అయోధ్య రామాలయ ట్రస్ట్ గురించి లోక్‌సభలో ప్రకటిస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు.
శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు
రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు.
సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు
మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment