ఖాన్‌ని కాదు.. సిక్కులను విశ్వసిద్దాం! | Shekhar Gupta Article On Kartarpur Corridor Of Faith | Sakshi
Sakshi News home page

ఖాన్‌ని కాదు.. సిక్కులను విశ్వసిద్దాం!

Published Sat, Nov 9 2019 12:42 AM | Last Updated on Sat, Nov 9 2019 12:42 AM

Shekhar Gupta Article On Kartarpur Corridor Of Faith - Sakshi

కర్తార్‌పూర్‌ కారిడార్‌ వెనుక ఇమ్రాన్‌ ఖాన్, పాకిస్తాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ ఉద్దేశాలు ఏమిటి అనే విషయంపై భారత్‌లో చాలా కలవరం ఉంటోంది. వీరు చెడ్డవారే కావచ్చు. కానీ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ ద్వారా సిక్కుల్లో వేర్పాటువాదాన్ని పునరుద్ధరించాలనే తెలివైన ఎత్తుగడ వీరికి ఉండవచ్చు కానీ.. సిక్కులను సిక్కు మతేతరులనుంచి వేరు చేసే సంప్రదాయం కానీ, మతాచారం కానీ సిక్కు మతంలో లేదు. ఇక్కడే.. సిక్కులకు మాత్రమే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ మందిర సందర్శనకు అనుమతిస్తున్నట్లు చేసిన ప్రకటన ద్వారా ఇమ్రాన్‌ ఎత్తుగడల రీత్యా విఫలమయ్యారు. పాక్‌ కుట్రలతో ఖలిస్తాన్‌ మళ్లీ ఆవిర్భవిస్తుందనుకోవడం అతి పెద్ద భ్రమ. సిక్కులను భారతీయులంగా మనం పాక్‌ నుంచి కాపాడాలనుకోవడం అహేతుకమే కాదు.. అది మూర్ఖ ఆలోచన కూడా. భారత్‌ పెళుసైన పింగాణీతో రూపొందలేదని గుర్తుంచుకోవాలి.

క్రికెట్‌ ఆడుతున్నప్పుడు మినహా ఇమ్రాన్‌ ఖాన్‌ మీరు కలుసుకునే ఉజ్వలమైన వ్యక్తుల్లో ఒకరుగా ఉండరు. భారత్‌ నుంచి సిక్కులకు మాత్రమే పాకిస్తాన్‌లో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ మందిర సందర్శనకు వీసా లేకుండా రావడానికి అనుమతిస్తానని ఇమ్రాన్‌ చేసిన ప్రతిపాదన ఆసక్తికరమైనదే మరి. చర్చ మొదలెట్టాలంటే  సిక్కు అని అతడు ఎలా నిర్వచిస్తారు? సిక్కు తత్వం అనేది  ఒక సిద్ధాంతం కాదు, అలాగని ప్రత్యేకమైనదీ కాదు. ఏ మతవిశ్వాసాలు కలిగిన వారికైనా గురుద్వారాలో ఆహ్వానం పలుకుతారు. దానికి మీరు కొన్ని సులువైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. తలపాగా, చెప్పులు లేని పాదాలు వంటివి. తర్వాత మీరు గురుద్వారాలో ప్రార్థించవచ్చు. సిక్కు మతగురువు మిమ్మల్ని ఆదరించి పవిత్రగ్రంథం ముందు మీరు ఆశీస్సులు అందుకునేలా చేస్తారు. తర్వాత సిక్కు కమ్యూనిటీ మీకు భోజనశాలలో ఆహారం వడ్డిస్తుంది. ఏ మతస్తుడిపైనైనా నిషేధం విధించడానికి సిక్కు మతంలో కానీ, స్వర్ణదేవాలయంలో కానీ, అకల్‌ తఖ్త్‌ సాహిబ్‌లో కానీ తావు లేదు. 

