డేరాబాబా నానక్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్‌కు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ
డేరాబాబా నానక్ (గురుదాస్‌పూర్)/ కర్తార్‌పూర్ (పాకిస్తాన్): పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు.
అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం నాకు లభించిన వరం. ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా’అని తెలిపారు. నానక్ జీవితం సిక్కులకు మాత్రమే కాదు మానవాళికే స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కర్తార్‌పూర్‌లో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుమారు 12 వేల మంది సిక్కు యాత్రికుల సమక్షంలో కారిడార్ ప్రారంభించారు. భారత్ నుంచి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు కుశల ప్రశ్నలు అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment