trusty
-
రాజకీయాలకు మెట్రోమ్యాన్ గుడ్‌బై
సాక్షి, మలప్పురం: కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘సహజంగా నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాను. ఉండాలనుకోలేదు. నాకిప్పుడు 90ఏళ్లు. అందుకే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు. ప్రస్తుతం మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను ’అని శ్రీధరన్ గురువారం పొన్నానిలో మీడియాతో అన్నారు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పందించారు. క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా శ్రీధరన్ సేవలను పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ఉపయోగించుకుంటుందని చెప్పారు. శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున కేరళ సీఎం అభ్యర్థిగా పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
రామాలయానికి లంక నుంచి శిల
అయోధ్య: లంకాధీశుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణం పేర్కొంటున్న ప్రాంతం నుంచి ఒక రాయిని సేకరించి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందజేస్తామని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. రెండు దేశాల మధ్య మైత్రీబంధానికి ఒక తార్కాణంగా ఇది నిలువనుందని పేర్కొంది. సీతాఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన ఈ శిలను త్వరలోనే శ్రీలంక హై కమిషనర్ మిళింద మొరగొడ భారత్‌కు తీసుకువస్తారని తెలిపింది. మరో 1.15 లక్షల చ.అడుగుల భూమి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ జన్మభూమి పరిసరాలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో 1.15లక్షల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. ట్రస్ట్ కార్యకలాపాలు, భద్రతా సిబ్బంది, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు దీనిని వినియోగిస్తామని ట్రస్ట్ అధికారి ఒకరు తెలిపారు. రామ్‌కోట్, తెహ్రి బజార్ ప్రాంతంలోని భూమిని చదరపు అడుగు రూ.690 చొప్పున, రూ.8 కోట్లకు గత వారమే కొన్నట్లు తెలిపారు. -
రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
త్వరలో తొలి ఆర్ఈఐటీ
న్యూఢిల్లీ: దేశంలో తొలి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్) కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ స్టోన్, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూపు సంయుక్తంగా వచ్చే కొన్ని వారాల్లో రీట్ ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించనున్నాయి. బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూపు జాయింట్ వెంచర్ అయిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ గతేడాది సెప్టెంబర్‌లోనే సెబీ వద్ద రీట్ ఇష్యూకు సంబంధించి పత్రాలను దాఖలు చేసింది. 33 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పోర్ట్‌ఫోలియో ఈ జాయింట్ వెంచర్‌కు ఉంది. ఆసియాలో అతిపెద్దది. అద్దెల రూపంలో ఆదాయాన్నిచ్చే రియల్ ఎస్టేట్ ఆస్తులను రీట్ కలిగి ఉంటుంది. ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరోక్షంగా రియల్ ఎస్టేట్ నుంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. సెబీ తొలిసారిగా 2014లో రీట్ నిబంధనలను విడుదల చేసిన విషయం గమనార్హం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లను కూడా సెబీ అనుమతించగా, ఇప్పటికే ఐఆర్బీ ఇన్విట్ ఫండ్, ఇండ్ ఇన్‌ఫ్రావిట్ ట్రస్ట్‌లు ప్రజల నుంచి నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ అయి ఉన్నాయి. మంచి లాభసాటే! కొన్ని వారాల్లో తమ రీట్‌ను విడుదల చేయనున్నట్టు ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సీఈవో మైక్ హోలండ్ ధ్రువీకరించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో మాదిరిగా, భారత్‌లోనూ రీట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రీట్‌లో రాబడులు మొదటి ఏడాదిలో 9 శాతం, ఐదేళ్ల కాలంలో 18 శాతం వరకు ఉంటాయని అంచనా. బెంగళూరు, పుణె, నోయిడా, ముంబైలోని ఏడు ఆఫీసు కార్యాలయ పార్క్‌లు, భవనాలను ప్రతిపాదిత రీట్‌లో చేర్చనుంది. మొత్తం 33 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం దీని పరిధిలో ఉంటుంది. 24 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో ఇప్పటికే రూ.2,000 కోట్ల ఆదాయం వార్షికంగా వస్తోంది. 3 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం జరుగుతుండగా, మరో 6 మిలియన్ల చదరపు అడుగుల మేర నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. 50 శాతానికి పైగా అద్దె ఆదాయం ఫార్చ్యూన్ 500 కంపెనీల నుంచే వస్తోంది. రానున్న మూడేళ్లలో అద్దెల ఆదాయం 55 శాతం వరకు పెరుగుతుందని అంచనా. -
రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు
అందుబాటులో దరఖాస్తులు సెప్టెంబర్ 8 చివరి తేదీ వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని, ఆయా ఆలయాల నుంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని, 20 రోజుల గడువులో దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు పనులు చేపట్టారు. దీంతో వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం 20 రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ లెక్కన వచ్చేనెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను వేములవాడ రాజన్న కార్యాలయం, కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్లలో అందుబాటులో ఉంచారు. వచ్చేనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలయ కమిటీల్లో సభ్యత్వాలు పొందేవారంతా పూర్తి చేసిన దరఖాస్తులను కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్లలో సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరించిన తర్వాతనే సమర్పించాల్సి ఉంటుంది.