చిట్టగాంగ్‌ చిరుత | Chittagong has led the veterans | Sakshi
Sakshi News home page

చిట్టగాంగ్‌ చిరుత

Published Sun, Mar 10 2019 12:45 AM | Last Updated on Sun, Mar 10 2019 12:45 AM

Chittagong has led the veterans - Sakshi

చిట్టగాంగ్, సెప్టెంబర్‌ 23, 1932...రాత్రి 10. 45.‘భారతీయులకీ, కుక్కలకీ ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న పహార్తలీ యూరోపియన్‌ క్లబ్‌కు నిప్పు పెట్టారు కొందరు. లోపల ఉన్న బ్రిటిష్‌ అధికారులు ఎదురు కాల్పులు ఆరంభించారు. అందులో ఒక సిక్కు యువకుడు గాయపడ్డాడు. కానీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న పోటాషియం సైనేడ్‌ మింగి చనిపోయాడు. అలాంటి మాటలతో వేరే జాతీయులని అవమానించామని శ్వేతజాతి జాత్యహంకారం ఆనాడు చంకలు గుద్దుకునేది. కానీ అవే అణగారిన జాతిలో ఆత్మ గౌరవ స్పృహ కోసం పాంచజన్యం పూరించాయి. చిట్టగాంగ్‌లోని పహార్తలీ యూరోపియన్‌ క్లబ్‌ ఉదంతం ఇదే చెబుతుంది.  అలాంటి మాటలు రాసిన  పలకలు చాలా బ్రిటిష్‌  కార్యాలయాల మీద ఆనాడు వేలాడుతూ కనిపించేవి. మరీ ముఖ్యంగా వాళ్ల క్లబ్‌ల ముందు కనిపించేవి.  ఘనత వహించిన బ్రిటిష్‌ పాలనలో పాలితులకి దక్కిన గౌరవాలలో ఇదొకటి.  దక్షిణాఫ్రికాలో కూడా ప్రిటోరియా పాలనలో ఇలాంటి మర్యాదే భారతీయులకీ, బ్రిటిష్‌ జాతీయులు కాని వారికి ఇదే గౌరవం ఉండేది. ఈ గౌరవంలో నీచత్వం ఎలాంటిదో గాంధీజీ రుచి చూసినది అక్కడే. అయినా  ఈ గౌరవాన్ని కూడా ఆనందంగా భరించాలనుకున్నవారే భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు. కానీ కుక్కలనీ, భారతీయులనీ ఒకే విధంగా చూసే దురహంకారాన్ని భరించడానికి సిద్ధంగా లేమనీ ఇలాంటి కుసంస్కారానికి ఆయుధంతోనే సమాధానం ఇస్తామని నెత్తుటి ప్రతిజ్ఞలు చేసినవారు ఉన్నారు. కానీ వారి ధర్మాగ్రహాన్ని చరిత్ర పుటలు నిషేధించాయి. అలా నెత్తురు మీద ప్రమాణం చేసినవారు దేశమంతటా ఉన్నారు. వారంతా రకరకాల రహస్య సంస్థల వారు. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య భారతం, తెలుగు ప్రాంతాలలో అలాంటి తీవ్ర జాతీయవాదం కనిపిస్తుంది. బెంగాల్‌లో చిట్టగాంగ్‌ ఉద్యమకారుల త్యాగాలు కూడా అలాంటివే. కానీ బెంగాల్‌లో తప్ప చిట్టగాంగ్‌ వీరుల గురించి మిగిలిన భారతదేశంలో తక్కువ తెలుసు. సూర్యసేన్‌ (మాస్టర్‌ దా) నాయకత్వంలో జరిగిన చిట్టగాంగ్‌ సాయుధదాడికి బ్రిటిష్‌ ప్రభుత్వం గంగవెర్రులెత్తిపోయింది. ఇందుకు కారణం, చిట్టగాంగ్‌ అనే ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఉన్న ప్రాముఖ్యం. బ్రిటిష్‌ వలసగా ఉన్న భారత్‌ మీద శత్రుదేశాలు దాడి చేస్తే అది అక్కడ నుంచే ఆరంభమవుతుంది. అలాంటి చోట ఆయుధాగారం మీద విప్లవకారులు దాడి చేస్తే అది ఎలాంటి సంకేతాలను పంపుతుందోనని హడలెత్తిపోయింది నాటి ప్రభుత్వం. అందుకే వారి పట్ల మరీ అమానవీయంగా వ్యవహరించింది.

పహార్తలీ క్లబ్‌ను దగ్ధం చేసిన చిట్టగాంగ్‌ వీరులకు నాయకత్వం వహించిన ఆ పంజాబీ యువకుని గురించి....ఆ రాత్రి ఆ క్లబ్‌ మీద దాడి చేసిన బృందానికి నాయకత్వం వహించినవారు నిజానికి పంజాబీ కాదు. యువకుడు అంతకంటే కాదు. ఒక యువతి ఆ వేషం ధరించింది. ఆమె పేరు ప్రీతిలతా వాడ్డేదార్‌. ఆ దాడిలో ఆమెకు సహకరించిన కాళీశంకర్‌ డె, బీరేశ్వర్‌ రాయ్, ప్రఫుల్ల దాస్, శాంతి చక్రవర్తి, మహేంద్ర చౌధురి, పన్నా సేన్‌ .. అంతా రకరకాల వేషాలు ధరించారు. ప్రేమలతా వాడ్డేదార్‌ (మే 5, 1911–సెప్టెంబర్‌ 23, 1932) అవిభక్త బెంగాల్‌లో చిట్టగాంగ్‌కు చెందినది. పాటియా ఉప జిల్లా ధాల్‌ఘాట్‌లో జన్మించారు. వారి పూర్వీకుల ఇంటిపేరు దాస్‌గుప్తా. తరువాత ఆ కుటుంబానికి వాడ్డేదార్‌ అనేది బిరుదుగా స్థిరపడింది. ప్రీతిలత తల్లి ప్రతిభా మాయాదేవి, గృహిణి. తండ్రి జగబంధు వాడ్డేదార్‌. చిట్టగాంగ్‌ నగరపాలక సంస్థలో గుమాస్తా. వారి ఆరుగురు బిడ్డలలో ప్రీతిలత రెండో సంతానం. ఆమెకు రాణి అన్న ముద్దు పేరు కూడా ఉంది. తండ్రి పిల్లలందరికీ మంచి చదువు చెప్పించారు. చిట్టగాంగ్‌లోనే ఆనాడు ఎంతో పేరున్న డాక్టర్‌ ఖస్తగీర్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రీతిలత చదివింది. జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది అక్కడే. అక్కడ ఉష అనే ఉపా«ధ్యాయురాలు ఉండేవారు. ఆమెను పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉషాదా అని పిలుచుకునేవారు. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత గాథలను పిల్లలకు చేప్పేవారు. చిట్టగాంగ్‌ సాయుధ దాడిలో మరొక సభ్యురాలు కల్పనా దత్తా  (1913–1995) కూడా ఇదే పాఠశాలలో అదే తరగతిలో ఉండేవారు. ‘ఆ పాఠశాలలో చదువుకుంటున్న రోజులలో మా భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో మేం ఏనాడూ ఉహించలేదు. కానీ ఝాన్సీ రాణీ జీవిత ఘట్టాలు మాకు ఒక భావనను ఏర్పరిచాయి. అవి వింటూ ఉంటే కొన్ని సందర్భాలలో అసలు మాకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఉండేది’ అని కల్పన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ప్రీతికి కళలు, సాహిత్యం అంటే ఆసక్తి. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇచ్చే వేతనంతో ఆమె చదువు సాగింది.  

చిట్టగాంగ్‌లో చదువు పూర్తయిన తరువాత ఢాకాలోని ఈడెన్‌ కళాశాలలో ప్రీతి చేరారు. ఆమె జాతీయ భావాలు ఇంకొంచెం విస్తరించే అవకాశం అక్కడ వచ్చింది. అదే పాఠశాలలో చదువుతున్న  లీలా నాగ్‌ (రాయ్‌) (1900–1970) దీపాలీ సంఘ్‌ అనే రహస్య సంస్థ నడిచేది. అందులో ప్రీతి చేరారు. ఆపై బిఎ చదవడానికి కలకత్తాలోని బెథూన్‌ కళాశాలకు వెళ్లారు. అదే ఆమె జీవితంలో పెద్ద మలుపు. 1931లో చిట్టగాంగ్‌ ఉద్యమంలో పనిచేసిన వారు చిట్టగాంగ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ క్రేగ్‌ను తుదముట్టించాలని పథకం వేశారు. ఇందుకు రామకృష్ణ బిస్వాస్, కాళీపాద చక్రవర్తి అనే ఇద్దరిని నియమించారు. కానీ ఆ ఇద్దరు పొరపాటున చాంద్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ తరిణి ముఖర్జీని కాల్చి చంపారు. పైగా పోలీసులకు తరువాత పట్టుబడ్డారు. కాళీపాదకు ద్వీపాంతర శిక్ష వేసి అండమాన్‌ తరలించారు. బిస్వాస్‌కు ఉరిశిక్ష వేసి ఆలీపూర్‌ జైలుకు పంపారు. ఇది కలకత్తాలో ఉంది. తరువాత అతడిని చూసి రావడానికి ఉద్యమకారుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలోనే ఉద్యమకారులు కలకత్తాలో చదువుకుంటున్న ప్రీతిలతను ఆశ్రయించారు. ఆమె ఆలీపూర్‌ జైలుకు వెళ్లి సోదరినంటూ చెప్పి బిస్వాస్‌ను కలుసుకునేవారు. ఒకటి రెండుసార్లు కాదు నలభయ్‌ సార్లు. ఆయనతో జరిపిన సంభాషణలతో ప్రీతిలో ఒక ఉద్యమకారిణి నిర్మితమైంది.  ఆమె బిఏ మూడేళ్లు చదువు పూర్తయింది. కానీ కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పట్టా ఇవ్వకుండా నిలిపివేసింది. దీనితో ఆమెకు బ్రిటిష్‌ ప్రభుత్వం అసలు రూపం ఏదో ఇంకాస్త స్పష్టమైంది. తిరిగి చిట్టగాంగ్‌ వచ్చి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా చేరారు. కానీ ఆమె మనసంతా భారత స్వాతంత్య్రోద్యమంలో చేరాలని ఆరాటపడేది. ఆ సమయంలోనే సూర్యసేన్‌ ఆమెకు కబురు చేశారు. ప్రీతి జన్మించిన ధాల్‌ఘాట్‌ శిబిరంలోనే ఆమె జూన్‌ 13, 1932న మాస్టర్‌దాను కలుసుకుంది. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉండగా ఆయన కార్యకలాపాలకు ప్రభావితమైంది. ఇప్పుడు స్వయంగా ఆయనను కలుసుకుంది. వెంటనే ఉద్యమంలో ప్రవేశించింది. ఇందుకు మొదట కొందరు చిట్టగాంగ్‌ ఉద్యమకారులు వ్యతిరేకించారు. కానీ సూర్యసేన్‌ దృష్టి వేరు.మహిళలతో ఆయుధ సేకరణ సులభంగా చేయవచ్చు. అదే గ్రామంలో సావిత్రీదేవి అనే ఉద్యమ సానుభూతిపరురాలి ఇంటిలో ఉండగా పోలీసు దాడి జరిగింది. అది సావిత్రీదేవి భర్త చేయించిన పని.ఆయన ఒకప్పుడు ఉద్యమకారుడే. తరువాత మారిపోయాడు. సూర్యసేన్, ప్రీతిలత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.  చిట్టగాంగ్‌లోని రెండు ఆయుధాగారాలను, పహార్తలీ క్లబ్‌ను, ఇతర బ్రిటిష్‌ కార్యాలయాల మీద దాడి చేయాలని సూర్యసేన్‌ పెద్ద పథకం వేశారు. ఇదే చరిత్రలో చిట్టగాంగ్‌ దాడిగా నమోదైంది. నలభయ్‌ మంది సభ్యులను మూడు బృందాలుగా విభజించి, క్లబ్‌  మీద దాడి చేసే బృందానికి ప్రీతిని నాయకురాలిని చేశారు సేన్‌. నిజానికి ఈ పని కల్పనా దత్తాకు అప్పగించాలి. కానీ ఆమె అప్పటికి వారం ముందే అరెస్టయ్యారు. దీనితో ప్రీతికి అప్పగించారు. ఇందుకోసం ఆమెకు కోటోవాలీ సీసైడ్‌ అనేచోట ఆయుధ శిక్షణ ఇచ్చారు.
 
అనుకున్న ప్రకారం క్లబ్‌ మీద దాడి జరిగింది. సలీవాన్‌ ఇంటి పేరున్న ఒక బ్రిటిష్‌ మహిళ ఈ దాడిలో చనిపోయింది. నలుగురు పురుషులు, ఏడుగురు స్త్రీలు కూడా గాయపడ్డారు.  లోపల పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్‌ ప్రీతికి తగిలింది. ఆమె పారిపోతూ ఉండగా ఒక పోలీసు పట్టుకున్నాడు. అరెస్టును నివారించేందుకు నాయకులు ముందే ఆదేశించినట్టు పొటాషియం సైనేడ్‌ మింగి చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. శవపరీక్ష సమయంలో ఆమె చిట్టగాంగ్‌ ఉద్యమంలో పనిచేస్తున్నదని చెప్పడానికి అన్ని  ఆధారాలు దొరికాయి. కొన్ని కరపత్రాలు దొరికాయి. దాడికి సంబంధించిన మ్యాప్‌ దొరికింది. వాటì తో పాటు ఒక ఫొటో కూడా. అది ఆలీపూర్‌ కారాగారంలో, సోదరిగా పరిచయం చేసుకుని  తాను నలభయ్‌ పర్యాయాలు సమావేశమైన రామకృష్ణ బిస్వాస్‌ ఫొటో. తనలోని ఉద్యమకారిణికి ఆకృతి ఇచ్చిన బిస్వాస్‌ ఫొటో. ఆయనంటే ఆమెకు అంత ఆరాధన. బ్రిటిష్‌ జాతి నీచత్వం అక్కడ బయటపడింది. పైగా ప్రీతి కాల్పులలో తనకు తగిలిన తూటాకు ప్రాణాలు విడవలేదు. పొటాషియం సైనేడ్‌తోనే చనిపోయిందన్న సంగతి తెలిసింది. అందుకే కాబోలు రామకృష్ణ బిస్వాస్‌కు ప్రీతి ఉంపుడు గత్తె అని రాశారు. ప్రీతిలత పేరు మన చరిత్రలో  మరొక  కోణం నుంచి కూడా నమోదు కావలసి ఉంది. బ్రిటిష్‌ సామ్రాజ్యం మీద ఆయుధం ఎత్తిన తొలి బెంగాలీ యువతి ప్రీతిలత.   
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement