సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం వేములవాడను మరో యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీకి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఏటా రూ.వంద కోట్లు చొప్పున రూ.400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తొలి విడతగా మంజూరైన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని వెచ్చించి వేములవాడ రాజన్న గుడి చెరువును పూడ్చిన అధికారులు తరువాత చేతులెత్తేశారు. ఇక ఆలయ అభివృద్ధి, పట్టణ రోడ్ల సమస్యతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన అనేక హమీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వేములవాడ పట్టణంతోపాటు మరో ఐదు గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి వేములవాడ దేవాలయ ప్రాంత అభివృద్ధి సంస్థ(వీటీడీఏ) కమిటీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వీటీడీఏ ఆధ్వర్యంలో వేములవాడ దేవాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పటికీ, అమలు చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేవాదాయ శాఖ నుంచి సరైన సహకారం అందడం లేదు. దాంతో వేములవాడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఒకపక్క యాదాద్రిలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతుండగా, వేములవాడ శైవక్షేత్రం అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది.
చెరువులోని నిర్మాణాల కూల్చివేతకు మోక్షమెప్పుడు?
వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా గుడి చెరువులోని దేవస్థానానికి సంబంధించిన నాలుగు కట్టడాలను తొలగించేందుకు అవసరమైన పనుల కోసం సాంకేతిక, పరిపాలనా అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత సంవత్సరం ఏప్రిల్ 9న అప్పటి కార్యనిర్వాహణాధికారి డి.రాజేశ్వర్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. గుడి చెరువు స్థలం 35 ఎకరాలను చదును చేయడంతోపాటు చెరువు చుట్టూ 150 అడుగుల వెడల్పుతో ట్యాంక్‌బండ్ వెడల్పు మొదలగు పనులు జరుగుతున్నందున చెరువులో ఉన్న కట్టడాలను తొలగించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
నిత్య కల్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపం, కల్యాణకట్ట, క్లోక్‌రూం, రెండు ఓపెన్ స్లాబ్‌హాల్స్, క్యూ కాంప్లెక్స్ హాల్స్, టాయ్‌లెట్ కాంప్లెక్స్‌లు చెరువు స్థలంలో పిల్లర్లతో నిర్మించి ఉన్నాయని, వాటిని తొలగించి ఇవ్వాలని వీటీడీఏ కోరిన నేపథ్యంలో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రూ.90 లక్షలు అవసరమవుతాయని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ వీటిని కూల్చేందుకు అనుమతులు మంజూరు చేయలేదు.
హైదరాబాద్ కేంద్రంగా వీటీడీఏ
హైదరాబాద్ కేంద్రంగా వీటీడీఏ కార్యకలాపాలు సాగుతుండడంతో స్థానికంగా ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఎప్పుడో ఓసారి వీటీడీఏ అధికారులు చుట్టపు చూపుగా వేములవాడకు వచ్చి సమీక్షలకే పరిమితం అవుతున్నారనే విమర్శలున్నాయి. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రోడ్లను వెడల్పు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా ముందుకు సాగడం లేదు. వీటీడీఏ, దేవాదాయ శాఖల మధ్య కుదరని సయోధ్యతో దుకాణ యజమానుల పరిహారం విషయంలో రోడ్ల వెడల్పు ముందుకు సాగలేదని ఆరోపణలు ఉన్నాయి.
మొదట జరిపిన సర్వేల ప్రకారం దుకాణదారులకు పరిహారాన్ని వెంటనే చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలంటూ దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు ఎటూ తేల్చకపోవడం వల్లనే రోడ్ల వెడల్పు నిలిచిపోయినట్లు తెలిసింది. వేములవాడ గుడి చెరువును 30 ఎకరాలు ప్రైవేటు స్థలాలు తీసుకుని అందులో చెరువును ఏర్పాటు చేయడానికి అంచనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని తెలిసింది.
ఆగని అంతస్తుల నిర్మాణం
వేములవాడ రాజన్న ఆలయానికి సమీపంలో బహుళ అంతస్తులు నిర్మించడానికి వీల్లేదు. ఆలయ గోపురం కంటే ఎత్తులో భవన నిర్మాణాలు ఉండరాదనేది దేవాలయ పట్టణాల్లో ఉన్న నిబంధన. వేములవాడను రూ.400 కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళికలో ఈ అంశం కూడా ఉంది. అలాగే రోడ్ల వెడల్పు కార్యక్రమం మొదలైతే రహదారులను ఆనుకొని ఉన్న భవనాలను కూడా కూల్చివేయవచ్చు. 2015 మే 18న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయానా వేములవాడ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆలయం, పట్టణ పరిసరాలతోపాటు నాంపల్లి ఆలయం కూడా సందర్శించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ గోపురం కంటే పట్టణంలో సమీపంలోని గృహాలు ఎత్తు ఉండకూడదంటూ వెంటనే వాటిని కూల్చివేయాలని సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. నామమాత్రంగా ఒక్క భవనాన్ని కూల్చివేసిన అధికారులు ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
మంజూరైనవి రూ.90 కోట్లు..ఖర్చు చేసింది ఎంతో?
వేములవాడ ఆలయానికి ప్రతి సంవత్సరం రూ.వంద కోట్లు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించగా... ఇప్పటి వరకు రూ.90 కోట్లు మాత్రమే మంజూరైనట్లు తెలిసింది. భూసేకరణ కోసం కొంత మొత్తం ఖర్చు చేసిన అధికారులు, ఆలయ అభివృద్ధి ప్రణాళికలు, ఇతర కార్యక్రమాల కోసం కొంత వెచ్చిం చినట్లు సమాచారం. కాగా చెరువు పూడ్చివేత పనులకు మిషన్ కాకతీయ ఫేజ్–2లో భాగంగానే వెచ్చిం చినట్లు తెలిసింది. చెరువు పూడ్చివేతతో నష్టపోయిన రైతులకు కూడా పరిహారం డబ్బులు చెల్లించినట్లు స మాచారం. ఇక ఆలయ అభివృద్ధికి మాత్రం ఎలాంటి ప్రత్యేక నిధులను ఇప్పటి వరకు మంజూరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment