
సాక్షి, వేములవాడ: ఉచ్ఛరించేందుకు ఇబ్బందిగా ఉన్న కులాల పేర్లు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం పూసల సంఘం రాష్ట్ర కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇబ్బందికరమైన కులాల పేర్లు మార్పు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చిస్తోందన్నారు. సంచార జాతుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటి కార్యకలాపాల నిర్వహణ కోసం జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.