పాకిస్తాన్‌కు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్రం
దేశ విభజన చట్టంలోనూ స్పష్టంగా ఉంది
కానీ ఏటా ఆగస్టు 14నే స్వాతంత్య్ర వేడుకలు
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం.
కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం...
భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు.
ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు.
పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.
ఆగస్టు 14న ఏం జరిగిందంటే...
1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని.
పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్‌గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.
ముందుకు జరుపుకోవడం వెనక...
విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట!
దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment