రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు పడి ఉంటే... వెనక్కి వెళ్లడం పరిష్కారం కాదు. వాటిని రోడ్డుపై లేకుండా చేసి ముందుకెళ్లడమే అసలుసిసలు ప్రయాణం. ‘తోలుబొమ్మలాట అనేది పురుషులకు మాత్రమే పరిమితమైన కళ’ అనే నానుడిని ఛేదించి కొత్త ప్రయాణం మొదలు పెట్టింది రజితా రామచంద్రన్...
రజిత తండ్రి రామచంద్రన్ పాలక్కడ్ (కేరళ)లో తోలుబొమ్మలాడించడంలో సుప్రసిద్ధుడు. ‘నేను నేర్చుకుంటాను నాన్నా’ అని తండ్రిని అడిగితే ‘ఆడపిల్లలకెందుకమ్మా ఈ ఆట’ అని చిన్నబుచ్చలేదు ఆ తండ్రి. ఎంతో శ్రద్ధగా కూతురికి ‘తోలుబొమ్మలాట’ నేర్పించాడు. ఆ సమయంలో రజితకు అది సరదా మాత్రమే.
అయితే ఒకానొక సంఘటన తోలుబొమ్మలాటను సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ఒకచోట తోలుబొమ్మలాట జరుగుతోంది. ఒక విదేశీ మహిళ ఈ ఆటను చూస్తూనే వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఇది చూసి కొందరు పురుషులు మండిపడ్డారు. బొమ్మలను ఆడించే చోట ఒక మహిళను ఎలా అనుమతిస్తారు? అనేది వారి కోపం. వారి దృష్టిలో మహిళలు ప్రేక్షకుల్లో మాత్రమే కూర్చోవాలి.
తోలుబొమ్మలాట కళ అనేది పురుషుల సొంతం కాదు అని నిరూపించడానికి రజిత రంగంలోకి దిగింది. జిల్లా పంచాయత్ హాల్‌లో పెన్‌పవక్కోతు(మహిళల ఆధ్వర్యంలో జరిగే తోలుబొమ్మలాట) పేరుతో కొత్త చరిత్రకు శ్రీకారం జరిగింది. ఈ బృందంలోని సభ్యులు అందరూ మహిళలే. వీరిని ఒక తాటిపైకి తీసుకువచ్చింది రజిత.
ఈ బృందంలోని సభ్యులు గురించి చెప్పుకోవాలంటే...
సల్ఫి స్క్రిప్ట్ రాసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతను తలకెత్తుకుంది జాస్మిన్. రాజ్యలక్ష్మి, అశ్వతి, నిత్య, నైవేద్య, శ్రీనంద, సంధ్య... బొమ్మలను ఆడించారు. సాధారణంగా బొమ్మలాటలో వినోదం ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ బొమ్మలాటతో మహిళల సమస్యలను, భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు.
‘వినోదానికి అలవాటు పడిన వారికి ఇది నచ్చుతుందా’ అనే సంశయం రజితలో ఉండేది. అయితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
‘ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలి’ అంటూ ముక్తకంఠంతో కోరుకున్నారు ప్రేక్షకులు.
‘ఇదేం చోద్యమమ్మా’ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ, వారి విమర్శలకు రజిత బృందం ప్రాధాన్యత ఇవ్వ లేదు. బొమ్మలను ఆడించడానికి శ్రీనంద బయలుదేరే సమయంలో ఇంట్లో వాళ్లే అభ్యంతర పెట్టారు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతే. అయితే ప్రేక్షకలోకంలో మంచి స్పందన వచ్చిన తరువాత వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది.
‘చరిత్రలో గుర్తుండిపోయే కార్యక్రమంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటుంది నిత్య.
‘ఒకప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లను బొమ్మల దగ్గరకు రానిచ్చేవారు కాదు. తాకడాన్ని తప్పుగా భావించేవారు. ఈ రకంగా చూస్తే రజిత బృందం కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పుకోవాలి. మార్పు
మొదలైనప్పుడు విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. అయితే తమ విమర్శలలో పస లేదనే విషయం వారికి త్వరలోనే అర్థమవుతుంది’ అంటుంది సుగుణ అనే బామ్మ. తొలితరం తోలుబొమ్మలాట మహిళా కళాకారుల బృందం ఈతరం అమ్మాయిలకు కూడా ఆ ప్రాచీన కళను నేర్పించి ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment