నేడే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం | Sikh Pilgrims Await Historic Inauguration of Kartarpur Corridor in Pakistan | Sakshi
Sakshi News home page

నేడే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం

Published Sat, Nov 9 2019 4:10 AM | Last Updated on Sat, Nov 9 2019 4:21 AM

Sikh Pilgrims Await Historic Inauguration of Kartarpur Corridor in Pakistan - Sakshi

పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారా

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానుంది. సిక్కుల గురువు గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పాక్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు.

అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న డేరాబాబా నానక్‌ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో యాత్రికులకు ఆధునిక వసతులు కల్పించారు. పూర్తి ఎయిర్‌ కండిషన్‌తో కూడిన ఈ భవనంలో రోజుకు 5వేల మంది యాత్రికులకు క్లియరెన్స్‌ ఇచ్చేందుకు వీలుగా 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గురునానక్‌ తన చివరి 14 ఏళ్లు గడిపిన గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను కలిపే 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌ ద్వారా ప్రతి రోజు 5వేల మంది భారత్‌ యాత్రికులు సందర్శించేందుకు వీలుంటుంది.

మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ హర్‌ప్రీత్‌ సింగ్, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్, నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూతోపాటు పంజాబ్‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కాగా, కర్తార్‌పూర్‌ వెళ్లే సీనియర్ల సిటిజన్లకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. డేరాబాబా నానక్, సుల్తాన్‌పూర్‌ లోథి గురుద్వారాల వద్ద గురునానక్‌ జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పూలతోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.  

ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేస్తాం: పాక్‌

కారిడార్‌ ప్రారంభం కానున్న ఈనెల 9వ తేదీ, గురు నానక్‌ జయంతి రోజైన 12వ తేదీన తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఒక్కో యాత్రికుడి నుంచి సుమారు రూ.1,400 (20 డాలర్లు) వసూలు చేయనున్నట్లు పాక్‌ విదేశాంగ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement