రాజన్న ఆలయంలో అపచారం
మద్యం తాగి వచ్చిన వంట బ్రాహ్మణుడు
వేరే బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించిన అధికారులు
హడావుడిగా చేయడంతో ఉడికీఉడకని నైవేద్యం సమర్పణ
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కి నైవేద్య సమర్పణలో అపచారం చోటుచేసుకుంది. నైవేద్యాన్ని సిద్ధం చేసే వంట బ్రాహ్మణుడు మద్యం తాగి విధులకు వచ్చాడు. స్వామికి నిత్యం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామివారికి శుక్ర వారం సమయానికి నైవేద్యం సిద్ధం కాకపోవడంతో ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, వరి నర్సయ్య వెంటనే నివేదన శాలలోకి వెళ్లి పరిశీలించగా.. నైవేద్యం సిద్ధంగా లేకపోవడంతోపాటు వంటబ్రాహ్మణుడు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు.
సమయం దాటిపోతుండటంతో మరో బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించారు. హడావుడిగా సిద్ధం చేయడంవల్ల వేడిగా ఉన్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడికీఉడకని నైవేద్యాన్ని స్వామివారికి నివేదించారు. అప్పటికే నివేదన సమయం అరగంట ఆలస్యమైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆ వంట బ్రాహ్మణుడు ఇదేవిధంగా మద్యం మత్తులో విధులు నిర్వహించటంతో మెమో జారీ చేసినట్లు గోదాం పర్యవేక్షకుడు నర్సయ్య తెలిపారు.
ఆదాయం ఘనం.. కైంకర్యాలపై పట్టింపు కరువు
వేములవాడ రాజన్నకు భక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా శ్రీస్వామి వారికి పవిత్రంగా సమర్పించే నైవేద్యాన్ని సిద్ధం చేయడంలో అధికా రుల నిర్లక్ష్యంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. ఇదిలా ఉండగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శుక్రవా రం కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసా గాయి. ఆలయంలోని వివిధ విభాగాలపై ఫిర్యా దులు రావడంతో గురువారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు స్వామి వారి అన్నదానం, అకౌంట్స్ విభాగాల్లోని రికార్డులు పరిశీలించారు. రికార్డుల పరిశీలన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment