Kartarpur Corridor
-
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
దేశ విభజనతో విడిపోయిన కుటుంబాన్ని.. 75 ఏళ్లకు ఫేస్బుక్ ఒక్కటి చేసింది..!
లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్‌పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్‌పూర్ సాహిబ్ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది. హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్‌ను తన వెంట పాకిస్తాన్‌కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్‌గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్‌పూర్ కారిడార్‌తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్‌పూర్ కారిడార్‌లో కలుసుకున్న విషయం తెలిసిందే. -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్‌పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్‌పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న
లాహోర్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం కర్తార్‌పూర్ కారిడార్ గుండా వెళ్లి, పాకిస్తాన్ భూభాగంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్–పాకిస్తాన్ మధ్య నూతన స్నేహ అధ్యాయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్–పాక్ మధ్య పరస్పర ప్రేమను తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 74 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న అడ్డుగోడలకు గవాక్షాలు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచేందుకు చర్యలు తీసుకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ సీఈఓ ముహమ్మద్ లతీఫ్ జీరో పాయింట్ వద్ద సిద్ధూకు స్వాగతం పలికారు. ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అని, తనకు గొప్ప గౌరవం, ఎంతో ప్రేమ లభించిందని సిద్ధూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కర్తార్‌పూర్ కారిడార్ అధికారిని ఆలింగనం చేసుకొని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవియా ట్విట్టర్లో షేర్ చేశారు. సిద్ధూ గతంలోనూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకొని, పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి సన్నిహితుడైన సిద్ధూ పాకిస్తాన్ నేతలను పొగడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని మాలవియా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సిద్ధూ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్‌లోకి డ్రోన్లతో ఆయుధాలను, మాదక ద్రవ్యాలను, జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని అన్నారు. అలాంటి పాక్ ప్రధానిని పొగడడం సరైంది కాదని హితవు పలికారు. సిద్ధూ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి రాఘవ్ చద్ధా అన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పాకిస్తాన్ పట్ల ప్రేమను దాచుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న విమర్శలపై సిద్ధూ స్పందించారు. వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకోనివ్వండి అని బదులిచ్చారు. -
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్మెంట్ కమిటీ(డీఎస్‌జీఎంసీ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది మార్చి నెలలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ కారిడార్‌ను మూసివేశారు. అయితే తాజాగా దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తున్న సమయంలో మళ్లీ తిరిగి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు డీఎస్‌జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇక ఈ కారిడార్‌ను నవంబర్, 2019న గురునానాక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహామ్మరి కారణంగా గత ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ఈ కారిడార్ పార్రంభానికి ముందు భారత్‌లోని సిక్కు భక్తులు పంజాబ్‌లోని డేరాబాబా నానక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురుద్వారా కార్తాపూర్ సాహిబ్‌ను బైనాక్యులర్ల ద్వారా దర్శించుకునేవారు. అయితే ప్రస్తుతం బైనాక్యులర్లు సదుపాయం కూడా లేదని మంజింద్ సింగ్ తెలిపారు. సిక్కు మత వ్యవస్థాకులు గురు నానక్ దేవ్ ఆయన జీవితంలో చివరి18 ఏళ్లు పాకిస్తాన్ నారోవల్ జిల్లాలోని గురుద్వారాలో గడిపారు. ఈ కారిడార్ ద్వారా సిక్కు మత భక్తులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. -
29నుంచి తెరుచుకోనున్న కర్తార్‌పూర్ కారిడార్
ఇస్లామాబాద్: సిక్కు యాత్రికుల కోసం జూన్ 29 నుంచి కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ శనివారం భారత్‌కు తెలిపింది. మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కారిడార్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాలు తెరిచారు. మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జూన్ 29న కారిడార్‌ను తిరిగి తెరవడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు భారత్‌కు తెలియజేస్తున్నాం’ అంటూ ఖురేషి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం మార్చిలో కారిడార్ మూసివేసిన సంగతి తెలిసిందే. As places of worship open up across the world, Pakistan prepares to reopen the Kartarpur Sahib Corridor for all Sikh pilgrims, conveying to the Indian side our readiness to reopen the corridor on 29 June 2020, the occasion of the death anniversary of Maharaja Ranjeet Singh. — Shah Mahmood Qureshi (@SMQureshiPTI) June 27, 2020 అయితే దీనిపై పంజాబ్ ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పౌరులకు కూడా కర్తార్‌పూర్ సాహిబ్‌లోకి ప్రవేశం ఉన్నందున.. వారి ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భారతీయ యాత్రికులు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. -
కోవిడ్ కేసులు 107
న్యూఢిల్లీ: కోవిడ్ (కరోనా వైరస్) భారత్‌లో స్థానికంగానే వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 107కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల సరిహద్దుల్ని మూసివేసిన కేంద్రం తాజాగా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా మార్గం వెంబడి కూడా రాకపోకలపై నిషేధం విధించింది. ఆ మార్గం ద్వారా సిక్కు భక్తులు పాక్‌కు వెళ్లడానికి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీ–జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ బోగీని శుభ్రం చేస్తున్న కార్మికుడు స్థానికంగా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కరోనా వ్యాప్తి మన దేశంలో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే దశలోనే ఉంది. దీనిని రెండో దశ అంటారు. ఇక మూడో దశలో జన సమూహాలకు సోకి వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఆ దశ రాకుండానే కేంద్రం, అన్ని రాష్ట్రాలు కరోనాపై యుద్ధం ప్రకటించాయి. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో హెల్ట్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఇంకా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జన సందోహాలు గుమికూడకుండా పర్యవేక్షణ, కోవిడ్–19 సోకిందని అనుమానాలున్న వారిని విడిగా ఉంచడం, వైరస్ నుంచి వ్యక్తిగత రక్షణ కోసం మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచడం , సుశిక్షితులైన మానవ వనరులు, చురుగ్గా స్పందించే బృందాలను బలోపేతం చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. 80,50,000 ఎన్95 మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చామని, హెల్త్‌కేర్ వర్కర్స్‌కి అందిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో మరణించిన వ్యక్తికి కరోనా లేదు మహారాష్ట్రలో బుల్దానాలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 71 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకలేదని నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఆయన మరణించడానికి ముందు సేకరించిన నమూనాలను పరీక్షించి చూస్తే కరోనా సోకలేదని తేలింది. తొలుత ఆ వృద్ధుడు కరోనాతో మరణించాడన్న అనుమానాలు తలెత్తాయి. ఇరాన్, ఇటలీ నుంచి భారతీయులు వెనక్కి ఇరాన్ నుంచి మూడో విడత 236 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చారు. వారందరినీ జైసల్మీర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చైనా తర్వాత అత్యధికంగా కరోనా దాడి చేసిన ఇటలీ నుంచి 218 మంది భారతీయుల్ని ఆదివారం వెనక్కి తెచ్చారు. వారిలో 211 మంది విద్యార్థులే ఉన్నారు. వీరిని వాయవ్య ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో బ్రిటన్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అతడిని కొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో స్వదేశీ, విదేశీ టూర్లపై కూడా ముంబై సీపీ నిషేధం విధించారు. తాజాగా తమిళనాడు, అస్సాం, ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు, షాపింగ్ మాల్స్ రెండు వారాల పాటు బంద్ చేశారు. -
మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్
-
మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవానికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత్ నుంచి బయల్దేరిని యాత్రికుల బృందం కోసం కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అక్కడి నాయకులు ఎదురు చూశారు. ఈ సందర్బంగా ‘మన సిద్దూ ఎక్కడా’అంటూ ఇమ్రాన్ ఆసక్తిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. సిద్దూను మన సిద్దూ అంటూ ఇమ్రాన్ సంబోధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. క్రికెటర్లైన ఇమ్రాన్, సిద్దూలు రాజకీయ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో మాదిరిగానే రాజకీయల్లోకి వచ్చాక కూడా వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇక నిన్నటి కార్యక్రమంలో సిద్దూ పాక్ ప్రధానిపై ప్రశంసలు కురిపించాడు. కర్తార్‌పూర్ కారిడర్ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే పాక్ సెనేటర్ కూడా సిద్దూపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో సిద్దూకు మంచి సత్ససంబంధాలు ఉన్నాయని, సిద్దూ పాకిస్తాన్‌కు మంచి స్నేహితుడని తెలిపారు. అంతేకాకుండా సిద్దూ పాక్‌పై టెస్టు సెంచరీ సాధించలేదని గుర్తుచేస్తూ.. పాక్‌పై, ఇమ్రాన్‌పై అతడికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు. ఇక సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే 1989-90లో పాక్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సిద్దూ సభ్యుడు. అప్పుడు పాక్ జట్టుకు ఇమ్రాన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. అత్యధికంగా 97 పరుగులు చేశాడు. ఇక పాక్ సెనేటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తీర్పుకిది సరైన సమయం కాదు: పాక్
ఇస్లామాబాద్: ఓ వైపు కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో తాను బాధకు గురయ్యానని చెప్పారు. సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు సరి కాదని అన్నారు. సిక్కుల మత గురువైన గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికొంత కాలం ఆగి తీర్పు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని అన్నారు. పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ అసిస్టెంట్ ఫిర్దౌస్ ఆషిఖ్ అవాన్ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు. ఓ వైపు పాక్ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. -
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
డేరాబాబా నానక్ (గురుదాస్‌పూర్)/ కర్తార్‌పూర్ (పాకిస్తాన్): పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం నాకు లభించిన వరం. ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా’అని తెలిపారు. నానక్ జీవితం సిక్కులకు మాత్రమే కాదు మానవాళికే స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కర్తార్‌పూర్‌లో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుమారు 12 వేల మంది సిక్కు యాత్రికుల సమక్షంలో కారిడార్ ప్రారంభించారు. భారత్ నుంచి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు కుశల ప్రశ్నలు అడిగారు. -
ఒకరి గెలుపు... మరొకరి ఓటమి కానేకాదు!
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగా... మరొకరి పరాజయంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారాయన. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు. న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. ఈ రోజు భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పునిచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. డ్రోన్లతో నిఘా.. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు శాఖ అప్రమత్తమయింది. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పౌరులు శాంతి, సామరస్యపూర్వకంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యకలాపాలను కూడా గమనిస్తామని, వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా వివేకంతో వాడాలని, ఎవరూ ఎటువంటి అసత్యాలు గానీ, విద్వేషపూరిత ప్రచారం గానీ చేయవద్దని సూచించారు. ► యావద్భారత విజయం అయోధ్యపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన విజయం. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలి. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకొనేందుకు కృషి చేయాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ► సంయమనం పాటించాలి సాక్షి, అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాతే తుది తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► ఈ తీర్పు ఓ మైలురాయి అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతి స్తున్నాం. ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును అన్ని వర్గాలు, మతాలు ప్రశాంత చిత్తంతో అంగీకరించాలి. ఒకే భారతదేశం– ప్రశస్త భారతదేశం నినాదానికి కట్టుబడి ఉండాలి. శ్రీరామ జన్మభూమి కోసం పోరాడిన సంస్థలకు, సాధు సమాజానికి, అసంఖ్యాక ప్రజలకు కృతజ్ఞతలు. హోంమంత్రి అమిత్ షా ► రాముడు అయోధ్యలో పుట్టాడని రుజువైంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడన్నది నిర్వివా దాంశం. సుప్రీంకోర్టు తీర్పుతో అదే విషయం మరోసారి రుజువైంది. కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ ఆలయం మాదిరిగా అయోధ్యలో రామాలయం విశాలంగా ఉండాలి. శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతావనికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ► అంతిమ విజయం ఈ తీర్పును ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సరైన ముగింపు పలికింది. ఈ తీర్పు దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంది. సత్యం, న్యాయం అంతిమంగా గెలుస్తాయని నిరూపించింది. విభేదాలను మరిచి రామాలయ నిర్మాణానికి పనిచేయాలి. అయోధ్యకు సంబంధించి చారిత్రక ఆధారాలున్నందునే ముందుండి పోరాడాం. మథుర, వారణాసిలోని ఆలయాలకు సంబంధించిన ఇలాంటి వివాదాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోబోదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ► ఇరు వర్గాలకు ఊరట అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ ముస్లిం వర్గాలకు ఊరట, సంతోషం కలిగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుంచి హిందువులు, ముస్లింలకు సంతృప్తి కలిగించింది’అని ట్విట్టర్లో తెలిపారు. మసీదు నిర్మాణంలో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు సాయం చేయడం ద్వారా ఐక్యతా భావం చూపాలి. అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో రవి శంకర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవి శంకర్ -
సిద్ధూ పాక్ మిత్రుడు.. అందుకే
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దూను పాక్ ముఖ్య అతిథిగా పిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్రాన్‌పై సిద్దూ ప్రశంసల జల్లు కురిపించాడు. కర్తార్‌పూర్ కారిడర్ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దూ గురించి పాకిస్తాన్ సెనేట్ ఫైజల్ జావెద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్ స్నేహితుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. కానీ పాకిస్తాన్‌పై మాత్రం సాధించలేదు. ఇంతకంటే ఏం రుజువు కావాలి.. పాకిస్తాన్‌పై ముఖ్యంగా ప్రధాని ఇమ్రాన్‌పై సిద్దూకు ఎంత ప్రేమ ఉందో తెలపడానికి’అంటూ ఫైజల్ వ్యాఖ్యానించాడు. ఇక 1989-90లో పాక్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సిద్దూ సభ్యుడు. ఆ పర్యటనలో పాక్ జట్టుకు ఇమ్రాన్ సారథ్యం వహించాడు. అయితే ఈ పర్యటనలో ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ సెంచరీ సాధించలేకపోయాడు. అత్యధికంగా 97 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే సిద్దూ పాక్‌పై సెంచరీ చేయలేదనే విషయాన్ని పాక్ సెనేటర్ గుర్తుచేశాడు. ప్రస్తుతం సిద్దూపై పాక్ సెనేటర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం ప్రారంభమైంది. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ కారిడర్‌ను ప్రారంభించారు. ఈ రోజు 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బృందం కర్తార్‌పూర్ వెళ్లింది. ఈ బృందంలో సిద్దూ కూడా సభ్యుడే. -
ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ ధన్యవాదాలు!
చండీగఢ్ : సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా శనివారం పంజాబ్‌లోని దేరా బాబా నానక్ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిక్కుల చిరకాల స్వప్నమైన కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వారా దర్శనానికి వీలు కల్పించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి పాకిస్తాన్ దర్బార్ సాహిబ్ గురుద్వారాకు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే కర్తార్‌పూర్ కారిడార్‌కు.. పంజాబ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను(ఐసీపీ) మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయుల మనోభావాలను గౌరవించి.. రెండు దేశాల మధ్య కర్తార్‌పూర్ కారిడార్‌ను అనుమతించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అదే విధంగా సిక్కు మతంలో కర్తార్‌పూర్‌కు ఉన్న ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ.. గురునానక్ ఇక్కడి నుంచే ' నిజాయితీగా పని చేయండి. దేవుణ్ణి స్మరించండి. పంచండి' అనే సందేశమిచ్చారనే విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఐక్యత, సామాజిక సామరస్యం, సోదర భావం దిశగా గురు నానక్ చేసిన బోధనలు ఒక్క సిక్కు వర్గానికి మాత్రమే పరిమితం కాదని.. సమస్త మానవాళికి హితోపదేశమని పేర్కొన్నారు. -
గురుద్వారలో ప్రధాని ప్రార్ధనలు
చండీగఢ్ : పంజాబ్‌లోని సుల్తాన్పూర్ లోథిలో బెర్ సాహిబ్ గురుద్వారలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం సందర్భంగా ప్రధాని గురుద్వారను సందర్శించారు. గురుదాస్‌పూర్‌లో డేరాబాబా నానక్ వద్ద కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.పాకిస్తాన్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు. -
నేడే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కానుంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న డేరాబాబా నానక్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో యాత్రికులకు ఆధునిక వసతులు కల్పించారు. పూర్తి ఎయిర్ కండిషన్‌తో కూడిన ఈ భవనంలో రోజుకు 5వేల మంది యాత్రికులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు వీలుగా 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గురునానక్ తన చివరి 14 ఏళ్లు గడిపిన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలిపే 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా ప్రతి రోజు 5వేల మంది భారత్ యాత్రికులు సందర్శించేందుకు వీలుంటుంది. మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు పంజాబ్‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కాగా, కర్తార్‌పూర్ వెళ్లే సీనియర్ల సిటిజన్లకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. డేరాబాబా నానక్, సుల్తాన్పూర్ లోథి గురుద్వారాల వద్ద గురునానక్ జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పూలతోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేస్తాం: పాక్ కారిడార్ ప్రారంభం కానున్న ఈనెల 9వ తేదీ, గురు నానక్ జయంతి రోజైన 12వ తేదీన తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఒక్కో యాత్రికుడి నుంచి సుమారు రూ.1,400 (20 డాలర్లు) వసూలు చేయనున్నట్లు పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. -
కారిడార్ కల సాకారం
సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సిక్కు మత సంస్థాపకుడు గురునానక్ 550వ జయంతి రోజైన శనివారం కర్తార్‌పూర్ కారిడార్ మొదలుకాబోతోంది. పంజాబ్‌లో ఉన్న దేరా బాబా నానక్ దేవాలయం నుంచి పాకిస్తాన్ గడ్డపై ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రీకులు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే ఈ కారిడార్ వల్ల ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి. శతాబ్దాలుగా కోట్లాదిమందికి మార్గనిర్దేశం చేస్తున్న సమున్నత సామాజిక, సాంస్కృ తిక ధారకు గురునానక్ ఆద్యుడు. సిక్కుల తొలి సమష్టి జీవన వ్యవస్థను ఆయన కర్తార్‌పూర్‌లోనే ప్రారంభించారు. తన చివరి రోజులు కూడా అక్కడే గడిపారు. అందువల్లనే అది సిక్కులకు అత్యంత పవిత్ర క్షేత్రం. దురదృష్టవశాత్తూ విభజన సమయంలో రావి నదికి అటువైపున్న కర్తార్‌పూర్ ప్రాంతం పాకిస్తాన్ పరిధిలోనికి వెళ్లింది. భారత్–పాక్ సరిహద్దునుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బార్ సాహిబ్... పంజాబ్‌లోని దేరా బాబా నానక్ దేవాలయం సమీపం నుంచి బైనాక్యులర్స్‌తో చూస్తే స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ పవిత్ర క్షేత్రాన్ని స్వయంగా వెళ్లి, సందర్శించుకోలేనివారి కోసం అక్కడ ఎత్తయిన వేదిక నిర్మించారు. గట్టిగా పావుగంట కూడా పట్టని ప్రయాణం కాస్తా ఇరు దేశాల మధ్యా నెలకొన్న సమస్యల కారణంగా భక్త జనానికి వ్యయప్రయాసలు మిగిలిస్తోంది. కర్తార్‌పూర్ వెళ్లదల్చుకున్నవారు ముందు లాహోర్ వరకూ వెళ్లాలి. అక్కడినుంచి కర్తార్‌పూర్ చేరుకోవాలి. ఇదంతా 125 కిలోమీటర్ల దూరం. ఇతర లాంఛనాలు సరేసరి. ఏమైతేనేం... ఇన్నాళ్లకు కర్తార్‌పూర్ కారిడార్ మొదలవుతోంది. ఇరు దేశాల మధ్యా ఇప్పుడున్న పొరపొచ్చాల నేపథ్యంలో ఇది లేవనెత్తే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తన గురించి చెప్పుకోవాలి. అక్కడ ప్రభుత్వం గొంతు ఒకలా, పాక్ సైన్యం వైఖరి మరొకలా కనబడుతూ మన ప్రభుత్వానికి, సిక్కు భక్త జనానికి అయోమయాన్ని కలిగించాయి. పంజాబ్ నుంచి వచ్చే సిక్కులకు ఎలాంటి పత్రాలు అవసరం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రక టించారు. కానీ పాక్ సైన్యం ఇక్కడికొచ్చేవారందరికీ భారతీయ పాస్‌పోర్టులు ఉండి తీరాలని చెప్పింది. ఈ నిబంధన పాటిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని మన దేశం భావిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ పాస్‌పోర్టుల ఆధారంగా డేటాబేస్ రూపొందిస్తుందని, దీన్ని పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నదని సందేహిస్తోంది. ఈ నిర్మాణం హడావుడిగా పూర్తి చేయడంపైనా అనుమానాలున్నాయి. కొన్ని నెలలక్రితం ఖలిస్తాన్ సంస్థలుగా చెప్పుకున్న కొన్ని 2020లో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాయి. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయంగా హోరెత్తించడం ఈ రిఫరెండం ఉద్దేశం. అది ఏదో మేర జరిగినట్టు అందరినీ నమ్మించాలంటే ఈ కారిడార్ ప్రారంభం అత్యవసరమని పాక్ సైన్యం భావిస్తున్నట్టు అనుమానాలున్నాయి. ఇవి కేవలం అనుమానాలే అని కొట్టిపారేయడానికి వీల్లేని రీతిలో పాకిస్తాన్ తీరుతెన్నులున్నాయి. కర్తార్‌పూర్ సందర్శనపై రూపొందించిన వీడియోలో ఉద్దేశపూర్వకంగా ఖలి స్తాన్ ఉద్యమ నాయకుడు భింద్రన్‌వాలే, మరో ఇద్దరు ఉన్న పోస్టర్ కనబడేలా పెట్టడం ఇందుకొక ఉదాహరణ. అంతేకాదు...దర్బారాసాహిబ్ గురుద్వారా వద్ద ఒక చిన్న స్తంభం నిర్మించి అందులో ఒక అద్దాల బాక్స్ అమర్చి, ఒక బాంబును ప్రదర్శనగా పెట్టారు. దానికింద ‘1971లో భారత సైన్యం ప్రయోగించిన బాంబు’ అంటూ ఒక వ్యాఖ్యానం ఉంచారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో ప్రయోగించిన బాంబు పక్కనున్న బావిలో పడటంతో పెను ముప్పు తప్పిందని, ఇది వాహేగురు జీ సంకల్పబలమని ఆ స్తంభానికి పక్కనున్న శిలాఫలకంపై రాశారు. క్షేత్ర సందర్శకుల్లో భారత్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడమే దీనంతటి ఉద్దేశమని వేరే చెప్పనవసరం లేదు. కర్తార్ పూర్లో సిక్కులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని మరో అసంబద్ధ నిబంధన విధించింది. నిజానికి గురునానక్‌ను అనుసరించేవారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. స్వర్ణదేవాలయంతో సహా సిక్కు గురుద్వారాలేవీ తమ మతస్తులను మాత్రమే అనుమతిస్తామన్న నిబంధన విధించవు. కేవలం శిరసుపై ఆచ్ఛాదన ఉంటే చాలు... ఏ మతాన్ని అవలంబించేవారికైనా గురుద్వారాల్లో ప్రవేశం ఉంటుంది. ఒకపక్క దర్బారా సాహిబ్‌ను సందర్శించుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించా మని చెప్పుకుంటూనే ఆ మత విశ్వాసాలకూ, దాని విశాల దృక్పథానికీ భిన్నంగా ఆంక్షలు విధిం చడం, ఆలయ ప్రాంగణంలో తప్పుడు ప్రచారానికి దిగడం పాక్ దురుద్దేశాలకు అద్దం పడుతోంది. మొత్తానికి కర్తార్‌పూర్ కారిడార్ సాకారం కావడం శుభసూచకమే అయినా మన నిఘా వ్యవ స్థలూ, సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పెంచింది. అసలు కర్తార్‌పూర్ సుల భంగా వెళ్లి రావడానికి ఇన్ని దశాబ్దాల సమయం పడుతుందని, రాకపోకలపై ఇన్ని ఆంక్షలుం టాయని విభజన సమయంలో ఎవరూ అనుకోలేదు. రావి నదికి ఆవలనున్న ఆ ప్రాంతానికి వంతెన దాటి వెళ్లేవారు. కానీ రాను రాను ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరిగి, చివరకు 1965 నాటి యుద్ధంలో ఆ వంతెన ధ్వంసం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు అక్కడి ప్రార్థనా మందిరం బాగోగుల్ని పాక్ ఎప్పుడూ పట్టించుకోలేదు. 1999లో అప్పటి ప్రధాని దివం గత వాజపేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగి ఢిల్లీ–లాహోర్ బస్సు ప్రారం భమైన సందర్భంగా ఈ కారిడార్ గురించి వాజపేయి ప్రతిపాదించారు. అటు తర్వాతే దర్బారా సాహిబ్‌పై పాక్ శ్రద్ధపెట్టింది. కారిడార్ నిర్మాణం పనులు నిరుడు నవంబర్లోనే ప్రారంభమ య్యాయి. ఈ కారిడార్ కొత్త సమస్యలకూ, ఘర్షణలకూ కారణం కానీయరాదని, స్నేహ సంబం ధాలు పెంపొందించుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని పాక్ గ్రహించడం అవసరం. -
ఖాన్ని కాదు.. సిక్కులను విశ్వసిద్దాం!
కర్తార్‌పూర్ కారిడార్ వెనుక ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉద్దేశాలు ఏమిటి అనే విషయంపై భారత్‌లో చాలా కలవరం ఉంటోంది. వీరు చెడ్డవారే కావచ్చు. కానీ కర్తార్‌పూర్ సాహిబ్ ద్వారా సిక్కుల్లో వేర్పాటువాదాన్ని పునరుద్ధరించాలనే తెలివైన ఎత్తుగడ వీరికి ఉండవచ్చు కానీ.. సిక్కులను సిక్కు మతేతరులనుంచి వేరు చేసే సంప్రదాయం కానీ, మతాచారం కానీ సిక్కు మతంలో లేదు. ఇక్కడే.. సిక్కులకు మాత్రమే కర్తార్‌పూర్ సాహిబ్ మందిర సందర్శనకు అనుమతిస్తున్నట్లు చేసిన ప్రకటన ద్వారా ఇమ్రాన్ ఎత్తుగడల రీత్యా విఫలమయ్యారు. పాక్ కుట్రలతో ఖలిస్తాన్ మళ్లీ ఆవిర్భవిస్తుందనుకోవడం అతి పెద్ద భ్రమ. సిక్కులను భారతీయులంగా మనం పాక్ నుంచి కాపాడాలనుకోవడం అహేతుకమే కాదు.. అది మూర్ఖ ఆలోచన కూడా. భారత్ పెళుసైన పింగాణీతో రూపొందలేదని గుర్తుంచుకోవాలి. క్రికెట్ ఆడుతున్నప్పుడు మినహా ఇమ్రాన్ ఖాన్ మీరు కలుసుకునే ఉజ్వలమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉండరు. భారత్ నుంచి సిక్కులకు మాత్రమే పాకిస్తాన్లో కర్తార్‌పూర్ సాహిబ్ మందిర సందర్శనకు వీసా లేకుండా రావడానికి అనుమతిస్తానని ఇమ్రాన్ చేసిన ప్రతిపాదన ఆసక్తికరమైనదే మరి. చర్చ మొదలెట్టాలంటే సిక్కు అని అతడు ఎలా నిర్వచిస్తారు? సిక్కు తత్వం అనేది ఒక సిద్ధాంతం కాదు, అలాగని ప్రత్యేకమైనదీ కాదు. ఏ మతవిశ్వాసాలు కలిగిన వారికైనా గురుద్వారాలో ఆహ్వానం పలుకుతారు. దానికి మీరు కొన్ని సులువైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. తలపాగా, చెప్పులు లేని పాదాలు వంటివి. తర్వాత మీరు గురుద్వారాలో ప్రార్థించవచ్చు. సిక్కు మతగురువు మిమ్మల్ని ఆదరించి పవిత్రగ్రంథం ముందు మీరు ఆశీస్సులు అందుకునేలా చేస్తారు. తర్వాత సిక్కు కమ్యూనిటీ మీకు భోజనశాలలో ఆహారం వడ్డిస్తుంది. ఏ మతస్తుడిపైనైనా నిషేధం విధించడానికి సిక్కు మతంలో కానీ, స్వర్ణదేవాలయంలో కానీ, అకల్ తఖ్త్ సాహిబ్‌లో కానీ తావు లేదు. కర్తార్‌పూర్ కారిడార్ వెనుక ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉద్దేశాలు ఏమిటి అనే విషయంపై భారత్‌లో చాలా కలవరం ఉంటోంది. మనం అనుమానిస్తున్నట్లుగా వీరు చాలా చెడ్డవారే కావచ్చు. కానీ భారతీయ సిక్కులను చెడగొట్టాలని, కర్తార్‌పూర్ సాహిబ్ ద్వారా సిక్కుల్లో వేర్పాటువాదాన్ని పునరుద్ధరించాలనే తెలివైన ఎత్తుగడ వీరికి ఉన్నప్పటికీ, సిక్కులకు మాత్రమే రాయితీలు అందించడంద్వారా ఇమ్రాన్ ఇలాంటి ఆపరేషన్ ని ధ్వసం చేసిపడేశారు. సమానత్వాన్ని, కలుపుకునే తత్వాన్ని బోధించే సిక్కు మత విశ్వాసం చులకనతో కూడిన కృత్రిమ ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కొట్టిపడేస్తుందనేది వాస్తవమే అయినప్పటికీ సిక్కు అంటే ఎవరో నిర్వచించడం ఇమ్రాన్ కి కూడా తెలీదు. పైగా గురునానక్‌ను ఆరాధించే ఏ ఇతర భక్తులకైనా, ఆయనతోపాటు తన తొమ్మిదిమంది వారసులు కనుగొన్న గొప్ప విశ్వాసం గురించి ఏం చెప్పాలో కూడా ఇమ్రాన్ కి తెలీదు. సిక్కులను సిక్కు మతేతరులనుంచి వేరు చేసే సాంప్రదాయం కానీ, మతాచారం కానీ సిక్కు మతంలో లేదు. సిక్కులు, హిందువుల మధ్య విభజన అంతిమంగా అనివార్యమని నమ్మిన పాకిస్తాన్ లోని పాత సైనిక వ్యవస్థ సమర్థకులను ఇమ్రాన్ అరువుతెచ్చుకున్నారు. ఈ కోణంలో పాక్ 1960 మధ్యలో, 1981–94 మధ్యలో చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు మూడో ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే సమయం వచ్చింది. అందుకే విదేశాల్లోని, ప్రత్యేకించి కెనడాలోని సిక్కు సంస్థలు కొన్ని పాకిస్తాన్ కు వలస పోయిన మిర్పూరి కశ్మీరీ బృందాలను కలుపుకుని 2020 రిఫరెండ్ అని చెబుతున్న కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అంటే పాత క్రీడాపుస్తకంలో మరొక అధ్యాయాన్ని తెరుస్తున్నారన్నమాట. గతంలో పాక్ ఈ వైపుగా చేసిన ప్రయత్నాలకు మల్లే ఈ కొత్త ప్రయత్నం కూడా వైఫల్యానికే దారితీస్తుంది. దీనివల్ల భారత్ కంటే పాకిస్తాన్ కే అపార నష్టం జరిగే ప్రమాదముంది. కాబట్టి భారత్‌లో మనం ఎలాంటి ఆదుర్దాలను ప్రదర్శించనవసరం లేదు కూడా. భారత్‌నుంచి సిక్కులను విడదీయడం అనేది 1950ల నాటి పాకిస్తాన్ కులీనవర్గాల భ్రమ. ఆ నాటి దేశ విభజన గాయాలు 1950లో కూడా మానకుండా పచ్చిగా ఉండటాన్ని పాక్ సైనికవర్గాలు తమకు అనుకూలంగా భావించాయి. సిక్కుల్ని హిందువుల నుంచి వేరుచేయగలమనే ఆశాభావంతో ఇలాంటి విభజన కార్యకలాపాలను 1960ల మధ్యనాటికి పాక్ పరాకాష్టకు తీసుకుపోయింది. పంజాబీ సుబా (ప్రత్యేక పంజాబీ రాష్ట్రం) ఉద్యమం తీవ్ర/వేర్పాటువాద ప్రేరణలతో నడిచింది. కానీ పంజాబ్ సీఎంగా ప్రతాప్ సింగ్ కైరాన్ ఉన్నప్పుడు, ఆయన హత్యకు గురైన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ఈ సవాలును నేర్పుతో ఎదుర్కొన్నారు. పంజాబ్‌ను మరోసారి వేరు చేశారు. హిందీ ప్రాబల్యం ఉన్న హరియాణా, హిమాచల్ ప్రదేశ్ అనేవి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇక పంజాబీ మాట్లాడే సిక్కులు మెజారిటీగా ఉండే నేటి పంజాబ్ కూడా ఆనాడే ఉనికిలోకి వచ్చింది. ఈ సమయంలోనే మరో ఆసక్తికరమైన పరిణామం జరి గింది. 1965 నాటి యుద్ధంలో తనకు పట్టుబడిన భారత సైనికుల్లో భారతీయ సిక్కు సైనికులను ప్రత్యేకించి సిక్కు అధికారులను పాక్ సైన్యం వేరుచేసి వారిలో విభజన బీజాలను నాటడానికి ప్రయత్నించింది. ఆ అధ్యాయం ముగియడంతో 1981లో రెండో అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈసారి ఆప్ఘన్ జిహాద్లతో కూడిన పాక్ సైనిక యంత్రాంగం దీనికి కర్త. భారత్‌లో అంతర్గతంగా సంభవించిన అనేక కారణాలు కూడా దీనికి తోడయ్యాయి. సిక్కులలో పునరుద్ధరణ భావాలు, బలహీన ప్రభుత్వాలు, సిరోమణి అకాలీదళ్ ప్రాధాన్యతను బాగా తగ్గించివేయడం వంటివి వీటిలో కొన్ని. తర్వాత సంత్ జరై్నల్ సింగ్ బింద్రన్ వాలే వంటి ప్రజాకర్షణ, పరిశుద్ధ నేత అవతరించాడు. తర్వాత ఏం జరిగిందే చరిత్రకెక్కింది. ఆ తర్వాత 13 ఏళ్ల కాలంలో వేలాదిమంది మరణించారు. ఇక పంజాబ్ తుది సమస్యగా కనిపించిన తరుణంలో ఆనాటి ఉద్యమం ముగిసిపోయింది. నాటి పరిణామాలను సన్నిహింతగా గమనిస్తున్న మనలాంటి వారికి అప్పట్లో ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇది ఎలా జరిగింది? అంటే భద్రతాబలగాలు, నిఘా సంస్థలు తమ పనిని చక్కగా నిర్వర్తించాయి. అయితే ఈ పోరాటం ఇక చాలు అని సిక్కులు తమకు తాను నిర్ణయించుకున్నప్పుడే సిక్కు టెర్రరిజం ముగింపుకొచ్చింది. ఆనాటి సమరంలో నిజమైన హీరో ఎవరంటే సిక్కు పంజాబ్ పోలీసులే. సిక్కు ప్రజాభిప్రాయం నాటకీయంగా మారిపోయింది. ఆరోజుల్లో పంజాబ్‌లోని విముక్తి ప్రాంతాలుగా చెప్పుకున్న చోట్ల సందర్శించిన నా తోటి జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం వేర్పాటు ఉద్యమం రాత్రికి రాత్రే ముగిసిపోయింది. నిజానికి దాని గురించి మాట్లాడుకునే వారే లేకుండా పోయారు. నాటి పంజాబ్ పోలీసు చీఫ్‌గా వేర్పాటు వ్యతిరేక కేంపెయిన్ ప్రారంభించిన కేపీఎస్ గిల్ పంజాబ్ వేర్పాటు ఉద్యమం ఎందుకు ఉన్నట్లుండి ముగిసిపోయిందన్న నా ప్రశ్నకు ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. పాకిస్తానీయులు మహ్మద్ ఇక్బాల్ సుప్రసిద్ధ గేయ పంక్తులను చదువుకోలేదని గిల్ చెప్పారు. పాకిస్తానీయులు ఆనాటీ పరిస్థితులను ఇప్పుడు మళ్లీ తీసుకొస్తామని భావించడం ఒక అద్భుతమైన చెత్త వ్యవహారం. అదేవిధంగా భారత్‌లో కొంతమంది కూడా పాకిస్తానీయులు మన సిక్కులను మననుంచి తీసుకుపోతారంటూ మతిహీన వాఖ్యలు చేస్తున్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ గోడలపై బింద్ర¯Œ వాలే చిత్రాలను వేలాడదీశారని, బింద్రన్ వాలే బొమ్మ ఉన్న కీ చెయిన్లను స్వర్ణదేవాలయం బయట షాపుల్లో అమ్ముతున్నారని, ఢిల్లీలోని కార్ల వెనుకాల కూడా ఇవి కనబడుతున్నాయని తెలిసినంతమాత్రాన భారతీయులు కలవరపడుతున్నారంటే ఒక జాతిగా మనపై మనకు నమ్మకం లేదని, సిక్కు సమాజంపై నమ్మకం లేదని చెప్పక తప్పదు. 2019లో కూడా సిక్కులు పాకిస్తానీయుల ఉచ్చులో పడతారని భావించడం అంటే మన నిఘా సంస్థలకు అవమానం. అలాగే దుష్ట పాకిస్తానీయుల నుంచి సిక్కులను భారతీయులంగా మనం కాపాడాలనుకోవడం అహేతుకమే కాదు.. అది మూర్ఖ ఆలోచన కూడా. భారతీయ సామాజిక, జాతీయ పొందిక గత కొన్నేళ్లుగా బలపడుతూ వచ్చిందని మనం చెప్పుకున్నాం. వైవిధ్యంలోనే ఐక్యత అని మన గణతంత్ర రాజ్య నిర్మాతలు తప్పు నినాదమిచ్చారని ఇవాళ కొందరు వాదించవచ్చు కానీ భిన్నత్వాన్ని ఇంకా విస్తృతపర్చమనే మన జాతి నిర్మాతలు చెప్పారు. దీన్ని మనం అంగీకరిస్తే తోటి భారతీయుడి జాతీయ నిబద్ధత గురించి మనం కలవరపడాల్సిన పని లేదు. అందుకే హానికరమైన భయాలను మర్చిపోయే సమయం ఆసన్నమైంది. భారత్ పెళుసైన పింగాణితో రూపొందలేదు. భారతీయ సిక్కులకు, సిక్కు మతేతర భారతీయులకు అతి పెద్ద పవిత్ర మంది రాలను ఇవ్వాళ నిర్మించి ఉన్నాం. ఇది మనం సామూహికంగా సంతోషించాల్సిన సమయం. ఖలిస్తాన్ పునరాగమనం అటూ గావుకేకలు వేస్తున్న టీవీ చానల్స్‌ను ఆపివేద్దాం. ఖలిస్తాన్ మళ్లీ ఆవిర్భవించదు. గోడలపై దెయ్యాన్ని చిత్రించవద్దు. ఇప్పటికీ ఖలిస్తాన్ గురించిన భయాలు మీలో ఉంటే గురునానక్‌పై ఆ గొప్ప సిక్కు ప్రార్థనా గీతాన్ని గుర్తుతెచ్చుకోండి. ‘నానక్... మీ దయతో, మీ ఔదార్యంతో సమస్త మానవజాతి సంతోషంగా గడుపుతుంది’. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ Twitter@ShekarGupta -
‘పాకిస్తాన్‌కు నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు’
చంఢీగడ్ : కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ పాల్గొంటారని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈసందర్భంగా సన్నీ డియోల్.. ‘నేను కాకపోతే.. ఇంకెవరు వెళ్తారు. నేను తప్పకుండా వెళ్తా’అని మీడియాతో అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సన్నీ అక్కడి గురుద్వారలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం గమనార్హం. కర్తార్‌పూర్ కారిడార్ శనివారం (నవబంర్ 9) ప్రారంభం కానుంది. (చదవండి : సిద్ధూకు పాక్ వీసా మంజూరు) ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్, కేంద్ర మంత్రులు హరదీప్ పూరి, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూకు విదేశీ వ్యవహారాలశాఖ అనుమతినిచ్చింది. భారత్ నుంచి 550 మంది సిక్కు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాయాది దేశానికి వెళ్తున్నారు. పాకిస్తాన్‌లోని రావి నది ఒడ్డున కర్తార్‌పూర్‌లోని గురుద్వార దర్బార్ సాహిబ్‌ను సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ అక్కడ 18 ఏళ్లపాటు గడిపారు. (చదవండి : ‘కర్తార్‌పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు) ప్రతియేడు పెద్ద సంఖ్యలో సిక్కులు కర్తార్‌పూర్ గురుద్వారను సందర్శిస్తారు. గురునానక్ దేవ్ దైవైక్యం పొందిన గురుదాస్‌పూర్ గురుద్వార.. గురుద్వార దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ నిర్మించిందే కర్తార్‌పూర్ కారిడార్. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి (నవంబర్ 12) వేడుకలను జరుపుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. -
‘కర్తార్‌పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కాడిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్‌పూర్ కారిడార్ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్‌పోర్ట్ తెచ్చుకోవాల్సిందేనని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్ అమలు చేయాలని కోరింది. కాగా, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూకు శనివారం జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది. -
సిద్ధూకు పాక్ వీసా మంజూరు
ఇస్లామాబాద్ : ఈనెల 9న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ సిద్ధూకు పాకిస్తాన్ హై కమిషన్ వీసా మంజూరు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం అనుమతి కోసం సిద్ధూ ఇంకా వేచిచూస్తున్నారు. వీసాతో వాఘా వద్ద సిద్ధూ సరిహద్దు దాటే అవకాశం ఉన్నా పంజాబ్ చట్ట సభ సభ్యుడిగా ఎన్నికైనందున పాక్ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. కర్తార్‌పూర్ ఈవెంట్లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సిద్ధూ ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖరాశారు. (చదవండి: కర్తార్‌పూర్ వీడియోలో ఖలిస్తాన్ నేతలు?) -
కర్తార్‌పూర్ వీడియోలో ఖలిస్తాన్ నేతలు?
లాహోర్: సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి వేడుకల సందర్భంగా పాకిస్థాన్ విడుదల చేసిన ఒక వీడియోలో ఖలిస్తాన్ నేతలు ఉండటం వివాదమైంది. ఆపరేషన్ బ్లూస్టార్ (1984)లో మరణించిన భింద్రన్‌వాలే, అతడి మిలటరీ సలహాదారు షాబేగ్ సింగ్‌లు ఉన్న వీడియోను పాకిస్థాన్ సోమవారం విడుదల చేసింది. ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న సిఖ్స్ ఫర్ జస్టిస్ బ్యానర్ ఈ వీడియోలో ఉండటం గమనార్హం. సరిహద్దు వెంట పంజాబ్‌లోని బాబా నానక్ గుడిని.. పాకిస్థాన్‌వైపు ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కలుపుతూ నిర్మించిన కర్తార్‌పూర్ కారిడార్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల వివాదమైంది. -
కర్తార్‌పూర్ యాత్రికులకు పాక్ శుభవార్త
ఇస్లామాబాద్ : సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు పాక్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొదటి రోజు ప్రవేశ రుసుమును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది. గతంలో సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా భారత్ నుంచి కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు అవసరమైన రెండు చర్యలు తీసుకున్నాం. కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే సరిపోతుందని, పాస్‌పోర్ట్ అవసరం లేదని, పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదని ట్వీట్ చేశారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి రుసుము వసూలు చేయమని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సిక్కులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ప్రతి ఏడాది సిక్కులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. నవంబర్ 9నుంచి కర్తార్‌పూర్ యాత్ర మొదలవనుంది. సిక్కుల గురువైన గురునానక్ దీనిని 1522 లో స్థాపించారు. చదవండి : కర్తార్‌పూర్ ద్వారా పాక్ ఆదాయం ఏడాదికి రూ.259కోట్లు -
వెనక్కి తగ్గని పాక్, ఏడాదికి రూ.259 కోట్లు ఆదాయం
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని డేరా బాబా నానక్ మందిరానికి, పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాకు మధ్య సిక్కు యాత్రికుల రాకపోకలకు సంబంధించి ప్రతిష్టాత్మక కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల మధ్య రాకపోకలకు సంబంధించి భారత్, పాక్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీసా అవసరం లేకుండా యాత్రికులు పాక్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లే అవకాశాన్ని ఈ కారిడార్ కల్పిస్తోంది. ప్రతిరోజు దాదాపు 5,000 మంది యాత్రికులను అనుమతించనున్నారు. అయితే ప్రతి యాత్రికుడి నుంచి పాక్ 20 డాలర్లు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ వెనక్కు తగ్గలేదు. దీంతో.. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విషయం అలా ఉంచితే.. సర్వీస్ చార్జీ వల్ల పాక్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి 259 కోట్ల రూపాయలు. దీనికి యాత్రికులు చేసే ఇతరత్రా ఖర్చులు కూడా తోడవనున్నాయి. ఇక్కడికి వెళ్లే యాత్రికులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా రూ. 11వేలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టల్ prakashpurb550.mha.gov.inను ఏర్పాటు చేశారు. ఇందులో తమకు కావాల్సిన రోజుల్లో టికెట్లను ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు సమాచారం ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పాకిస్థాన్‌కు ఈ రాబడి కొంతమేర రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిక్కు యాత్రికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ భారత్ - పాక్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి. చదవండి: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