లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్‌పూర్ సాహిబ్‌ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది.
హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్‌ను తన వెంట పాకిస్తాన్‌కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్‌గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు.
ఎట్టకేలకు ఫేస్‌బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్‌పూర్ కారిడార్‌తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్‌ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్‌పూర్ కారిడార్‌లో కలుసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment