...అలా పంచుకున్నారు! | 1947 Partition of India and Pakistan | Sakshi
Sakshi News home page

...అలా పంచుకున్నారు!

Published Wed, Aug 14 2024 4:28 AM | Last Updated on Wed, Aug 14 2024 7:10 AM

1947 Partition of India and Pakistan

యజ్ఞాన్ని తలపించిన భారత్, పాక్‌ విభజన

మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు

1947 ది  అదర్‌ సైడ్‌

ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు

80:20 నిష్పత్తిలో ఫర్నిచర్, స్టేషనరీ

బల్బులూ, జంతువులూ పంచుకున్నారు 

టాస్‌లో భారత్‌ పరమైన వైస్రాయ్‌ బగ్గీ 

1947. బ్రిటిష్‌ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్‌ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్‌...  

ముందుగానే కమిటీ 
విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్‌ 16న ‘పంజాబ్‌ పారి్టషన్‌ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్‌ కౌన్సిల్‌)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్‌ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్‌ తరఫున కాంగ్రెస్‌ నేతలు సర్దార్‌ వల్లబ్‌బాయ్‌ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్‌; పాక్‌ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్‌ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్‌ అలీ ఖాన్‌ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! 

హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! 
దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్‌ న్యాయవాది సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్‌ ఇండియా మ్యాప్‌ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్‌క్లిఫ్‌ రేఖగా పిలుస్తారు. 

ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్‌...
కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు, ఒక వంతు పాక్‌కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్‌కు దక్కాయి. పాక్‌కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్‌ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్‌ సైనికాధికారుల్లో జనరల్‌ సర్‌ రాబర్ట్‌ లాక్‌హార్ట్‌ భారత్‌కు, జనరల్‌ సర్‌ ఫ్రాంక్‌ మెసెర్వీ పాక్‌కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!

...బగ్గీ భారత్‌కే! 
భారత్, పాక్‌ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్‌ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్‌ వేశారు! అందులో భారత్‌ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!

80:20 నిష్పత్తిలో చరాస్తులు 
ఆఫీస్‌ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్‌ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు!  

ఆస్తులు, అప్పులు 
ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్‌ భీషి్మంచుకుంది. అందుకు పటేల్‌ ససేమిరా అన్నారు. కశీ్మర్‌ పూర్తిగా భారత్‌కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్‌ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్‌పై పాక్‌ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.

ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! 
అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ  తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్‌ బాకీ ఉందని భారత్‌ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్‌ వాదన!

జోయ్‌మొనీ, ద ఎలిఫెంట్‌! 
జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్‌మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్‌కు (తూర్పు బెంగాల్‌కు, అంటే నేటి బంగ్లాదేశ్‌కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్‌కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్‌మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్‌ (పశి్చమబెంగాల్‌) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్‌కే మిగిలిపోయింది.

కొసమెరుపు
భారత్, పాక్‌ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement