సాక్షి, రాజన్న సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రెండు కూటమిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర, మల్లర పనులు చేస్తూ 5 నెలల టైం పాస్ చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారు. పార్టీ కోసం కష్టపడిన గులాబీ సైకులకు వినయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది.
ఆ రెండు పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్‌ను దూషించడానికి పరిమితం అయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వీరి వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు
రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడబిడ్డలు తీవ్ర మనస్థాపంతో ఉన్నారు .కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు లేకనే.. మా పార్టీ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టింది. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీల్లా రెండు పార్టీల వ్యవహారముంది. డమ్మీ అభ్యర్హులను పెట్టీ రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు చేశాడు. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్ తెలపారు.
Comments
Please login to add a commentAdd a comment