partition of India
-
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
...అలా పంచుకున్నారు!
1947. బ్రిటిష్ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్... ముందుగానే కమిటీ విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్ 16న ‘పంజాబ్ పారి్టషన్ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్ కౌన్సిల్)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్ తరఫున కాంగ్రెస్ నేతలు సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్; పాక్ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్ ఇండియా మ్యాప్‌ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్‌క్లిఫ్ రేఖగా పిలుస్తారు. ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్...కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు, ఒక వంతు పాక్‌కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్‌కు దక్కాయి. పాక్‌కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్ సైనికాధికారుల్లో జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్ భారత్‌కు, జనరల్ సర్ ఫ్రాంక్ మెసెర్వీ పాక్‌కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!...బగ్గీ భారత్‌కే! భారత్, పాక్ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్ వేశారు! అందులో భారత్ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!80:20 నిష్పత్తిలో చరాస్తులు ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు! ఆస్తులు, అప్పులు ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్ భీషి్మంచుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నారు. కశీ్మర్ పూర్తిగా భారత్‌కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్‌పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్ బాకీ ఉందని భారత్ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్ వాదన!జోయ్‌మొనీ, ద ఎలిఫెంట్! జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్‌మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్‌కు (తూర్పు బెంగాల్‌కు, అంటే నేటి బంగ్లాదేశ్‌కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్‌కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్‌మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్ (పశి్చమబెంగాల్) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్‌కే మిగిలిపోయింది.కొసమెరుపుభారత్, పాక్ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
దేశ విభజనను పాక్ ప్రజలూ తప్పుబడుతున్నారు
భోపాల్: పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ విభజన తప్పని పాకిస్తాన్ ప్రజలంతా అంటున్నారన్నారు. అఖండ భారత్ వాస్తవం కాగా విభజిత భారత్ ఒక పీడకల అని అభివర్ణించారు. భారతదేశ విభజన తప్పనే విషయాన్ని, స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల అనంతరం ఇప్పుడు వారు నమ్ముతున్నారని భగవత్ వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రానికి ముందు భారత్ నుంచి తెగదెంపులు చేసుకుని అహంకారపూరితంగా వెళ్లిన వారింకా సంతోషంగా ఉన్నారా? లేదు, బాధలు పడుతున్నారు’ అంటూ పాకిస్తానీయులనుద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలపై ఆయన.. ‘పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఇతరులపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చే సంస్కృతి భారత్‌లో లేదు. ఆత్మరక్షణ కోసం దాడులకు తగిన బుద్ధి చెప్పాలనేదే భారత్ సంస్కృతి. దీనినే ఆచరిస్తాం. ఇదే కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర యోధుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని సింధీలు భోపాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. -
దేశ విభజనతో విడిపోయిన కుటుంబాన్ని.. 75 ఏళ్లకు ఫేస్బుక్ ఒక్కటి చేసింది..!
లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్‌పూర్ సాహిబ్ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది. హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్‌ను తన వెంట పాకిస్తాన్‌కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్‌గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్‌పూర్ కారిడార్‌తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్‌పూర్ కారిడార్‌లో కలుసుకున్న విషయం తెలిసిందే. -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
మహోజ్వల భారతి: విభజనకు ఏఐసీసీ ఓకే చెప్పిన రోజు
భారతదేశానికి ఆగస్టు 15 ఎంత ప్రధానమైనదో, జూన్ 15 కూడా అదే విధంగా గుర్తుంచుకోదగ్గది. ఇండియాను విభజించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించిన రోజు ఇది. విభజన వాదంతో భారత్ రక్తమోడుతున్న క్షణాలలో 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు. చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!! దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్ లండన్ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే! మే 31న మౌంట్‌బాటన్ భారత్ తిరిగి వచ్చాడు. మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఇది తక్కువ ప్రమాదకరమైన ఆలోచన అన్నారు నెహ్రూ. 1947 జూన్ 2న వైస్రాయ్ హౌస్ (నేటి రాష్ట్రపతి భవన్)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా విభజనకు జిన్నా సైతం అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్లో ఉండాలని ఆయన కోరిక. మొత్తం తొమ్మిది మంది విభజన ప్రణాళిక /మౌంట్‌బాటన్ పథకానికి ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన బదలీ గురించి జూన్ 3 న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. జూన్ 15 న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది. ఆ సమయంలో అక్కడ గాంధీజీ లేరు. మౌట్ బాటన్ అభీష్టం మేరకు భారతీయ నేతలు గాంధీజీని సమావేశానికి ఆహ్వానించ లేదు. -
దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే
ఖేడా (గుజరాత్): అత్యుత్సాహంతో ఉన్న కొందరు బీజేపీ నేతలు దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాలను మారుస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆదివారం తిప్పికొట్టారు. కేవలం నెహ్రూ -గాంధీ కుటుంబాన్ని మాత్రమే స్తుతిస్తూ.. జాతీయ హీరోలను (నాయకులను) కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని, దేశ చరిత్రను మార్చడమే కాకుండా విభజనతో భౌగోళిక స్వరూపాన్నీ మారుస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఓ ముస్లిం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోడీ ఈ మేరకు మాట్లాడారు. ‘ప్రధానమంత్రి గారూ.. మీ చేతుల్లో ఏమీ లేదని నాకు తెలుసు. కానీ దేశ స్వరూపాన్ని మార్చిందెవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు పుట్టిన గ్రామం (పాకిస్థాన్‌లోని గాహ్) ఒకప్పుడు హిందూస్థాన్‌లో భాగం. నేడు కాదు. మరి ఎవరు భౌగోళిక రూపాన్ని మార్చారు? ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసిందెవరు?’ అంటూ మోడీ ప్రశ్నించారు. చైనా ఆక్రమణతో కూడా దేశ స్వరూపం కాంగ్రెస్ పాలనలోనే మారిపోయిందని, గుజరాత్లో సబర్మతి-దండి చరిత్రాత్మక రోడ్డునూ మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. నెహ్రూ, ఇందిర బతికుండగానే భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మాత్రం చనిపోయిన 41 ఏళ్ల తర్వాత, బీఆర్ అంబేద్కర్‌కు స్వాతంత్య్రం వచ్చిన 33 ఏళ్లకు ఇచ్చిందని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్రయం లాల్-బాల్-పాల్లను కాంగ్రెస్ విస్మరించిందని, సోమవారం (నేడు) అబుల్ కలాం ఆజాద్, జేబీ కృపలానీ 125వ జయంతికీ ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించడం లేదన్నారు. ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలపై ప్రధాని మాట్లాడి ఉంటే బాగుండేదని, కానీ ఆయన చరిత్ర, భౌగోళిక స్వరూపాల గురించి మాట్లాడటం విచారకరమన్నారు.