సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శనివారం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో హారతి ఇస్తున్న భక్తులు
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగా... మరొకరి పరాజయంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారాయన. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు.
న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం
వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. ఈ రోజు భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పునిచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
డ్రోన్లతో నిఘా..
అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు శాఖ అప్రమత్తమయింది. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పౌరులు శాంతి, సామరస్యపూర్వకంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యకలాపాలను కూడా గమనిస్తామని, వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా వివేకంతో వాడాలని, ఎవరూ ఎటువంటి అసత్యాలు గానీ, విద్వేషపూరిత ప్రచారం గానీ చేయవద్దని సూచించారు.
► యావద్భారత విజయం
అయోధ్యపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన విజయం. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలి. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకొనేందుకు కృషి చేయాలి.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
► సంయమనం పాటించాలి
సాక్షి, అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాతే తుది తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
► ఈ తీర్పు ఓ మైలురాయి
అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతి స్తున్నాం. ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును అన్ని వర్గాలు, మతాలు ప్రశాంత చిత్తంతో అంగీకరించాలి. ఒకే భారతదేశం– ప్రశస్త భారతదేశం నినాదానికి కట్టుబడి ఉండాలి. శ్రీరామ జన్మభూమి కోసం పోరాడిన సంస్థలకు, సాధు సమాజానికి, అసంఖ్యాక ప్రజలకు కృతజ్ఞతలు.
హోంమంత్రి అమిత్ షా
► రాముడు అయోధ్యలో పుట్టాడని రుజువైంది
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడన్నది నిర్వివా దాంశం. సుప్రీంకోర్టు తీర్పుతో అదే విషయం మరోసారి రుజువైంది. కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ ఆలయం మాదిరిగా అయోధ్యలో రామాలయం విశాలంగా ఉండాలి. శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతావనికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా.
విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి
► అంతిమ విజయం
ఈ తీర్పును ఆర్‌ఎస్‌ఎస్ స్వాగతిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సరైన ముగింపు పలికింది. ఈ తీర్పు దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంది. సత్యం, న్యాయం అంతిమంగా గెలుస్తాయని నిరూపించింది. విభేదాలను మరిచి రామాలయ నిర్మాణానికి పనిచేయాలి. అయోధ్యకు సంబంధించి చారిత్రక ఆధారాలున్నందునే ముందుండి పోరాడాం. మథుర, వారణాసిలోని ఆలయాలకు సంబంధించిన ఇలాంటి వివాదాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకోబోదు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
► ఇరు వర్గాలకు ఊరట
అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ ముస్లిం వర్గాలకు ఊరట, సంతోషం కలిగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుంచి హిందువులు, ముస్లింలకు సంతృప్తి కలిగించింది’అని ట్విట్టర్‌లో తెలిపారు. మసీదు నిర్మాణంలో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు సాయం చేయడం ద్వారా ఐక్యతా భావం చూపాలి. అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో రవి శంకర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
శ్రీశ్రీ రవి శంకర్
Comments
Please login to add a commentAdd a comment