clerk
-
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
బదిలీ నిబంధనపై గుబులు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎప్ఓ) పరిధిలో ఉద్యోగులకు సంబంధించి సంస్థ తీసుకొచ్చిన నూతన బదిలీ విధానం–2022 క్లరికల్ స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈపీఎఫ్ఓలో క్లర్క్(సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) లేదా సీనియర్ క్లర్క్ (సీనియర్ సొషల్ సెక్యూరిటీ అసిస్టెంట్) ఒకేచోట మూడు సంవత్సరాల సర్విసు పూర్తి చేసుకుంటే వెంటనే ఇతర కార్యాలయానికి బదిలీ చేయాలనేది పాలసీలోని ప్రధానాంశం. ఈపీఎఫ్ఓ కార్యక్రమాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచేందుకు ఈ తరహా మార్పు తప్పనిసరి అని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 12న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న వారికి ఏటా నిర్వహించే బదిలీలకు సంబంధించిన నిబంధనలను వివరించింది. అయితే ఎలాంటి నిర్ణయాధికారాలు లేని క్లర్క్ స్థాయి ఉద్యోగికి కూడా ఈ నిబంధన వర్తింపజేసి మూడేళ్లకోసారి బదిలీ చేయడం వల్ల వారి కుటుంబాల భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కావాలంటే సెక్షన్లు మార్చండి.. ఈపీఎఫ్ఓకు సంబంధించి తెలంగాణలో ఎనిమిది చోట్ల కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా, మాదాపూర్, కూకట్పల్లి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలో ఇవి కొనసాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో కడప, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరులో ఈ కార్యాలయాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 2 వేల వరకు క్లరికల్ ఉద్యోగులుంటారు. కాగా ఈపీఎఫ్ఓ తాజా నిబంధనతో వీరు ఆ రాష్ట్ర పరిధిలోని ఏ కార్యాలయానికైనా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని అమలు చేస్తే తమ పిల్లల చదువులు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని, భవిష్యత్తులో స్థానికత అంశం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. బదిలీ చేయాలనుకుంటే ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి కాకుండా.. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలోనే సెక్షన్ల మార్పు చేస్తే ఉద్యోగికి వెసులుబాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనివల్ల ఉద్యోగికి బదిలీ సమయంలో ఇచ్చే ఒక నెల అదనపు వేతనానికి సంబంధించిన నిధులు కూడా సంస్థకు మిగులుతాయని చెబుతున్నారు. ఈ మేరకు క్లరికల్ కేడర్ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. మరోవైపు నూతన పాలసీ అమల్లోకి వచ్చి రెండు నెలలు కావస్తుండడం, త్వరలోనే బదిలీలు చేసే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల సంఘం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
నెలకు 4వేల జీతంతో మొదలైన ‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!
భోపాల్: భోపాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోట్ల ఆస్తిని కూడబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అతని ఇంట్లో దొరికిన నగదు, ఇతర ఆస్తి పత్రాలు చూసిన నివ్వెర పోయారు. స్థిరాస్తులు, ఇతర కోట్ల రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ 85 లక్షలకు పైగా నగదు లభించినట్టు అధికారులు వెల్లడించారు. లెక్కింపు, పత్రాల వెరిఫికేషన్ తర్వాతే అతడి మొత్తం విలువ తెలుస్తుందని ఈఓడబ్ల్యు ఎస్పీ రాజేష్ మిశ్రా తెలిపారు. (ఇదీ చదవండి: అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!) నెలకు నాలుగువేల రూపాయల జీతంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖలో అప్పర్ డివిజన్ క్లర్క్‌గా కరియర్ ప్రారంభించిన హీరో కేశ్వాని ప్రస్తుతం నెలకు దాదాపు రూ.50 వేల జీతం తీసుకుంటున్నాడు. అక్రమ ఆస్తులు ఫిర్యాదుల విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నోట్ లెక్కింపు యంత్రాన్ని సాయంతో డబ్బును లెక్కించినట్టు ఈఓడబ్ల్యు అధికారి తెలిపారు. అలాగే కోట్లాది రూపాయల పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఖరీదైన అలంకార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేస్వానీ నివాసం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని అంచనా వేశారు. కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన కేశ్వాని భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. బైరాగఢ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే అధికారుల సోదాలను ప్రతిఘటించిన కేశ్వానీ, తన ఎత్తులు సాగకపోయేసరికి బాత్రూమ్ క్లీనర్‌ను తాగేశాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ మిశ్రా తెలిపారు. #WATCH | MP:Around Rs 80 Lakhs cash, property documents & gold-silver recovered from residence of Hero Keswani, sr clerk of Medical Education Dept in Bhopal. Economic Offences Wing conducted a raid at his residenc. He was hospitalised after his health deteriorated when raid began pic.twitter.com/FgK73jBMQx — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 3, 2022 -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 3820 విభాగాల వారీగా పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్ –163, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–1931. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఆంధ్రప్రదేశ్–35: యూడీసీ–07, ఎంటీఎస్–26, స్టెనో–02. తెలంగాణ–72: యూడీసీ–25, ఎంటీఎస్–43, స్టెనో–04 అర్హతలు: ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వయసు: స్టెనో, యూడీసీ పోస్టులకి 18–27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టులకి 4వ పే లెవల్ ప్రకారం–నెలకు రూ.25,500–రూ.81,100, ఎంటీఎస్ వారికి పే లెవల్ 1 ప్రకారం–నెలకు రూ.18,800– రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, స్కిల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): యూడీసీ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష–200 మార్కులకు, మెయిన్స్–200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ప్రిలిమినరీ పరీక్షకు గంట(60 నిమిషాలు) సమయం, మెయిన్స్‌కు రెండు గంటలు(120 నిమిషాలు) పరీక్ష సమయంగా కేటాయిస్తారు. స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే నిర్వహించి అర్హులైన వారిని తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్కిల్ టెస్ట్‌కు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష సమయం 130 నిమిషాలు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్(ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి. డిక్టేషన్‌కు 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. నిమిషానికి 80 వర్డ్స్ టైప్ చేయాలి. ట్రాన్స్స్క్రిప్షన్కు సంబంధించి ఇంగ్లిష్‌కు 50 నిమిషాలు(పీడబ్ల్యూడీలకు 70 నిమిషాలు ), హిందీకి 65 నిమిషాలు(పీడబ్యూడీలకు 90 నిమిషాలు) స్కిల్ టెస్టుకు సమయం కేటాయిస్తారు. మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఎంటీఎస్ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ–200 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభతేదీ: 15.01.2022 ► దరఖాస్తు చివరి తేదీ: 15.02.2022 ► వెబ్సైట్: esic.nic.in -
పేదరికం నుంచి ...అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా
వైఎస్సార్ జిల్లా (రాజంపేట టౌన్) : సమాజంలో కొందరి జీవితాలు అచ్చు సినిమాలో మాదిరిగానే ఉంటాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లే తన రెక్కల కష్టంతో పిల్లలను ప్రయోజకులను చేయడంలాంటివి నిజజీవితంలో కొందరికీ ఎదురవుతాయి. అలాంటి సంఘటనే రాజంపేటలోని కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి జీవితంలో చోటు చేసుకుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలని కుతుహులంగా ఉంది కదా! (చదవండి: పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్ చేసి...) వివరాల్లోకెళితే.... రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి చిన్ననాటి జీవితం అచ్చు సినిమాల్లోలాగానే సాగింది. ఆమెకు ఏడాది వయస్సు ఉన్నప్పుడు, తన తమ్ముడు ఈ భూమ్మీద పడకమునుపే వసుమతి తండ్రి వెంకటయ్యనాయుడు చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆకుటుంబంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. అయితే తల్లి లక్ష్మీకుమారి తన రెక్కల కష్టంతో ఇద్దరు బిడ్డలను పోషిస్తూ వచ్చారు. ఈక్రమంలో పాఠశాల స్థాయిలో జరిగే జిల్లా, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో వసుమతి ప్రతిభ కనబరిచేది. అప్పటి ప్రభుత్వ హైస్కూల్ పీటీ, వాలీబాల్ కోచ్ అయిన ఎస్. షామీర్ బాషా వసుమతిలోని ప్రతిభను పసిగట్టి మరింత ప్రోత్సహించసాగారు. ఇదే సమయంలో తన బిడ్డ వాలీబాల్‌లో ప్రతిభ కనబరుస్తుండటం ఆనోట, ఈనోట విన్న తల్లి లక్ష్మీకుమారి తన బిడ్డను ఎలాగైనా మంచి క్రీడాకారిణిగా తయారు చేయాలనుకుంది. అయితే ఆడపిల్లను ఊరుకాని ఊరికీ పంపి ఆటలు ఆడించటం ఎందుకు అని వసుమతి తల్లిని నిరుత్సాహ పరిచినవారు లేక పోలేదు. అయితే ఆమెకు తన బిడ్డలోని ప్రతిభ మాత్రమే కనిపించేది. అందువల్ల ఆమె ఎవరి మాటలను పట్టించుకోలేదు. పాడిరైతు అయిన వసుమతి తల్లి సంపాదన అంతంత మాత్రమే కావడంతో ఆమె సోదరులు కూడా తమవంతు సహకరించారు. దీంతో ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన బిడ్డను ప్రోత్సహించింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో వసుమతి 18 మార్లు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆడారు. అలాగే 2002వ సంవత్సరం వియాత్నంలో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై ఆ పోటీల్లో ఆమె విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితంగా 2005వ సంవత్సరంలో వసుమతి స్పోర్ట్ కోటా కింద సౌత్‌సెంట్రల్ రైల్వేలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఆ కుటుంబం పేదరికానికి దూరమైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వేలోనే ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇదే జిల్లా నుంచి ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం విశేషం. ఇదే జిల్లాలో 1978లో బీయాబానీ, 1986లో కరిముల్లా తర్వాత మహిళల విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా వసుమతి నిలిచింది. (చదవండి: దొమ్మరివారి నేల.. నేడు దొమ్మర నంద్యాల) -
కిలేడీ.. బ్యాంక్‌లో క్లర్క్‌గా చెప్పుకోని.. రూ. 3కోట్లు వసూలు..
సాక్షి, ఖమ్మం: ‘నేను బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాను. మేనేజర్లు అందరూ తెలుసు. రూ.5 వేలు కడితే 20 రోజుల్లో రెట్టింపు డబ్బు వస్తుంది.’అని చెప్పి ఓ మహిళ వందలాది మంది నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఇది ఆమెపై నమోదైన రెండో కేసు కావడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. విజయనిర్మల అనే మహిళ.. తాను ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నట్లు నమ్మబలికింది. వందలాది మంది నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే వసూలు చేసిందని సమాచారం. తొలుత కొందరికి రుణాలు ఇప్పించింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన నాగరాజుతో పాటు మరో నలుగురు తాము విజయనిర్మలకు సుమారు రూ.60 లక్షల మేర చెల్లించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకన్నబాబు తెలిపారు. కాగా, ఆమె భర్తను అదుపులోకి తీసుకోగా తన నుంచి విజయనిర్మల విడిపోయి నాలుగు నెలలు అవుతోందని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఆమెపై గతేడాది కూడా ఓ కేసు నమోదైంది. -
నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి..
వివాహం అనగానే ఉద్యోగులకు సహజంగానే సెలవులు ఇస్తారు. అయితే అది ఎన్ని రోజులనేది మనం పని చేసే సంస్థని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఉంటున్న దేశం, అక్కడ అనుసరిస్తున్న చట్టాలకు అనుగుణంగా కూడా సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా.. ఓ ఘనుడు ఎక్కువ పెయిడ్ లీవ్‌లను పొందడం కోసం ఒకే మహిళను ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆ బ్యాంకుకు అతని నిర్వాకం తెలియడంతో లీవ్ పొడిగింపును నిరాకరించింది. ఒకే మహిళను 4 సార్లు వివాహం తైవాన్ రాజధాని తాయ్‌పెయ్ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరి. దీన్నే అడ్డంగా పెట్టుకుని ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన సెలవుతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. ఏదేమైనా ఈ క్లర్క్‌కు చట్టాన్ని వాడుకోవడం బాగానే తెలిసినట్టు ఉంది. ( చదవండి: ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో... ) -
క్లర్కుగా చేసిన చోటే.. చైర్‌పర్సన్‌గా..!
సాక్షి,భీమ్‌గల్ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారింది. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్ఎస్ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. -
చిట్టగాంగ్ చిరుత
చిట్టగాంగ్, సెప్టెంబర్ 23, 1932...రాత్రి 10. 45.‘భారతీయులకీ, కుక్కలకీ ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న పహార్తలీ యూరోపియన్ క్లబ్‌కు నిప్పు పెట్టారు కొందరు. లోపల ఉన్న బ్రిటిష్ అధికారులు ఎదురు కాల్పులు ఆరంభించారు. అందులో ఒక సిక్కు యువకుడు గాయపడ్డాడు. కానీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న పోటాషియం సైనేడ్ మింగి చనిపోయాడు. అలాంటి మాటలతో వేరే జాతీయులని అవమానించామని శ్వేతజాతి జాత్యహంకారం ఆనాడు చంకలు గుద్దుకునేది. కానీ అవే అణగారిన జాతిలో ఆత్మ గౌరవ స్పృహ కోసం పాంచజన్యం పూరించాయి. చిట్టగాంగ్‌లోని పహార్తలీ యూరోపియన్ క్లబ్ ఉదంతం ఇదే చెబుతుంది. అలాంటి మాటలు రాసిన పలకలు చాలా బ్రిటిష్ కార్యాలయాల మీద ఆనాడు వేలాడుతూ కనిపించేవి. మరీ ముఖ్యంగా వాళ్ల క్లబ్‌ల ముందు కనిపించేవి. ఘనత వహించిన బ్రిటిష్ పాలనలో పాలితులకి దక్కిన గౌరవాలలో ఇదొకటి. దక్షిణాఫ్రికాలో కూడా ప్రిటోరియా పాలనలో ఇలాంటి మర్యాదే భారతీయులకీ, బ్రిటిష్ జాతీయులు కాని వారికి ఇదే గౌరవం ఉండేది. ఈ గౌరవంలో నీచత్వం ఎలాంటిదో గాంధీజీ రుచి చూసినది అక్కడే. అయినా ఈ గౌరవాన్ని కూడా ఆనందంగా భరించాలనుకున్నవారే భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు. కానీ కుక్కలనీ, భారతీయులనీ ఒకే విధంగా చూసే దురహంకారాన్ని భరించడానికి సిద్ధంగా లేమనీ ఇలాంటి కుసంస్కారానికి ఆయుధంతోనే సమాధానం ఇస్తామని నెత్తుటి ప్రతిజ్ఞలు చేసినవారు ఉన్నారు. కానీ వారి ధర్మాగ్రహాన్ని చరిత్ర పుటలు నిషేధించాయి. అలా నెత్తురు మీద ప్రమాణం చేసినవారు దేశమంతటా ఉన్నారు. వారంతా రకరకాల రహస్య సంస్థల వారు. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య భారతం, తెలుగు ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయవాదం కనిపిస్తుంది. బెంగాల్లో చిట్టగాంగ్ ఉద్యమకారుల త్యాగాలు కూడా అలాంటివే. కానీ బెంగాల్లో తప్ప చిట్టగాంగ్ వీరుల గురించి మిగిలిన భారతదేశంలో తక్కువ తెలుసు. సూర్యసేన్ (మాస్టర్ దా) నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్ సాయుధదాడికి బ్రిటిష్ ప్రభుత్వం గంగవెర్రులెత్తిపోయింది. ఇందుకు కారణం, చిట్టగాంగ్ అనే ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఉన్న ప్రాముఖ్యం. బ్రిటిష్ వలసగా ఉన్న భారత్ మీద శత్రుదేశాలు దాడి చేస్తే అది అక్కడ నుంచే ఆరంభమవుతుంది. అలాంటి చోట ఆయుధాగారం మీద విప్లవకారులు దాడి చేస్తే అది ఎలాంటి సంకేతాలను పంపుతుందోనని హడలెత్తిపోయింది నాటి ప్రభుత్వం. అందుకే వారి పట్ల మరీ అమానవీయంగా వ్యవహరించింది. పహార్తలీ క్లబ్‌ను దగ్ధం చేసిన చిట్టగాంగ్ వీరులకు నాయకత్వం వహించిన ఆ పంజాబీ యువకుని గురించి....ఆ రాత్రి ఆ క్లబ్ మీద దాడి చేసిన బృందానికి నాయకత్వం వహించినవారు నిజానికి పంజాబీ కాదు. యువకుడు అంతకంటే కాదు. ఒక యువతి ఆ వేషం ధరించింది. ఆమె పేరు ప్రీతిలతా వాడ్డేదార్. ఆ దాడిలో ఆమెకు సహకరించిన కాళీశంకర్ డె, బీరేశ్వర్ రాయ్, ప్రఫుల్ల దాస్, శాంతి చక్రవర్తి, మహేంద్ర చౌధురి, పన్నా సేన్ .. అంతా రకరకాల వేషాలు ధరించారు. ప్రేమలతా వాడ్డేదార్ (మే 5, 1911–సెప్టెంబర్ 23, 1932) అవిభక్త బెంగాల్లో చిట్టగాంగ్‌కు చెందినది. పాటియా ఉప జిల్లా ధాల్‌ఘాట్‌లో జన్మించారు. వారి పూర్వీకుల ఇంటిపేరు దాస్‌గుప్తా. తరువాత ఆ కుటుంబానికి వాడ్డేదార్ అనేది బిరుదుగా స్థిరపడింది. ప్రీతిలత తల్లి ప్రతిభా మాయాదేవి, గృహిణి. తండ్రి జగబంధు వాడ్డేదార్. చిట్టగాంగ్ నగరపాలక సంస్థలో గుమాస్తా. వారి ఆరుగురు బిడ్డలలో ప్రీతిలత రెండో సంతానం. ఆమెకు రాణి అన్న ముద్దు పేరు కూడా ఉంది. తండ్రి పిల్లలందరికీ మంచి చదువు చెప్పించారు. చిట్టగాంగ్‌లోనే ఆనాడు ఎంతో పేరున్న డాక్టర్ ఖస్తగీర్ బాలికోన్నత పాఠశాలలో ప్రీతిలత చదివింది. జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది అక్కడే. అక్కడ ఉష అనే ఉపా«ధ్యాయురాలు ఉండేవారు. ఆమెను పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉషాదా అని పిలుచుకునేవారు. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత గాథలను పిల్లలకు చేప్పేవారు. చిట్టగాంగ్ సాయుధ దాడిలో మరొక సభ్యురాలు కల్పనా దత్తా (1913–1995) కూడా ఇదే పాఠశాలలో అదే తరగతిలో ఉండేవారు. ‘ఆ పాఠశాలలో చదువుకుంటున్న రోజులలో మా భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో మేం ఏనాడూ ఉహించలేదు. కానీ ఝాన్సీ రాణీ జీవిత ఘట్టాలు మాకు ఒక భావనను ఏర్పరిచాయి. అవి వింటూ ఉంటే కొన్ని సందర్భాలలో అసలు మాకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఉండేది’ అని కల్పన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ప్రీతికి కళలు, సాహిత్యం అంటే ఆసక్తి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇచ్చే వేతనంతో ఆమె చదువు సాగింది. చిట్టగాంగ్‌లో చదువు పూర్తయిన తరువాత ఢాకాలోని ఈడెన్ కళాశాలలో ప్రీతి చేరారు. ఆమె జాతీయ భావాలు ఇంకొంచెం విస్తరించే అవకాశం అక్కడ వచ్చింది. అదే పాఠశాలలో చదువుతున్న లీలా నాగ్ (రాయ్) (1900–1970) దీపాలీ సంఘ్ అనే రహస్య సంస్థ నడిచేది. అందులో ప్రీతి చేరారు. ఆపై బిఎ చదవడానికి కలకత్తాలోని బెథూన్ కళాశాలకు వెళ్లారు. అదే ఆమె జీవితంలో పెద్ద మలుపు. 1931లో చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేసిన వారు చిట్టగాంగ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ క్రేగ్‌ను తుదముట్టించాలని పథకం వేశారు. ఇందుకు రామకృష్ణ బిస్వాస్, కాళీపాద చక్రవర్తి అనే ఇద్దరిని నియమించారు. కానీ ఆ ఇద్దరు పొరపాటున చాంద్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ తరిణి ముఖర్జీని కాల్చి చంపారు. పైగా పోలీసులకు తరువాత పట్టుబడ్డారు. కాళీపాదకు ద్వీపాంతర శిక్ష వేసి అండమాన్ తరలించారు. బిస్వాస్‌కు ఉరిశిక్ష వేసి ఆలీపూర్ జైలుకు పంపారు. ఇది కలకత్తాలో ఉంది. తరువాత అతడిని చూసి రావడానికి ఉద్యమకారుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలోనే ఉద్యమకారులు కలకత్తాలో చదువుకుంటున్న ప్రీతిలతను ఆశ్రయించారు. ఆమె ఆలీపూర్ జైలుకు వెళ్లి సోదరినంటూ చెప్పి బిస్వాస్‌ను కలుసుకునేవారు. ఒకటి రెండుసార్లు కాదు నలభయ్ సార్లు. ఆయనతో జరిపిన సంభాషణలతో ప్రీతిలో ఒక ఉద్యమకారిణి నిర్మితమైంది. ఆమె బిఏ మూడేళ్లు చదువు పూర్తయింది. కానీ కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పట్టా ఇవ్వకుండా నిలిపివేసింది. దీనితో ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం అసలు రూపం ఏదో ఇంకాస్త స్పష్టమైంది. తిరిగి చిట్టగాంగ్ వచ్చి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా చేరారు. కానీ ఆమె మనసంతా భారత స్వాతంత్య్రోద్యమంలో చేరాలని ఆరాటపడేది. ఆ సమయంలోనే సూర్యసేన్ ఆమెకు కబురు చేశారు. ప్రీతి జన్మించిన ధాల్‌ఘాట్ శిబిరంలోనే ఆమె జూన్ 13, 1932న మాస్టర్దాను కలుసుకుంది. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉండగా ఆయన కార్యకలాపాలకు ప్రభావితమైంది. ఇప్పుడు స్వయంగా ఆయనను కలుసుకుంది. వెంటనే ఉద్యమంలో ప్రవేశించింది. ఇందుకు మొదట కొందరు చిట్టగాంగ్ ఉద్యమకారులు వ్యతిరేకించారు. కానీ సూర్యసేన్ దృష్టి వేరు.మహిళలతో ఆయుధ సేకరణ సులభంగా చేయవచ్చు. అదే గ్రామంలో సావిత్రీదేవి అనే ఉద్యమ సానుభూతిపరురాలి ఇంటిలో ఉండగా పోలీసు దాడి జరిగింది. అది సావిత్రీదేవి భర్త చేయించిన పని.ఆయన ఒకప్పుడు ఉద్యమకారుడే. తరువాత మారిపోయాడు. సూర్యసేన్, ప్రీతిలత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చిట్టగాంగ్‌లోని రెండు ఆయుధాగారాలను, పహార్తలీ క్లబ్‌ను, ఇతర బ్రిటిష్ కార్యాలయాల మీద దాడి చేయాలని సూర్యసేన్ పెద్ద పథకం వేశారు. ఇదే చరిత్రలో చిట్టగాంగ్ దాడిగా నమోదైంది. నలభయ్ మంది సభ్యులను మూడు బృందాలుగా విభజించి, క్లబ్ మీద దాడి చేసే బృందానికి ప్రీతిని నాయకురాలిని చేశారు సేన్. నిజానికి ఈ పని కల్పనా దత్తాకు అప్పగించాలి. కానీ ఆమె అప్పటికి వారం ముందే అరెస్టయ్యారు. దీనితో ప్రీతికి అప్పగించారు. ఇందుకోసం ఆమెకు కోటోవాలీ సీసైడ్ అనేచోట ఆయుధ శిక్షణ ఇచ్చారు. అనుకున్న ప్రకారం క్లబ్ మీద దాడి జరిగింది. సలీవాన్ ఇంటి పేరున్న ఒక బ్రిటిష్ మహిళ ఈ దాడిలో చనిపోయింది. నలుగురు పురుషులు, ఏడుగురు స్త్రీలు కూడా గాయపడ్డారు. లోపల పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ ప్రీతికి తగిలింది. ఆమె పారిపోతూ ఉండగా ఒక పోలీసు పట్టుకున్నాడు. అరెస్టును నివారించేందుకు నాయకులు ముందే ఆదేశించినట్టు పొటాషియం సైనేడ్ మింగి చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. శవపరీక్ష సమయంలో ఆమె చిట్టగాంగ్ ఉద్యమంలో పనిచేస్తున్నదని చెప్పడానికి అన్ని ఆధారాలు దొరికాయి. కొన్ని కరపత్రాలు దొరికాయి. దాడికి సంబంధించిన మ్యాప్ దొరికింది. వాటì తో పాటు ఒక ఫొటో కూడా. అది ఆలీపూర్ కారాగారంలో, సోదరిగా పరిచయం చేసుకుని తాను నలభయ్ పర్యాయాలు సమావేశమైన రామకృష్ణ బిస్వాస్ ఫొటో. తనలోని ఉద్యమకారిణికి ఆకృతి ఇచ్చిన బిస్వాస్ ఫొటో. ఆయనంటే ఆమెకు అంత ఆరాధన. బ్రిటిష్ జాతి నీచత్వం అక్కడ బయటపడింది. పైగా ప్రీతి కాల్పులలో తనకు తగిలిన తూటాకు ప్రాణాలు విడవలేదు. పొటాషియం సైనేడ్‌తోనే చనిపోయిందన్న సంగతి తెలిసింది. అందుకే కాబోలు రామకృష్ణ బిస్వాస్‌కు ప్రీతి ఉంపుడు గత్తె అని రాశారు. ప్రీతిలత పేరు మన చరిత్రలో మరొక కోణం నుంచి కూడా నమోదు కావలసి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆయుధం ఎత్తిన తొలి బెంగాలీ యువతి ప్రీతిలత. -
గుమస్తా కంటే ఎక్కువ పని చేస్తున్నాను : సీఎం
బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో పొరపొచ్చలు మరోసారి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ కూడా నిలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సేల సమావేశానికి హాజరైన కుమార స్వామి మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ కలగజేసుకుంటుందని.. ఫలితంగా తాను సీఎం అయి ఉండి కూడా గుమస్తా కంటే ఎక్కువ చాకిరీ చేస్తున్నాని వాపోయాడు. కాంగ్రెస్ నాయకులు తనను ఓ సబార్డినేట్‌గా చూస్తున్నారని.. తన మీద చాలా ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన ప్రతి కాగితం మీద సంతకం చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు తనను ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అసలు తన ప్రమేయం లేకుండానే కొన్ని విషయాలకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదయితే కుమారస్వామి ఇలా బాధపడటం ఇదే ప్రథమం కాదు. గతంలో సీఎం స్థానంలో తను సంతోషంగా లేనని.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నానని కుమారస్వామి కన్నీటిపర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
అప్పు చేసే వాళ్లకు పంచాక్షరి మంత్రం!
‘‘ఏమిటయ్యా ఎప్పుడు చూసినా వీల్లేదు వీల్లేదు అంటారు’’ అని అప్పుల గుంపు ఆ ఇంట్లోకి బలవంతంగా తోసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.‘‘చెప్పాను గదయ్యా వీలులేదు’’ అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్లాంటి వాడు.అప్పుడే అక్కడికి భజగోవిందం వచ్చాడు. ఈయన ది గ్రేట్ రామదాసుగారి గుమస్తా.రామదాసుగారికి అప్పులు చేయడం మంచినీళ్లు తాగినంత సులభం. ఈయన నుంచి డబ్బు రాబట్టడం ఇసుక నుంచి ఆయిల్ తీసేంత కష్టం.అప్పులవాళ్లను చూసి...‘‘రండి బాబు రండీ. చెంచయ్యా... వీళ్లందరికి టిఫిన్ పట్రా’’ అని ఆర్డర్ వేశాడు భజగోవిందం.‘‘టిఫిన్ వద్దూ పాడూ వద్దూ. మా బాకీ మాకు పారెయ్యండి చాలు’’ అని ఒంటికాలి మీద లేచి అరిచాడు ఒక అప్పాయన.‘‘అరే.. బాకీకి టిఫిన్‌కు ఎందుకు ముడిపెడతారు? తినండి బాగా తినండి. ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుంది’’ అన్నాడు భజగోవిందం. ఆయన మాటలో ఎన్నో అర్థాలు కనిపించాయి. అవి వెక్కిరిస్తున్నాయి కూడా. కానీ వీళ్లకు వెక్కిరింపులతో ఏంపని?‘‘చాల్లే ఊరుకో. నీకు అంతా వేళాకోళంగా ఉంది. అప్పిచ్చి రాత్రింబవళ్లు నిద్ర పట్టక మేము ఛస్తున్నాం’’ అన్నాడు ఆ గుంపులో బక్కపలచటి వ్యక్తి.‘‘అయితే బాదంలో తినండి. బాగా నిద్రపడుతుంది. చెంచయ్యా... ముందు ఆ బాదం ప్లేట్లు అవి పట్రా’’ అని అరిచాడు భజగోవిందం. ఈ అరుపులోనూ వేళాకోళం ధ్వనించింది. ‘‘చాల్లేవయ్యా, రామదాసుగారిని పిలువు’’ అంటూ భజగోవిందం మీద భగ్గుమన్నాడు ఒకడు.ఈలోపు రామదాసుగారు రానే వచ్చారు. అప్పటి వరకు బెంగాల్ టైగర్‌గా కనిపించిన అప్పుల వాళ్లు ఏదో మంత్రం వేసినట్లు మ్యావ్గా మారిపోయారు. (ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడకపోయినా అప్పు ఇచ్చిన వారికి భయపడాలని, గజగజవణుకుతూ వారిని గౌరవంగా పలకరించాలని పెద్దలు ఎన్నడో చెప్పారు) ‘‘ఎందుకొచ్చారు?’’ దబాయిస్తున్నట్లుగా అడిగాడు రామదాసు. ‘‘మీకు అప్పు ఇచ్చాం కదండి. మా డబ్బు మాకు ఇవ్వండి. తిరగలేక ఛస్తున్నాం’’ అనాలి లెక్క ప్రకారం. అలా ఏం అనలేదు. ఇలా మాత్రం అన్నారు... ‘‘ఏ... ఏమీ లేదండి. తమకు రావుబహుదూర్ బిరుదు వచ్చిందని తెలిసి చూసిపోదామని వచ్చాం’’ ‘‘ఓహో...చూశారుగా. ఇక దయచేయండి’’ అని వెక్కిరించినంత పని చేశాడు రామదాసు. ‘‘అంతేనంటారా!’’ అని నీళ్లు నములుతూనే ‘‘మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?’’ అడిగారు అప్పులవాళ్లు. ‘‘ఎందుకు రావడం?’’ అన్నాడు రామదాసు.\ ‘‘పాత బాకీ కోసం అండీ’’ సూటిగా పాయింట్లోకి వచ్చారు అప్పులవాళ్లు. ‘‘ఇస్తాను లేవయ్యా బోడి పదివేలు. లక్షలు లక్షలిచ్చిన వాళ్లే నోరెత్తడం లేదు’’ అరిచినంత పనిచేశాడు రామదాసు.\ ‘‘నువ్వు మాత్రం తగులుకున్నావు చెవి కింద జోరీగలాగా’’ అని బాసుకు వంత పాడాడు భజగోవిందం. ‘‘ఆయన్ని అడుగుతుంటే మధ్యన మీకెందుకండి’’ భజగోవిందాన్ని కొరకొరా చూశాడు అప్పాయన. ‘‘అడగడానికి వేళాపాళా ఉండనక్కర్లేదూ’’ అంటూనే ‘రణ...దీప్’ అని కేకేశాడు. రణ... దీప్ అనే సౌండ్ వినగానే వాళ్లు భయపడిపోయారు. ఎందుకంటే ఈయన రామదాసు బాడీగార్డ్. అంత్తెత్తున ఉంటాడు. అందుకే.... ‘‘మేం వెళతాం లెండి... వెళతాం లెండి’’ అని ఎక్కడి వాళ్లు అక్కడ జారుకున్నారు. అద్దం ముందు మేకప్ చేసుకుంటున్న భజగోవిందానికి ఏదో అలికిడై చూసీచూడనట్లు వెనక్కి తిరిగాడు. అమ్మో...అప్పుల వాళ్లు! వాళ్లు వస్తున్నారని గ్రహించి రాని ఫోన్‌ను చెవిలో పెట్టుకొని ‘హలో హలో’ అంటున్నాడు. అప్పుడే అప్పులవాళ్ల గుంపు వచ్చింది. ‘ఎందుకయ్యా అందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు?’’ అసహనంగా అన్నాడు భజగోవిందం. ఆయన మధ్య వాళ్ల మధ్య మాటలు ఊపందుకోబోతున్న సమయంలో సీన్లోకి రామదాసు వచ్చాడు. ‘‘ఎవరోయి వీళ్లంతా భజగోవిందం?’’ అని ఆరాతీశాడు. ‘‘వీళ్లంతా నా బాకీ వాళ్లండి. పప్పులు ఉప్పులు... అంతా చిల్లరగ్రహాలండి’’ వినయంగా చెప్పాడు భజగోవిందం. ‘‘సరే, రేపు ఇస్తాడు పోండి’’ అని అప్పులవాళ్లను గద్దించాడు రామదాసు. ‘‘వెళ్లమంటున్నారుగా. వెళ్లండి’’ భజగోవిందం కూడా బాసుకు మద్దతుగా గద్దించాడు. ‘‘అయితే భజగోవిందం నువ్వూ అప్పులు చేస్తావన్నమాట’’ ఆశ్చర్యంగా అన్నాడు రామదాసు. ‘‘అబ్బే! నేను చేయలేదండి. అప్పు చేస్తే దొరుకుతుందా? మన పరపతినిబట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమస్తాననేసరికి మన పరపతి పెరిగింది.వాళ్లు నా వెంట పడ్డారు. వద్దనడం ఎందుకు? ఖాతాలు పెట్టాను. ఇక చూస్కోండి. మా మామ అందులోనే, మరదలు అందులోనే, చెంచయ్య అందులోనే, నాటకం వాళ్లు, వాళ్ల బంధుమిత్ర సమేతంగా అందరూ అందులోనే వాడేవారంతా’’ ‘‘సరి సరి. ఇంకా నువ్వు అప్పు చేయడంలో కొత్త బిచ్చగానిలా కనబడుతున్నావు. నే చెప్తాను ఆ కిటుకు. నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా ఫర్వాలేదు. కానీ అప్పుల వాళ్లు ఎక్కువమంది ఉండకూడదు. ఒక్కడ్నే అడిగావనుకో అందరూ వెంటబడతారు. ఇక ముందు నీకు వెయ్యి రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకోవద్దు. పదిమంది దగ్గర పది వందలుగా మాత్రమే తీసుకో’’ అని లెక్చర్ దంచాడు రామదాసు. ‘‘ఆహా... అప్పు చెసేవాళ్లకు ఇది పంచాక్షరి మంత్రమండి. మీరు నాకో వెయ్యిరూపాయలిస్తే తొందరపెట్టేవాళ్లందరికీ ఇచ్చేస్తా’’ అని అట్టి పంచాక్షరి మంత్రాన్ని ఆయనపైనే ఎక్కుపెట్టాడు భజగోవిందం. ‘‘తొందరపడేవాళ్లేమిటోయ్ ఇంకో అయిదొందలైనా సరే అందరికీ సర్దెయ్. ఇప్పుడు మనకు కూడా చిల్లరబాకీలు తీర్చడానికి రెండు లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు’’ అంటూ భజగోవిందం ప్రయోగించిన బాణాన్ని నేలకూల్చాడు రామదాసు. ‘‘రెండు లక్షలా? ఎక్కడ చూడనండి! ఇప్పుడు బజారులో మనకేం పరపతిలేదు’’ కుండబద్ధలు కొట్టాడు భజగోవిందం. ‘‘పరపతి ఉంటే నువ్వేందుకోయ్ ఏడ్వడానికి? వాళ్లే ఇంటికి తెచ్చిస్తారు. పో...పో... పొయ్యి కొత్తవాళ్లనెవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లా ఎప్పటికప్పుడు మనం కొత్తవాళ్లను పట్టాల్సిందే’’ అన్నాడు రామదాసు. ‘‘మరి వడ్డీ సంగతి!’’ అని భజగోవిందం అమాయకంగా అడిగితే... ‘‘వడ్డీ ఎంతయితే ఏమిటి? ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు’’ అన్నాడు గడుసుగా రామదాసు. -
తండ్రి మనసు
ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు. కర్నాటక రాష్ట్రం, కల్బుర్గి జిల్లా, మక్తంపురాలో ఓ తండ్రి. పేరు బసవరాజ్, గవర్నమెంట్ ఆఫీస్‌లో క్లర్కు. కూతురు ధానేశ్వరి అంటే తండ్రికి పంచప్రాణాలు. మక్తంపురాలో ఉన్న హైస్కూల్లో చదువుతోంది. గత ఏడాది ఊహించని అనారోగ్యం ఆమెను ఉన్న పళంగా తీసుకుపోయింది. గుండె బద్దలయ్యేలా ఏడ్చినా పోయిన కూతురు రాదని తెలుసు. కానీ కన్నీళ్లకు ఆ సంగతి తెలియదు. బసవరాజ్ ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ కూతురు చదివిన స్కూలు బాట పట్టాడు. అదే స్కూలు ఆవరణ నిండా తన కూతురు వయసు పిల్లలు గుంపులు గుంపులుగా కనిపించారు. అంతమందిలో తన కూతురు లేదన్న బాధతో.. వాళ్లలో తన కూతుర్ని చూసుకున్నాడు. నెలలు గడుస్తున్నాయి. రోజూ సాయంత్రం ఓ గంట సేపు స్కూలు దగ్గరకొచ్చి.. గ్రౌండ్లో ఆడుతున్న, చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న అమ్మాయిలను చూస్తూ ఉండేవాడు. ధానేశ్వరి వాళ్లందరిలో కనిపించేదతడికి. ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు. ‘వారం రోజుల్లోగా ఫీజు కట్టాలని’ ప్యూను చెప్తున్నాడు. కట్టక పోతే స్కూలుకు రాకూడదని కూడా హెచ్చరిస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలకు వాళ్ల ఇంటి పరిస్థితి కళ్ల ముందు మెదిలింది. గవర్నమెంట్ స్కూల్లో ఫీజు నామమాత్రంగానే ఉంటుంది. ఆ కొద్దిపాటి ఫీజు కట్టడం కూడా కష్టమైన కుటుంబాల పిల్లలు వాళ్లంతా. అది చూసిన బసవరాజ్‌కు గుండె బరువెక్కింది. ధానేశ్వరే దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. దాంతో అతడు హెడ్మాస్టరు దగ్గరకు వెళ్లి ‘‘వాళ్లందరి ఫీజు నేనే కడతాను, ఈ ఒక్క ఏడాదికే కాదు, ఏటా కడతాను. ఈ స్కూల్లో చదువుతున్న ఏ ఆడపిల్లకూ ఫీజు కట్టలేని కారణంగా చదువు మానేయాల్సిన దయనీయమైన స్థితి రాకూడదు’’ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే హెడ్ మాస్టరు సంతోషంగా చూశాడు. వెంటనే... ‘ఇతడేదో ఎమోషన్లో అంటున్నాడు కానీ నిజంగా ఫీజు కడతాడా’ అనే సందేహం కూడా కలిగిందతడికి. ఈ సందేహాలేవీ అవసరం లేదని ఆ మరుసటి రోజే తెలిసింది. ఎందుకంటే... బసవరాజు పదివేల రూపాయలు స్కూలు అకౌంట్లో జమ చేసి, ‘ఫీజు కట్టలేని ఆడపిల్లలందరి ఫీజులూ కట్టేయండి. ఇలా ఏటా మీకు ధానేశ్వరి పేరుతో డబ్బు అందుతుంది’ అని చెప్పాడు. ‘‘ఆర్థిక కారణాలతో అర్ధంతరంగా చదువు మానేస్తున్న వాళ్లు ఈ స్కూలు నుంచి ఏటా చాలా మందే ఉంటున్నారు.బాగా చదివే పిల్లలు ఇలా బడి మానేస్తుంటే బాధనిపిస్తుంది. బసవరాజ్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది జీవితాలలో చదువుల వెలుగులు పూస్తాయి’’ అని టీచర్లందరూ సంతోషిస్తున్నారు. – మంజీర -
11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం
పాట్నా : ఐదో తరగతి విద్యార్థినిపై అరాచకానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని, అతనికి సహకరించిన గుమస్తాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పాట్నాకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక ఆ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతాను.. చంపేస్తాను అని బెదిరించాడు. ఇలా నెల రోజుల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ క్రమంలో సదరు బాలిక కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిని గర్భవతిగా నిర్ధారించారు. విస్తుపోయిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించగా సదరు ప్రిన్సిపాల్ హోం వర్క్ చెక్ చేసే నేపంతో బాలికను తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఇందుకు పాఠశాలలో పనిచేస్తోన్న కర్ల్క్ సాయం చేసేవాడని తేలింది. అంతేకాక ప్రిన్సిపాల్ ఫోన్లో బాలికకు సంబధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో పోలీసులు ప్రధానోపాధ్యాయున్ని, క్లర్క్‌ని అదుపులోకి తీసుకుని, స్కూల్‌ని సీజ్ చేశారు. కేవలం 1 - 5 వరకే ఉన్న ఈ పాఠశాలలో 90 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్లర్క్ ఔదార్యం.. 45 మంది జీవితాల్లో వెలుగు
బెంగళూరు : ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పద’ని నానుడి. కానీ నేటి కాలంలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పూట భోజనం పెట్టి కడుపు నింపే కన్నా జీవితాంతం కడుపు నింపుకునేందుకు కావాల్సిన ఉపాధిని చూపే, విద్యను దానం చేస్తే వారికి మాత్రమే కాక మరో పది మందికి కూడా సాయం చేసిన వారు అవుతారు. కానీ ఇందుకోసం ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కోట్ల కొద్ది సంపద ఉన్న వారు కూడా ఇలాంటి సాయం చేయడానికి ముందుకు రారు. కానీ కర్ణాటక కలబుర్గి పట్టణానికి చెందిన ఒక గుమస్తా ఇలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే జీతం కొంచమే అయినా దానితోనే 45 మంది పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. వివరాల ప్రకారం.. కలబుర్గి, మక్తాంపురాకు చెందిన బసవరాజ్ స్థానిక మండల్ పరిషత్ హై స్కూల్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. బసవరాజ్ కుమార్తె ధనేశ్వరి అనారోగ్య కారణాల వల్ల ఏడాది క్రితం మరణించింది. దాంతో కూతురు జ్ఞాపకార్థం ఓ 45 మంది ఆడపిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు బసవరాజ్. ఈ విషయం గురించి ఫాతిమా అనే విద్యార్ధి చెబుతూ ‘మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్లం. పాఠశాల ఫీజు చెల్లించడం మాకు చాలా కష్టం. కానీ బసవరాజ్ సార్ మా కష్టాన్ని తొలగించారు. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సార్ చేస్తున్న సాయం చూసి ఆయన కూతురు ఆత్మ ఎంతో సంతోషిస్తుంటుంది’ అని తెలిపారు. -
గుమస్తా నుంచి సీఎంగా
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్‌తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఓ గుమాస్తా దందాగిరి!
* గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్లో అధికారి హవా గుంటూరు (నెహ్రూనగర్) : నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్లో ఓ గుమాస్తా తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రతి పనికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే ఫైలు కదలనివ్వడని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లు వేయాలంటే రూ.500 దాకా, పీఆర్సీ బకాయిలు వేయాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు, సరెండర్ లీవ్‌లకు రూ.3 వేలు, కొత్తగా ఎస్సార్ ఓపెన్ చేయాలంటే ఒక రేటు, ఇక కారుణ్య నియమకాలకు ఒక రేటు చొప్పున వసూలు చేస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ఈకి ఫిర్యాదు చేయడంతో ఆయన సదరు గుమాస్తాను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ఎందుకు ఇలా వసూలు చేస్తున్నావని అడగడంతో తాను తీసుకుంటే వేలల్లో.. మీరు తీసుకుంటే లక్షల్లోనే కదా అనడంతో ఎస్ఈ సైతం నోరు మెదపలేదని తెలిసింది. అతనిని సెక్షన్ నుంచి మార్చాలని కమిషనర్‌కు ఎస్ఈ నోట్ పెట్టినట్లు సమాచారం. గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సదరు గుమాస్తా అటెండర్‌గా పనిచేసి జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ సంపాదించాడు. అయితే అతని పనితీరు నచ్చని కమిషనర్ తిరిగి అటెండర్‌గా డిమోట్ చేశారు. చివరికి కమిషనర్ బదిలీ కావడంతో కోర్టును ఆశ్రయించి తిరిగి ప్రమోషన్ సంపాదించాడు. కార్పొరేషన్లో సదరు గుమాస్తాకి అధికారులంటే లెక్కే లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ఎస్ఈ గోపాలకృష్ణారెడ్డిని వివరణ కొరగా సదరు గుమాస్తాపై వస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పారు. తన దగ్గరకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. తాను పిలిచినా రాలేదని తెలి పారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. -
పంతులమ్మ దొంగబుద్ధి
కడప రాజారెడ్డి వీధిలో నివసిస్తున్న శంకర్ స్థానిక ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని భార్య మంజుల రాయచోటి రోడ్డులోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. అదే పాఠశాలలో ట్రాఫిక్ కానిస్టేబుల్ భార్య కూడా ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. వీరిద్దరూ స్నేహంగా కూడా ఉండేవారు. రోజులాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ట్రాఫిక్ పాయింట్లో విధి నిర్వహణ కోసం వెళ్లారు. ఆయన భార్య, కుమార్తె పాఠశాలకు వెళ్లారు. స్నేహితురాలి బ్యాగులో తాళాలు కొట్టేసి... ట్రాఫిక్ కానిస్టేబుల్ భార్య వ్యానిటీ బ్యాగులోని ఇంటి తాళాలను శంకర్ భార్య మంజుల అత్యంత చాకచక్యంగా కొట్టేసింది. వాటిని భర్తకు అందజేసి చోరీకి పురమాయించింది. కానిస్టేబుల్ భార్య, కుమార్తె స్కూలుకు వచ్చేశారని మంజుల తన భర్తకు చెప్పడంతో అతను ఇదే అదనుగా భావించి కానిస్టేబుల్ ఇంటికి చోరీకి వెళ్లాడు. ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా ఇంటి తలుపులు తెరచి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు. లోపల సోదా చేయగా అతనికి ఏమీ దొరకలేదు. ఇదే విషయాన్ని తన భార్య మంజులకు ఫోన్ చేసి ‘నేను బాలాజీనగర్‌లో కానిస్టేబుల్ ఇంట్లో ఉన్నాను. వెంటనే రమ్మంటూ’ చెప్పాడు. పాఠశాలలో జరుగుతున్న బాలల దినోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉండి మంజుల వెంటనే రాలేకపోయింది. తన భార్య ఇంకా వస్తోందంటూ ఇంట్లోనే ఉండిపోయాడు. అంతలోనే కానిస్టేబుల్ తన ఇంటికి వచ్చారు. బయట చెప్పులుండగా, తాళం తెరచి ఉండడం చూసి అనుమానం వచ్చిన కానిస్టేబుల్ రెడ్ హ్యాండ్‌గా దొంగను పట్టుకున్నారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తాలూకా ఎస్ఐ మద్దిలేటి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలు.. కడప బాలాజీనగర్‌లోని రిలయన్స్ టవర్స్ వెనుకభాగం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నివాసం..ఆయన డ్యూటీకెళ్లగా..భార్య, కుమార్తె స్కూలుకు వెళ్లారు. ఇదే అదనుగా ఓ వ్యక్తి కానిస్టేబుల్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంచక్కా చోరీకి యత్నించాడు. ఆలోపే టిఫిన్ కోసమని వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటి తాళం తెరచి లోపల ఎవరో ఉండటాని గమనించి అవాక్కయ్యారు. తలుపులు తీయగానే కానిస్టేబుల్‌ను చూసిన దొంగ ఠారెత్తిపోయాడు. కటకటాలపాలయ్యాడు. - కడప అర్బన్ -
కట్టు కథ చెప్పి నోట్ల కట్టలు స్వాహా
కర్నూలు: అన్నం పెట్టిన యజమానికి నమ్మకద్రోహం చేయాలనుకున్నాడు ఓ గుమస్తా. కట్టుకథలు చెప్పి నోట్ల కట్టలు మాయమయ్యాయని పోలీసులను ఫి ర్యాదు చేసి తప్పించుకోవాలని ఉపాయం పన్ని ఎట్టకేలకు దొరికిపోయాడు. యజమానికి సంబంధించిన రూ.7 లక్షలు నగదు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన గుమాస్తాను, అతనికి సహకరించిన మరోకరిని రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. మహబూబ్ నగర్ జిల్లా ఐజ పట్టణానికి చెందిన వై.ఆనందరావు స్థానికంగా వెంకటరమణ రైస్‌మిల్ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర దావూద్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా గుమాస్తాగా పని చేస్తూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదిన కర్నూలులోని యాక్సిస్ బ్యాంకులో రూ.7 లక్షలు చెక్కులను ఇచ్చి డ్రా చేసుకొని రమ్మని పంపాడు. మధ్యాహ్నం 12.15 గంటలకు డబ్బులు డ్రా చేసుకుని ఆ మొత్తాన్ని స్వాహా చేసేందుకు పథకం రచించాడు. దావూద్‌కు చిన్న నాటి స్నేహితుడైన సాబిర్హుసేన్ను పిలిపించుకుని డబ్బు మొత్తం అతనికి అప్పగించి దాచిపెట్టమని పంపాడు. మూడు గంటల సమయంలో యజమానికి ఫోన్ చేసి తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి డబ్బులు తీసుకుపోయారని కట్టుకథ చెప్పాడు. అమరావతి హోటల్ దగ్గర ఆటో ఎక్కి బస్టాండ్‌కు బయల్దేరగా ఐదు రోడ్ల కూడలి దగ్గర మరో వ్యక్తి ఆటో ఎక్కి తనను కత్తితో పొడుస్తానని బెదిరించి మత్తుమందు వాసన చూపించాడని అపస్మారక స్థితిలో చెన్నమ్మ సర్కిల్ దగ్గర దింపేసి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారని రెండవ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై అనుమానం వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. అతని సెల్‌ఫోన్ ఆధారంగా కేసును రెండు రోజుల్లోనే ఛేదించారు. ఫిర్యాదిదారుడు దావూద్‌తో పాటు అతనికి సహకరించిన సాబిర్హుసేన్ను అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి చోరీ అయిన సొత్తును రెండు రోజుల్లోనే రికవరీ చేసినందుకు రెండవ పట్టణ సీఐ బాబు ప్రసాద్, ఎస్ఐ ఖాజావలి, కె.రామసుబ్బయ్య, ఏఎస్ఐ బాబున్సాహెబ్, కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, వినోద్‌కుమార్, అమర్నాథ్రెడ్డి, చెన్నయ్య, మధుసూధన్, నాగరాజులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ ఎస్.బాబురావు, పి.మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.