రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు
-
అందుబాటులో దరఖాస్తులు
-
సెప్టెంబర్ 8 చివరి తేదీ
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని, ఆయా ఆలయాల నుంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని, 20 రోజుల గడువులో దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు పనులు చేపట్టారు. దీంతో వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం 20 రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ లెక్కన వచ్చేనెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను వేములవాడ రాజన్న కార్యాలయం, కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్‌లలో అందుబాటులో ఉంచారు. వచ్చేనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలయ కమిటీల్లో సభ్యత్వాలు పొందేవారంతా పూర్తి చేసిన దరఖాస్తులను కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్‌లలో సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరించిన తర్వాతనే సమర్పించాల్సి ఉంటుంది.