
సాక్షి, మలప్పురం: కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘సహజంగా నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాను. ఉండాలనుకోలేదు. నాకిప్పుడు 90ఏళ్లు. అందుకే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు.
ప్రస్తుతం మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను ’అని శ్రీధరన్ గురువారం పొన్నానిలో మీడియాతో అన్నారు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పందించారు.
క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా శ్రీధరన్ సేవలను పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ఉపయోగించుకుంటుందని చెప్పారు. శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున కేరళ సీఎం అభ్యర్థిగా పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.