కర్తార్‌పూర్‌ కారిడార్‌ వెనుక ఇమ్రాన్‌ ఖాన్, పాకిస్తాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ ఉద్దేశాలు ఏమిటి అనే విషయంపై భారత్‌లో చాలా కలవరం ఉంటోంది. మనం అనుమానిస్తున్నట్లుగా వీరు చాలా చెడ్డవారే కావచ్చు. కానీ భారతీయ సిక్కులను చెడగొట్టాలని, కర్తార్‌పూర్‌ సాహిబ్‌ ద్వారా సిక్కుల్లో వేర్పాటువాదాన్ని పునరుద్ధరించాలనే తెలివైన ఎత్తుగడ వీరికి ఉన్నప్పటికీ, సిక్కులకు మాత్రమే రాయితీలు అందించడంద్వారా ఇమ్రాన్‌ ఇలాంటి ఆపరేషన్‌ ని ధ్వసం చేసిపడేశారు. సమానత్వాన్ని, కలుపుకునే తత్వాన్ని బోధించే సిక్కు మత విశ్వాసం చులకనతో కూడిన కృత్రిమ ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కొట్టిపడేస్తుందనేది వాస్తవమే అయినప్పటికీ సిక్కు అంటే ఎవరో నిర్వచించడం ఇమ్రాన్‌ కి కూడా తెలీదు. పైగా గురునానక్‌ను ఆరాధించే ఏ ఇతర భక్తులకైనా, ఆయనతోపాటు తన తొమ్మిదిమంది వారసులు కనుగొన్న గొప్ప విశ్వాసం గురించి ఏం చెప్పాలో కూడా ఇమ్రాన్‌ కి తెలీదు. సిక్కులను సిక్కు మతేతరులనుంచి వేరు చేసే సాంప్రదాయం కానీ, మతాచారం కానీ సిక్కు మతంలో లేదు.

సిక్కులు, హిందువుల మధ్య విభజన అంతిమంగా అనివార్యమని నమ్మిన పాకిస్తాన్‌ లోని పాత సైనిక వ్యవస్థ సమర్థకులను ఇమ్రాన్‌ అరువుతెచ్చుకున్నారు. ఈ కోణంలో పాక్‌ 1960 మధ్యలో, 1981–94 మధ్యలో చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు మూడో ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే సమయం వచ్చింది.

అందుకే విదేశాల్లోని, ప్రత్యేకించి కెనడాలోని సిక్కు సంస్థలు కొన్ని పాకిస్తాన్‌ కు వలస పోయిన మిర్పూరి కశ్మీరీ బృందాలను కలుపుకుని 2020 రిఫరెండ్‌ అని చెబుతున్న కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేస్తున్నాయి. అంటే పాత క్రీడాపుస్తకంలో మరొక అధ్యాయాన్ని తెరుస్తున్నారన్నమాట. గతంలో పాక్‌ ఈ వైపుగా చేసిన ప్రయత్నాలకు మల్లే ఈ కొత్త ప్రయత్నం కూడా వైఫల్యానికే దారితీస్తుంది. దీనివల్ల భారత్‌ కంటే పాకిస్తాన్‌ కే అపార నష్టం జరిగే ప్రమాదముంది. కాబట్టి భారత్‌లో మనం ఎలాంటి ఆదుర్దాలను ప్రదర్శించనవసరం లేదు కూడా. భారత్‌నుంచి సిక్కులను విడదీయడం అనేది 1950ల నాటి పాకిస్తాన్‌ కులీనవర్గాల భ్రమ. ఆ నాటి దేశ విభజన గాయాలు 1950లో కూడా మానకుండా పచ్చిగా ఉండటాన్ని పాక్‌ సైనికవర్గాలు తమకు అనుకూలంగా భావించాయి. 

సిక్కుల్ని హిందువుల నుంచి వేరుచేయగలమనే ఆశాభావంతో ఇలాంటి విభజన కార్యకలాపాలను 1960ల మధ్యనాటికి పాక్‌ పరాకాష్టకు తీసుకుపోయింది. పంజాబీ సుబా (ప్రత్యేక పంజాబీ రాష్ట్రం) ఉద్యమం తీవ్ర/వేర్పాటువాద ప్రేరణలతో నడిచింది. కానీ పంజాబ్‌ సీఎంగా ప్రతాప్‌ సింగ్‌ కైరాన్‌ ఉన్నప్పుడు, ఆయన హత్యకు గురైన తర్వాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ ఈ సవాలును నేర్పుతో ఎదుర్కొన్నారు. పంజాబ్‌ను మరోసారి వేరు చేశారు. హిందీ ప్రాబల్యం ఉన్న హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ అనేవి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇక పంజాబీ మాట్లాడే సిక్కులు మెజారిటీగా ఉండే నేటి పంజాబ్‌ కూడా ఆనాడే ఉనికిలోకి వచ్చింది. ఈ సమయంలోనే మరో ఆసక్తికరమైన పరిణామం జరి గింది. 1965 నాటి యుద్ధంలో తనకు పట్టుబడిన భారత సైనికుల్లో భారతీయ సిక్కు సైనికులను ప్రత్యేకించి సిక్కు అధికారులను పాక్‌ సైన్యం వేరుచేసి వారిలో విభజన బీజాలను నాటడానికి ప్రయత్నించింది.

ఆ అధ్యాయం ముగియడంతో 1981లో రెండో అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈసారి ఆప్ఘన్‌ జిహాద్‌లతో కూడిన పాక్‌ సైనిక యంత్రాంగం దీనికి కర్త. భారత్‌లో అంతర్గతంగా సంభవించిన అనేక కారణాలు కూడా దీనికి తోడయ్యాయి. సిక్కులలో పునరుద్ధరణ భావాలు, బలహీన ప్రభుత్వాలు, సిరోమణి అకాలీదళ్‌ ప్రాధాన్యతను బాగా తగ్గించివేయడం వంటివి వీటిలో కొన్ని. తర్వాత సంత్‌ జరై్నల్‌ సింగ్‌ బింద్రన్‌ వాలే వంటి ప్రజాకర్షణ, పరిశుద్ధ నేత అవతరించాడు. తర్వాత ఏం జరిగిందే చరిత్రకెక్కింది. ఆ తర్వాత 13 ఏళ్ల కాలంలో వేలాదిమంది మరణించారు. ఇక పంజాబ్‌ తుది సమస్యగా కనిపించిన తరుణంలో ఆనాటి ఉద్యమం ముగిసిపోయింది. నాటి పరిణామాలను సన్నిహింతగా గమనిస్తున్న మనలాంటి వారికి అప్పట్లో ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

ఇది ఎలా జరిగింది? అంటే భద్రతాబలగాలు, నిఘా సంస్థలు తమ పనిని చక్కగా నిర్వర్తించాయి. అయితే ఈ పోరాటం ఇక చాలు అని సిక్కులు తమకు తాను నిర్ణయించుకున్నప్పుడే సిక్కు టెర్రరిజం ముగింపుకొచ్చింది. ఆనాటి సమరంలో నిజమైన హీరో ఎవరంటే సిక్కు పంజాబ్‌ పోలీసులే. సిక్కు ప్రజాభిప్రాయం నాటకీయంగా మారిపోయింది. ఆరోజుల్లో పంజాబ్‌లోని విముక్తి ప్రాంతాలుగా చెప్పుకున్న చోట్ల సందర్శించిన నా తోటి జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం వేర్పాటు ఉద్యమం రాత్రికి రాత్రే ముగిసిపోయింది. నిజానికి దాని గురించి మాట్లాడుకునే వారే లేకుండా పోయారు. నాటి పంజాబ్‌ పోలీసు చీఫ్‌గా వేర్పాటు వ్యతిరేక కేంపెయిన్‌ ప్రారంభించిన కేపీఎస్‌ గిల్‌ పంజాబ్‌ వేర్పాటు ఉద్యమం ఎందుకు ఉన్నట్లుండి ముగిసిపోయిందన్న నా ప్రశ్నకు ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. పాకిస్తానీయులు మహ్మద్‌ ఇక్బాల్‌ సుప్రసిద్ధ గేయ పంక్తులను చదువుకోలేదని గిల్‌ చెప్పారు. 

పాకిస్తానీయులు ఆనాటీ పరిస్థితులను ఇప్పుడు మళ్లీ తీసుకొస్తామని భావించడం ఒక అద్భుతమైన చెత్త వ్యవహారం. అదేవిధంగా భారత్‌లో కొంతమంది కూడా పాకిస్తానీయులు మన సిక్కులను మననుంచి తీసుకుపోతారంటూ మతిహీన వాఖ్యలు చేస్తున్నారు. కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గోడలపై బింద్ర¯Œ వాలే చిత్రాలను వేలాడదీశారని, బింద్రన్‌ వాలే బొమ్మ ఉన్న కీ చెయిన్లను స్వర్ణదేవాలయం బయట షాపుల్లో అమ్ముతున్నారని, ఢిల్లీలోని కార్ల వెనుకాల కూడా ఇవి కనబడుతున్నాయని తెలిసినంతమాత్రాన భారతీయులు కలవరపడుతున్నారంటే ఒక జాతిగా మనపై మనకు నమ్మకం లేదని, సిక్కు సమాజంపై నమ్మకం లేదని చెప్పక తప్పదు.

2019లో కూడా సిక్కులు పాకిస్తానీయుల ఉచ్చులో పడతారని భావించడం అంటే మన నిఘా సంస్థలకు అవమానం. అలాగే దుష్ట పాకిస్తానీయుల నుంచి సిక్కులను భారతీయులంగా మనం కాపాడాలనుకోవడం అహేతుకమే కాదు.. అది మూర్ఖ ఆలోచన కూడా.  భారతీయ సామాజిక, జాతీయ పొందిక గత కొన్నేళ్లుగా బలపడుతూ వచ్చిందని మనం చెప్పుకున్నాం. వైవిధ్యంలోనే ఐక్యత అని మన గణతంత్ర రాజ్య నిర్మాతలు తప్పు నినాదమిచ్చారని ఇవాళ కొందరు వాదించవచ్చు కానీ భిన్నత్వాన్ని ఇంకా విస్తృతపర్చమనే మన జాతి నిర్మాతలు చెప్పారు. దీన్ని మనం అంగీకరిస్తే తోటి భారతీయుడి జాతీయ నిబద్ధత గురించి మనం కలవరపడాల్సిన పని లేదు.

అందుకే హానికరమైన భయాలను మర్చిపోయే సమయం ఆసన్నమైంది. భారత్‌ పెళుసైన పింగాణితో రూపొందలేదు. భారతీయ సిక్కులకు, సిక్కు మతేతర భారతీయులకు అతి పెద్ద పవిత్ర మంది రాలను ఇవ్వాళ నిర్మించి ఉన్నాం. ఇది మనం సామూహికంగా సంతోషించాల్సిన సమయం. ఖలిస్తాన్‌ పునరాగమనం అటూ గావుకేకలు వేస్తున్న టీవీ చానల్స్‌ను ఆపివేద్దాం. ఖలిస్తాన్‌ మళ్లీ ఆవిర్భవించదు. గోడలపై దెయ్యాన్ని చిత్రించవద్దు. ఇప్పటికీ ఖలిస్తాన్‌ గురించిన భయాలు మీలో ఉంటే గురునానక్‌పై ఆ గొప్ప సిక్కు ప్రార్థనా గీతాన్ని గుర్తుతెచ్చుకోండి. ‘నానక్‌... మీ దయతో, మీ ఔదార్యంతో సమస్త మానవజాతి సంతోషంగా గడుపుతుంది’.

వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
Twitter@ShekarGupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement