ముగ్దూంపూర్‌లో రైతులతో మాట్లాడుతున్న కేసీఆర్
కరీంనగర్, సిరిసిల్లలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్
ముగ్దూంపూర్, బోయినపల్లి రైతులతో మాటామంతీ
సాగునీళ్లు అందకే పంటలు ఎండిపోయాయన్న రైతులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు.
అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment