానీ వీళ్లకు వెక్కిరింపులతో ఏంపని?‘‘చాల్లే ఊరుకో. నీకు అంతా వేళాకోళంగా ఉంది. అప్పిచ్చి రాత్రింబవళ్లు నిద్ర పట్టక మేము ఛస్తున్నాం’’ అన్నాడు ఆ గుంపులో బక్కపలచటి వ్యక్తి.‘‘అయితే బాదంలో తినండి. బాగా నిద్రపడుతుంది. చెంచయ్యా... ముందు ఆ బాదం ప్లేట్లు అవి పట్రా’’ అని అరిచాడు భజగోవిందం. ఈ అరుపులోనూ వేళాకోళం ధ్వనించింది. ‘‘చాల్లేవయ్యా, రామదాసుగారిని పిలువు’’ అంటూ భజగోవిందం మీద భగ్గుమన్నాడు ఒకడు.ఈలోపు రామదాసుగారు రానే వచ్చారు. అప్పటి వరకు బెంగాల్ టైగర్‌గా కనిపించిన అప్పుల వాళ్లు ఏదో మంత్రం వేసినట్లు మ్యావ్‌గా మారిపోయారు. (ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడకపోయినా అప్పు ఇచ్చిన వారికి భయపడాలని, గజగజవణుకుతూ వారిని గౌరవంగా పలకరించాలని పెద్దలు ఎన్నడో చెప్పారు) ‘‘ఎందుకొచ్చారు?’’ దబాయిస్తున్నట్లుగా అడిగాడు రామదాసు. ‘‘మీకు అప్పు ఇచ్చాం కదండి. మా డబ్బు మాకు ఇవ్వండి. తిరగలేక ఛస్తున్నాం’’ అనాలి లెక్క ప్రకారం. అలా ఏం అనలేదు. ఇలా మాత్రం అన్నారు... ‘‘ఏ... ఏమీ లేదండి. తమకు రావుబహుదూర్ బిరుదు వచ్చిందని తెలిసి చూసిపోదామని వచ్చాం’’ ‘‘ఓహో...చూశారుగా. ఇక దయచేయండి’’ అని వెక్కిరించినంత పని చేశాడు రామదాసు. ‘‘అంతేనంటారా!’’ అని నీళ్లు నములుతూనే ‘‘మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?’’ అడిగారు అప్పులవాళ్లు. ‘‘ఎందుకు రావడం?’’ అన్నాడు రామదాసు.\ ‘‘పాత బాకీ కోసం అండీ’’ సూటిగా పాయింట్‌లోకి వచ్చారు అప్పులవాళ్లు. ‘‘ఇస్తాను లేవయ్యా బోడి పదివేలు. లక్షలు లక్షలిచ్చిన వాళ్లే నోరెత్తడం లేదు’’ అరిచినంత పనిచేశాడు రామదాసు.\ ‘‘నువ్వు మాత్రం తగులుకున్నావు చెవి కింద జోరీగలాగా’’ అని బాసుకు వంత పాడాడు భజగోవిందం. ‘‘ఆయన్ని అడుగుతుంటే మధ్యన మీకెందుకండి’’ భజగోవిందాన్ని కొరకొరా చూశాడు అప్పాయన. ‘‘అడగడానికి వేళాపాళా ఉండనక్కర్లేదూ’’ అంటూనే ‘రణ...దీప్’ అని కేకేశాడు. రణ... దీప్ అనే సౌండ్ వినగానే వాళ్లు భయపడిపోయారు. ఎందుకంటే ఈయన రామదాసు బాడీగార్డ్. అంత్తెత్తున ఉంటాడు. అందుకే.... ‘‘మేం వెళతాం లెండి... వెళతాం లెండి’’ అని ఎక్కడి వాళ్లు అక్కడ జారుకున్నారు.
అద్దం ముందు మేకప్ చేసుకుంటున్న భజగోవిందానికి ఏదో అలికిడై చూసీచూడనట్లు వెనక్కి తిరిగాడు. అమ్మో...అప్పుల వాళ్లు! వాళ్లు వస్తున్నారని గ్రహించి రాని ఫోన్‌ను చెవిలో పెట్టుకొని ‘హలో హలో’ అంటున్నాడు. అప్పుడే అప్పులవాళ్ల గుంపు వచ్చింది. ‘ఎందుకయ్యా అందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు?’’ అసహనంగా అన్నాడు భజగోవిందం. ఆయన మధ్య వాళ్ల మధ్య మాటలు ఊపందుకోబోతున్న సమయంలో సీన్‌లోకి రామదాసు వచ్చాడు. ‘‘ఎవరోయి వీళ్లంతా భజగోవిందం?’’ అని ఆరాతీశాడు. ‘‘వీళ్లంతా నా బాకీ వాళ్లండి. పప్పులు ఉప్పులు... అంతా చిల్లరగ్రహాలండి’’ వినయంగా చెప్పాడు భజగోవిందం. ‘‘సరే, రేపు ఇస్తాడు పోండి’’ అని అప్పులవాళ్లను గద్దించాడు రామదాసు. ‘‘వెళ్లమంటున్నారుగా. వెళ్లండి’’ భజగోవిందం కూడా బాసుకు మద్దతుగా గద్దించాడు. ‘‘అయితే భజగోవిందం నువ్వూ అప్పులు చేస్తావన్నమాట’’ ఆశ్చర్యంగా అన్నాడు రామదాసు. ‘‘అబ్బే! నేను చేయలేదండి. అప్పు చేస్తే దొరుకుతుందా? మన పరపతినిబట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమస్తాననేసరికి మన పరపతి పెరిగింది.వాళ్లు నా వెంట పడ్డారు. వద్దనడం ఎందుకు? ఖాతాలు పెట్టాను. ఇక చూస్కోండి. మా మామ అందులోనే, మరదలు అందులోనే, చెంచయ్య అందులోనే, నాటకం వాళ్లు, వాళ్ల బంధుమిత్ర సమేతంగా అందరూ అందులోనే వాడేవారంతా’’ ‘‘సరి సరి. ఇంకా నువ్వు అప్పు చేయడంలో కొత్త బిచ్చగానిలా కనబడుతున్నావు. నే చెప్తాను ఆ కిటుకు. నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా ఫర్వాలేదు. కానీ అప్పుల వాళ్లు ఎక్కువమంది ఉండకూడదు. ఒక్కడ్నే అడిగావనుకో అందరూ వెంటబడతారు. ఇక ముందు నీకు వెయ్యి రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకోవద్దు. పదిమంది దగ్గర పది వందలుగా మాత్రమే తీసుకో’’ అని లెక్చర్ దంచాడు రామదాసు. ‘‘ఆహా... అప్పు చెసేవాళ్లకు ఇది పంచాక్షరి మంత్రమండి. మీరు నాకో వెయ్యిరూపాయలిస్తే తొందరపెట్టేవాళ్లందరికీ ఇచ్చేస్తా’’ అని అట్టి పంచాక్షరి మంత్రాన్ని ఆయనపైనే ఎక్కుపెట్టాడు భజగోవిందం.
‘‘తొందరపడేవాళ్లేమిటోయ్ ఇంకో అయిదొందలైనా సరే అందరికీ సర్దెయ్. ఇప్పుడు మనకు కూడా చిల్లరబాకీలు తీర్చడానికి రెండు లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు’’ అంటూ భజగోవిందం ప్రయోగించిన బాణాన్ని నేలకూల్చాడు రామదాసు. ‘‘రెండు లక్షలా? ఎక్కడ చూడనండి! ఇప్పుడు బజారులో మనకేం పరపతిలేదు’’ కుండబద్ధలు కొట్టాడు భజగోవిందం. ‘‘పరపతి ఉంటే నువ్వేందుకోయ్ ఏడ్వడానికి? వాళ్లే ఇంటికి తెచ్చిస్తారు. పో...పో... పొయ్యి కొత్తవాళ్లనెవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌లా ఎప్పటికప్పుడు మనం కొత్తవాళ్లను పట్టాల్సిందే’’ అన్నాడు రామదాసు. ‘‘మరి వడ్డీ సంగతి!’’ అని భజగోవిందం అమాయకంగా అడిగితే... ‘‘వడ్డీ ఎంతయితే ఏమిటి? ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు’’ అన్నాడు గడుసుగా రామదాసు.
అప్పు చేసే వాళ్లకు పంచాక్షరి మంత్రం!
Published Sun, Nov 25 2018 12:01 AM | Last Updated on Sun, Nov 25 2018 12:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment