vemulawada temple
-
నేడు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-
తప్పతాగి.. ప్రసాదం చేయడానికి వచ్చి..
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కి నైవేద్య సమర్పణలో అపచారం చోటుచేసుకుంది. నైవేద్యాన్ని సిద్ధం చేసే వంట బ్రాహ్మణుడు మద్యం తాగి విధులకు వచ్చాడు. స్వామికి నిత్యం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామివారికి శుక్ర వారం సమయానికి నైవేద్యం సిద్ధం కాకపోవడంతో ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, వరి నర్సయ్య వెంటనే నివేదన శాలలోకి వెళ్లి పరిశీలించగా.. నైవేద్యం సిద్ధంగా లేకపోవడంతోపాటు వంటబ్రాహ్మణుడు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు.సమయం దాటిపోతుండటంతో మరో బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించారు. హడావుడిగా సిద్ధం చేయడంవల్ల వేడిగా ఉన్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడికీఉడకని నైవేద్యాన్ని స్వామివారికి నివేదించారు. అప్పటికే నివేదన సమయం అరగంట ఆలస్యమైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆ వంట బ్రాహ్మణుడు ఇదేవిధంగా మద్యం మత్తులో విధులు నిర్వహించటంతో మెమో జారీ చేసినట్లు గోదాం పర్యవేక్షకుడు నర్సయ్య తెలిపారు. ఆదాయం ఘనం.. కైంకర్యాలపై పట్టింపు కరువువేములవాడ రాజన్నకు భక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా శ్రీస్వామి వారికి పవిత్రంగా సమర్పించే నైవేద్యాన్ని సిద్ధం చేయడంలో అధికా రుల నిర్లక్ష్యంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. ఇదిలా ఉండగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శుక్రవా రం కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసా గాయి. ఆలయంలోని వివిధ విభాగాలపై ఫిర్యా దులు రావడంతో గురువారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు స్వామి వారి అన్నదానం, అకౌంట్స్ విభాగాల్లోని రికార్డులు పరిశీలించారు. రికార్డుల పరిశీలన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
నేడు చంద్రగ్రహణం.. తిరుమల సహా ఆలయాలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో, నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులను మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,404. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,659. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. తిరుమలలో ఇలా.. ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత గ్రహణం కారణంగా నేడు రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత. విజయవాడలో ఇలా... పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత నేటి సాయంత్రం 6:30 గంటలకు దుర్గగుడితో పాటు ఉపాలయాల కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) గ్రహణ మోక్షకాలం అనంతరం రేపు తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు తెరుస్తారు స్నపనాభిషేకాల అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం తెలంగాణలో ఇలా.. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల మూసివేత ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాల వరకూ ఆలయాల మూసివేత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారుల ప్రకటన రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు సంప్రోక్షణతో ప్రాత:కాల పూజ చేసి తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. పూరీ క్షేత్రంలో భిన్నంగా.. గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయి. ►అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేయనున్నారు. ►చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయాలు మూసివేత ►తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు. ►నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యదేవుని ఆలయం మూసివేత. ►తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు. ►అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభం -
తెలంగాణ గుళ్లకు ఐటీ శాఖ నోటీసులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట: తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి, రాజన్న, బాసర ఆలయాలకు నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉంది. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను జారీ చేశారు. అదే విధంగా వేములలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలనికి కూడా ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ఇక బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. చదవండి: ఈనెల రెండో వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ -
శివరాత్రికి ఎములాడ సిద్ధం
వేములవాడ: పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజన్న చెంతకు చేరుకోండిలా.. రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్ నుంచి వచ్చేవారు కరీంనగర్ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. రాజన్న జాతర పూజలు మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆలయ ఉద్యోగులే భోళాశంకరున్ని బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతీనెలా వేతనాలు పొందుతూనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ప్రసాదాల విక్రయ కేంద్రంలో రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ఖాళీ డబ్బాల ఆధారంగా రికార్డులు తారుమారు చేశారు. సుమారు 2.25లక్షల లడ్డూలు విక్రయించి రూ.45లక్షలు సొంతానికి వినియోగించారు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. బాధ్యుడిపై బదిలీ వేటు వేశారు. మార్చి 13 నుంచి లడ్డూల విక్రయాలు.. మహాశివరాత్రి సందర్భంగా లడ్డూప్రసాదాల క్రయ, విక్రయాల బాధ్యతను తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అప్పగించారు. మార్చి 12 వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయించి, మిగిలిన లడ్డూల నిల్వలను ఆలయ అధికారులకు అప్పగించారు. మార్చి 13 నుంచి రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ ప్రణాళిక ప్రకారం లడ్డూలు విక్రయించిన రికార్డుల్లో చూపిస్తూ వచ్చారు. స్టాక్ దాచిపెట్టారు. ఆ తర్వాత 2.25 లక్షల లడ్డూలు విక్రయించారు. లడ్డూలను భద్రపర్చే ఖాళీ డబ్బాలను ఆధారంగా చేసుకుని రూ.45లక్షలు కాజేశారు. కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. కక్కించిన అధికారులు రాజన్న దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేయడం భక్తుల ఆనవాయితీ. ఈక్రమంలో ఒక్కో లడ్డూ రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే, కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈనెల18 – 22వ తేదీ వరకు ఆలయం మూసివేశారు. ఈ క్రమంలో ప్రసాదాల తయారీ విభాగం సూపరింటెండెంట్ తిరుపతిరావు ప్రసాదాల క్రయ, విక్రయాల తీరు, రికార్డులు తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా డబ్బాలు పరిశీలించగా ఖాళీగా కనిపించాయి. లడ్డూలు ఏమయ్యాయని వెంకటేశ్‌ను ప్రశ్నించి విచారణ చేపట్టారు. దీంతో 2.25 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన సొమ్మును సొంతానికి వినియోగించినట్లు తెలిసిపోయింది. దీంతో బాధ్యుడి నుంచి రూ.45లక్షలు స్వాధీనం చేసుకుని రాజన్న ఖాతాకు జమ చేయించారు. -
నిండిన హుండీలు.. భక్తులకు తిప్పలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. దీంతో కానుకలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ గర్భగుడి, అంత ర్భాగంలో మొత్తం 18 హుండీలు ఉండగా.. 13 హుండీలు నిండాయి. భక్తులు కానుకలు వేయకుండా అధికారులు హుండీలకు వ్రస్తాన్ని చుట్టారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 27న హుండీలు లెక్కించగా.. రూ.10.80 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. చిల్లర నాణేలను బ్యాంకర్లు తీసుకోకపోవడం.. లెక్కింపులోనూ జాప్యం జరగడంతో హుండీలు నిండిపోవడానికి కారణమని చెబుతున్నారు. బుధవారం హుండీలను లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, చిల్లర సమస్యపై దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. -
ఆ హామీ ఏమైంది: పొన్నం ప్రభాకర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏడాది వంద కోట్ల రూపాయలు ఇస్తామని గత ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఉన్న గుడి చెరువు పూడ్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వేములవాడలో మాత్రం ఒక పని కూడా చేయలేదని మండిపడ్డారు. వీటీడీఏ హైదరాబాద్ కార్యాలయానికి కూడా దేవస్థానమే డబ్బులు చెల్లిస్తుండగా, యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికై ఏడాది గడుస్తున్నా.. వేములవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి ఒక్క లేఖ కూడా రాయలేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన వెంటనే సీఎం కేసీఆర్‌ను కలవాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు జర్మనీకే అంకితం అయ్యారని ధ్వజమెత్తారు. వచ్చేనెల లోపు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే గాడిదకు వినతపత్రం ఇస్తామని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. -
టీఆర్ఎస్ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు
సాక్షి, వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. యాదాద్రి తరహాలో వేములవాడలోనూ రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్ విగ్రహాన్ని పెట్టే ప్రమాదముందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు. సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. వేములవాడ నియోజకవర్గం నుంచి రెండువేల మంది బీజేపీలో చేరగా ఎంపీ బండిసంజయ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడలో బీజేపీ జెండా ఎగురవేయకుంటే యాదాద్రి తరహాలో ఇక్కడా రాజన్న విగ్రహాన్ని తొలగించి కేసీఆర్ విగ్రహాన్ని పెట్టుకునే ప్రమాదముందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో గురువారం జరిగిన బీజేపీ సమావేశానికి హాజరయ్యారు.ఎంపీ మాట్లాడుతూ.. యాదా ద్రిలో దేవుళ్లు ఉండాల్సినస్థానాల్లో కేసీఆర్ బొమ్మలను పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు మేల్కొనకుంటే వేములవాడలోనూ ఇదే ప్రమాదం జరగనుందన్నారు. రమేశ్‌బాబును నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమాత్రం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.తన నిధులతో రాజన్నగుడిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.సారు..కారు.. కేసీఆరు.. ఎమ్మెల్యే జర్మనీ పరారు.. అంటూ చలోక్తులు విసిరారు. అక్రమాలు వెలికితీస్తా... టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి,అక్రమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తామన్నారు.కరీంనగర్ నియోజకవర్గంలో ఏడుగురు మంత్రులను నియమించుకున్నా... టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడేది లేదన్నారు. బీజేపీలో 2వేల మంది చేరిక వేములవాడ నియోజకవర్గంలోని ఏడుమండలాల నుంచి తరలివచ్చిన 2వేల మంది ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ ఎంపీ బండి సంజయ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్‌కి రైకనపాట క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 200మంది యువకులు బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గోపు బాలరాజు, జిల్లా దళితమోర్చా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా ఇన్చార్జి రాంనాథ్, ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు. గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పంపించారు.. వేములవాడరూరల్: గల్లీలో ఉన్నోడిని ఢిల్లీకి పం పిన ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. వేములవాడ మండలంలోని చెక్కపల్లిలో బీజేపీ పార్టీజెండా ఆవిష్కరించారు. విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉన్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్ చేయించాడన్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికా రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని పేర్కొన్నారు. -
ఎటూ తేలని ఎములాడ
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం వేములవాడను మరో యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీకి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఏటా రూ.వంద కోట్లు చొప్పున రూ.400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తొలి విడతగా మంజూరైన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని వెచ్చించి వేములవాడ రాజన్న గుడి చెరువును పూడ్చిన అధికారులు తరువాత చేతులెత్తేశారు. ఇక ఆలయ అభివృద్ధి, పట్టణ రోడ్ల సమస్యతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన అనేక హమీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వేములవాడ పట్టణంతోపాటు మరో ఐదు గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి వేములవాడ దేవాలయ ప్రాంత అభివృద్ధి సంస్థ(వీటీడీఏ) కమిటీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వీటీడీఏ ఆధ్వర్యంలో వేములవాడ దేవాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పటికీ, అమలు చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేవాదాయ శాఖ నుంచి సరైన సహకారం అందడం లేదు. దాంతో వేములవాడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఒకపక్క యాదాద్రిలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతుండగా, వేములవాడ శైవక్షేత్రం అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. చెరువులోని నిర్మాణాల కూల్చివేతకు మోక్షమెప్పుడు? వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా గుడి చెరువులోని దేవస్థానానికి సంబంధించిన నాలుగు కట్టడాలను తొలగించేందుకు అవసరమైన పనుల కోసం సాంకేతిక, పరిపాలనా అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత సంవత్సరం ఏప్రిల్ 9న అప్పటి కార్యనిర్వాహణాధికారి డి.రాజేశ్వర్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. గుడి చెరువు స్థలం 35 ఎకరాలను చదును చేయడంతోపాటు చెరువు చుట్టూ 150 అడుగుల వెడల్పుతో ట్యాంక్‌బండ్ వెడల్పు మొదలగు పనులు జరుగుతున్నందున చెరువులో ఉన్న కట్టడాలను తొలగించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. నిత్య కల్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపం, కల్యాణకట్ట, క్లోక్‌రూం, రెండు ఓపెన్ స్లాబ్హాల్స్, క్యూ కాంప్లెక్స్ హాల్స్, టాయ్‌లెట్ కాంప్లెక్స్‌లు చెరువు స్థలంలో పిల్లర్లతో నిర్మించి ఉన్నాయని, వాటిని తొలగించి ఇవ్వాలని వీటీడీఏ కోరిన నేపథ్యంలో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రూ.90 లక్షలు అవసరమవుతాయని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ వీటిని కూల్చేందుకు అనుమతులు మంజూరు చేయలేదు. హైదరాబాద్ కేంద్రంగా వీటీడీఏ హైదరాబాద్ కేంద్రంగా వీటీడీఏ కార్యకలాపాలు సాగుతుండడంతో స్థానికంగా ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఎప్పుడో ఓసారి వీటీడీఏ అధికారులు చుట్టపు చూపుగా వేములవాడకు వచ్చి సమీక్షలకే పరిమితం అవుతున్నారనే విమర్శలున్నాయి. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రోడ్లను వెడల్పు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా ముందుకు సాగడం లేదు. వీటీడీఏ, దేవాదాయ శాఖల మధ్య కుదరని సయోధ్యతో దుకాణ యజమానుల పరిహారం విషయంలో రోడ్ల వెడల్పు ముందుకు సాగలేదని ఆరోపణలు ఉన్నాయి. మొదట జరిపిన సర్వేల ప్రకారం దుకాణదారులకు పరిహారాన్ని వెంటనే చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలంటూ దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు ఎటూ తేల్చకపోవడం వల్లనే రోడ్ల వెడల్పు నిలిచిపోయినట్లు తెలిసింది. వేములవాడ గుడి చెరువును 30 ఎకరాలు ప్రైవేటు స్థలాలు తీసుకుని అందులో చెరువును ఏర్పాటు చేయడానికి అంచనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని తెలిసింది. ఆగని అంతస్తుల నిర్మాణం వేములవాడ రాజన్న ఆలయానికి సమీపంలో బహుళ అంతస్తులు నిర్మించడానికి వీల్లేదు. ఆలయ గోపురం కంటే ఎత్తులో భవన నిర్మాణాలు ఉండరాదనేది దేవాలయ పట్టణాల్లో ఉన్న నిబంధన. వేములవాడను రూ.400 కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళికలో ఈ అంశం కూడా ఉంది. అలాగే రోడ్ల వెడల్పు కార్యక్రమం మొదలైతే రహదారులను ఆనుకొని ఉన్న భవనాలను కూడా కూల్చివేయవచ్చు. 2015 మే 18న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయానా వేములవాడ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం, పట్టణ పరిసరాలతోపాటు నాంపల్లి ఆలయం కూడా సందర్శించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ గోపురం కంటే పట్టణంలో సమీపంలోని గృహాలు ఎత్తు ఉండకూడదంటూ వెంటనే వాటిని కూల్చివేయాలని సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. నామమాత్రంగా ఒక్క భవనాన్ని కూల్చివేసిన అధికారులు ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మంజూరైనవి రూ.90 కోట్లు..ఖర్చు చేసింది ఎంతో? వేములవాడ ఆలయానికి ప్రతి సంవత్సరం రూ.వంద కోట్లు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించగా... ఇప్పటి వరకు రూ.90 కోట్లు మాత్రమే మంజూరైనట్లు తెలిసింది. భూసేకరణ కోసం కొంత మొత్తం ఖర్చు చేసిన అధికారులు, ఆలయ అభివృద్ధి ప్రణాళికలు, ఇతర కార్యక్రమాల కోసం కొంత వెచ్చిం చినట్లు సమాచారం. కాగా చెరువు పూడ్చివేత పనులకు మిషన్ కాకతీయ ఫేజ్–2లో భాగంగానే వెచ్చిం చినట్లు తెలిసింది. చెరువు పూడ్చివేతతో నష్టపోయిన రైతులకు కూడా పరిహారం డబ్బులు చెల్లించినట్లు స మాచారం. ఇక ఆలయ అభివృద్ధికి మాత్రం ఎలాంటి ప్రత్యేక నిధులను ఇప్పటి వరకు మంజూరు కాలేదు. -
వేములవాడను గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
వేములవాడ : వేములవాడ ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. వేములవాడలో ఆలిండియా వెలమసంఘం భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ భానుప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కడారి దేవేందర్‌రావు, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిడ్‌మానేరు నుంచి నేరుగా వేములవాడ గుడి చెరువు, మూలవాగులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ శృంగేరి పీఠాధిపతులను వేములవాడకు తీసుకుని రానున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ ఆలిండియా వెలమ సంఘం భవనాన్ని వెలమలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ అనాథలు, నిరుపేదలను ఆదుకోవడమే సంస్థ లక్ష్యమన్నారు. స్థలదాత పాలెపు నర్సింగారావు, ఐవా జనరల్ సెక్రటరీ రామ్మోహన్రావు, ట్రెజరర్ జోగినపల్లి వెంకటనర్సింగారావు, శ్రీనివాస్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ, వెలమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కులాల పేర్లు మార్చేందుకు కృషి: ఈటల
సాక్షి, వేములవాడ: ఉచ్ఛరించేందుకు ఇబ్బందిగా ఉన్న కులాల పేర్లు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం పూసల సంఘం రాష్ట్ర కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇబ్బందికరమైన కులాల పేర్లు మార్పు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చిస్తోందన్నారు. సంచార జాతుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటి కార్యకలాపాల నిర్వహణ కోసం జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతంగా రాజన్న ఆలయం
► ఐదేళ్లలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కేటీఆర్ ► సిరిసిల్ల, వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి, సిరిసిల్ల: దేశంలోనే అరుదైన శైవ క్షేత్రంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవ స్థానాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి çపరిచేందుకు బ్లూప్రింట్ రూపొం దించి చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో పురోగతి కనిపిస్తోందని, రాబోయే నాలుగై దేళ్లలో పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. సోమవారం వేములవాడ రాజన్న ఆల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. ‘‘రూ.400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనుల కోసం ఏటా రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేసింది. నాంపల్లి గుట్టను కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గుడి చెరువు కింది 35 ఎకరాల స్థలాన్ని సేకరించి, పనులు ప్రారం భించడానికి మరో 9 నెలల సమయం పడు తుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అ మలు పరుస్తాం. గతంలో వేములవాడ గుడికి వస్తే పదవులు పోతాయని దుష్ప్రచారం చేశారు. సీఎం గుడికి వచ్చి ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేశారు’’అని పేర్కొన్నారు. దర్శనానికి మరోసారి వస్తా.. వేములవాడ రాజన్న దర్శనానికి మరోసారి వస్తానని కేటీఆర్ చెప్పారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నా రని, తాను దర్శనానికి వెళ్తే కనీసం గంట పాటు క్యూలైన్ నిలిపివేయాల్సి వస్తుంద న్నారు. భక్తులను ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను తప్ప రాజన్నను దర్శించుకొంటే పదవులు పోతాయనే భయంతో కాదంటూ చమత్కరించారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ నిధులు రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రెండు మూడ్రోజుల్లో జీరో వడ్డీకి సంబంధించిన నిధులను బ్యాంకుల్లో జమ చేస్తామని కేటీఆర్ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేములవాడ మున్సి పల్, దేవాలయ అభివృద్ధిపై అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. రాజన్న భక్తులకు ఆన్ లైన్ సేవలు వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో ఆన్లైన్ సేవలను మంత్రి కె.తారకరామారావు సోమవారం ప్రారంభించారు. తద్వారా భక్తులకు గదుల సమాచారంతోపాటు ఇతరత్రా సేవలు ఆన్లైన్లోనే అందు బాటులో ఉండే వెసులు బాటు కలిగినట్లయింది. -
రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు
అందుబాటులో దరఖాస్తులు సెప్టెంబర్ 8 చివరి తేదీ వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని, ఆయా ఆలయాల నుంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని, 20 రోజుల గడువులో దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు పనులు చేపట్టారు. దీంతో వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం 20 రోజుల వ్యవధిలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ లెక్కన వచ్చేనెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను వేములవాడ రాజన్న కార్యాలయం, కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్లలో అందుబాటులో ఉంచారు. వచ్చేనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలయ కమిటీల్లో సభ్యత్వాలు పొందేవారంతా పూర్తి చేసిన దరఖాస్తులను కరీంనగర్ ఏసీ కార్యాలయం, వరంగల్ డీసీ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం, సెక్రటేరియట్లలో సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరించిన తర్వాతనే సమర్పించాల్సి ఉంటుంది. -
భక్తులకూ వీఐపీ ఆశీర్వచనం
రూ.1000 అతిథి మర్యాదలు వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకునే వీవీఐపీలు, ప్రొటోకాల్ అతిథులకు ఇచ్చే గౌరవ మర్యాదల్లో కొన్నింటిని భక్తులకూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ప్రత్యేక దర్శనంతో పాటు వేదోక్త ఆశీర్వచనం గావించనున్నారు. ప్రత్యేక వూర్గం ద్వారా ప్రత్యేక దర్శనం, దేవస్థాన పండితులతో ఆశీర్వచనం, శ్రీస్వామివారి మహాప్రసాదం, శేషవస్త్రాలుగా స్వామివారి రెండు లడ్డూలు, ఒక కండువా, రెండు కనుములు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ముఖ్య బుకింగ్, పీఆర్వో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. -
రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఐజీ
వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్ ఐజీ ఇ.దామోదర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు. -
రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి
వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం లక్ష మంది వరకు భక్తులు రాగా, సోమవారం కూడా రద్దీ భారీగానే ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వేములవాడలో స్వామి వారి సేవలో కేసిఆర్
-
వేములవాడ ఆలయంలో పాము కలకలం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఓ పాము కలకలం రేపింది. కళా భవన్లో అకస్మాత్తుగా పాము కనిపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఆలయ అధికారులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. (వేములవాడ) -
మదినిండా రాజన్నా..
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక దారులన్నీ ఎములాడకే సాగుతున్నాయి. పిల్లాపాపలు, ముల్లెమూటలతో జనం తరలి వస్తున్నారు. సోమవారం రాత్రి వరకు రెండు లక్షల మందికిపైగా చేరుకున్నారు. నేడు జరిగే మహాశివరాత్రి వేడుకలకు మరో రెండు లక్షల మంది తరలివచ్చే అకాశముంది. వేములవాడ అర్బన్ :కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు జరిగే జాతరకు ఈసారి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేశారు. సోమవారం రాత్రి వరకు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సులభ దర్శనాలకు వీలుగా ఈ మూడు రోజులు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. కోడె మొక్కులు యథావిధిగా చెల్లించుకోకునేందుకు అవకాశం కల్పించారు. నేడు శివరాత్రి వేడుకలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6.05 గంటలకు స్వామి వారికి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ తెలిపారు. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయంలో పదకొండు మంది రుత్వికులతో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఉదయం 6.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ, 7.30 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు స్థానిక బ్రాహ్మణోత్తములు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలోనే గత 41 రోజులుగా దీక్ష చేపట్టి ఇరుముడులతో తరలిరానున్న శివస్వాములకు దర్శనాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. వీఐపీల దర్శనాలు, స్వామి వారి ఉత్సవాల సమయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులకు తప్పని తిప్పలు.. ఆలయ అధికారులు రూ.80 లక్షలు వెచ్చించి ఏర్పాట్లు చేసినా భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వసతి గదులన్నీ అధికారులకు, వీఐపీలకు కేటాయించడంతో వచ్చిన భక్తులంతా చెట్లు, పందిళ్లు, మూలవాగు, జాతరగ్రౌండ్ ప్రాంతాలతోపాటు ఎక్కడ చోటు దొరికితే అక్కడే సేదతీరారు. ఆలయ వసతి గదుల ఎదుటే సామాన్య భక్తులు విడిది చేశారు. అక్కడే వంటావార్పులు చేశారు. ప్రైవేట్ వసతి గదులకు ఎక్కువ ధరలు వసూలు చేయడంతో భక్తులు ఇబ్బందులుపడ్డారు. కట్టుదిట్టమైన భద్రత జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈమేరకు పట్టమంలో 153 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1074 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బాంబ్‌స్వ్కాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శివకుమార్ ఇప్పటికే ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. -
దేవుడే దిక్కు!
వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం స్వామివారి దర్శనం కోసం వచ్చిన రంజిత్‌కుమార్(22) అనే యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ లేదు. చివరికి కుటుంబసభ్యులు 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే ఊపిరి ఆగిపోయింది. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. వేములవాడ అర్బన్: ఎములాడ రాజన్న భక్తులకు అత్యవసర వేళ్లలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. భక్తుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా ఆలయ యంత్రాగం ఆలోచించడం లేదు. కూలైన్లలో స్పృహతప్పి పడిపోయినా, ఆలయంలో కోడెలు దాడి చేసినా, మరేదైనా కారణంగా గాయాలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ఉత్సవాల సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు వైద్య సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కోడెల దాడి, క్యూలైన్లలో స్పృహతప్పి పడిపోవడం, ఆలయ ఆవరణలోనే గుండెపోటు రావడం లాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నా అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రథమ చికిత్సకు నోచుకోని భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేంకు ప్రతిరోజు కనీసం ఐదువేల మంది భక్తులు వస్తుంటారు. ఆది, సోమ, శుక్ర, శని వారాలతో పాటు పండగలు, ప్రత్యేక రోజుల్లో సుమారు ముప్పైవేల మంది తరలివస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. దీంతో నిత్యం ఈ క్షేత్రంలో భక్తుల సందడి కనిపిస్తూంటుంది. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కనీసం ఒకరోజైనా ఇక్కడే నిద్ర చేయాలనే ఆనవాయితీ కొనసాగుతోంది. గదులు లభించని భక్తులంతా ఆలయ ఆవరణలోనే సేదతీరుతారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరమైన సమస్య తలెత్తితే వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితే నెలకొని ఉంది. దీంతోపాటు ఉపవాస దీక్షతో రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇందులో పిల్లలు, వృద్ధులు, వికలాంగలు ఉంటారు. ఈ క్రమంలో వయోభారంతో బాధపడే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడేవారు, వృద్ధులు క్యూలైన్లలో అలసిపోయి స్పృహతప్పి పడిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న ఆలయ యంత్రాంగం కనీసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూశారు. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు ఉదయం పూటనే ధర్మగుండంలో స్నానాలాచరించి ఉపవాసంతోనే స్వామి వారిని దర్శించుకోవడం శ్రేష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న కొంతమంది కిందపడిపోవడం, ధర్మగుండం వద్ద జారిపేడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇదంతా చూస్తున్న ఆలయ అధికార యంత్రాంగం భక్తులకు వైద్య సేవలందించేందుకు కనీస చర్యలకు పూనుకోవడం లేదు. భక్తుల రద్దీ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇక ఆ రాజన్నే దిక్కంటూ భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. అనాథలు, యాచకుల పరిస్థితి దయనీయం: రాజన్నను నమ్ముకొని అనేక మంది అనాథలు, యాచకులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కుటుంబసభ్యులకు ఆదరణకు దూరమైన పలువురు వృద్ధులు స్వామివారిపైనే భారం వేసి ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాచకులు సైతం భక్తులు చేసే దానధర్మాలపైనే బతుకీడుస్తున్నారు. వీరంతా వయోభారం, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ఇలాంటికి వారికి ఆలయం తరఫున వైద్యం అందించే పరిస్థితి లేకపోగా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇప్పటికే పలువురు వృద్ధులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. అందుబాటులో లేని అంబులెన్స్ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా దేవాదాయశాఖ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు భక్తులకు ఏదైనా జరిగితే వారి సంబంధీకులే స్వయంగా ఎత్తుకెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచాలని భక్తజనం కోరుకుంటున్నారు. హోమియో వైద్యశాల మూతబడి మూడేళ్లు రాజన్న ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించబడిన హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారిందని భావించిన ఆలయ అధికారులు ఆ వైద్యశాలను మూడేళ్ల క్రితమే ఎత్తివేశారు. హోమియో వైద్యశాలతో ఆర్థిక భారం పడుతుందని దానిని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోమియో వైద్యశాల ఉన్నన్నాళ్లు ఓ డాక్డర్, ఓ కాంపౌండర్ అందుబాటులో ఉంటూ కనీసం ప్రథమ చికిత్సనైనా అందించేవారు. ఆ వైద్యశాలను మూసేసిన అధికారులు మరో సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో రెండుసార్లు జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో దీని ఊసెత్తకపోవడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి నిన్న రంజిత్‌కుమార్ అనే 22 ఏళ్ల యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. అంబులెన్స్ లేనేలేదు. చివరికి 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యసిబ్బందినైనా అందుబాటులో ఉంచాలి. - నాగుల విష్ణుప్రసాద్, స్థానిక నాయకుడు రద్దీ సమయంలో వైద్యం అందిస్తాం ఆలయం పక్షాన ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమ, శుక్రవారాలు వైద్యులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యశాఖ సిబ్బందిని ఇక్కడ డిప్యూట్ చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. భక్తులకు అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో