సాక్షి, హైదరాబాద్: గత నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటనలు, మహారాష్ట్ర టూర్ షెడ్యూలుతో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల మూడో వారం నుంచి మళ్లీ క్షేత్ర స్థాయి పర్యటనలు మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల మూడో వారం నుంచి పాల్గొనే వరుస కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూలు సిద్ధమవుతోంది.
జిల్లా కలెక్టరేట్ సముదాయాలు, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల ప్రారంభంతో పాటు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. జూలైలో మరో ఐదు జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం జిల్లాల పర్య టన షెడ్యూలును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముందని సమాచారం. సీఎం పర్యటించే జిల్లాల జాబితాలో సూర్యాపేట, నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 15 తర్వాత సీఎం పర్యటన ఉండే అవకాశం ఉండగా, జిల్లా కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయంతో పాటు చనాకా–కొరాటా ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముందని చెపుతున్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ కలెక్టరేట్ సముదా యంతో పాటు మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. సూర్యాపేట లేదా కోదాడలో బస చేసి మరుసటి రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సభకు హాజరయ్యేలా సీఎం షెడ్యూలు ఉంటుందని తెలుస్తోంది. మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ సముదాయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, నెలాఖరు లోగా కేసీఆర్ ప్రారంభిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.
చదవండి: సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇతర జిల్లాల్లోనూ బహిరంగ సభలు
జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం లేని చోట కూడా బహిరంగ సభలు నిర్వహించే యోచనలో బీఆర్ ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాల సమా చారం. 2018 ఎన్నికల తర్వాత నారాయణపేట జిల్లాలో అడుగు పెట్టని సీఎం కేసీఆర్, ఈ జిల్లాలో త్వరలో పర్యటించే అవకాశముందని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు చెపుతున్నారు. గత నెలలో మహారాష్ట్రలోని నాగపూర్, సోలాపూర్‌లలో పర్యటించిన కేసీఆర్.. త్వరలో పుణే లేదా భివండీలో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో అక్కడా సభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పుణేలలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయా లను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి.
ఈ నెల 8తో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభ్య త్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూ లు కొలిక్కి రానుంది. ఇప్పటికే 20 లక్షల మంది బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నట్లు మహా రాష్ట్ర నేతలు వెల్లడించారు. సంస్థాగత కమిటీల శిక్షణ కార్యక్రమానికి ఈ నెల 20 తర్వాత మహారాష్ట్రలో సీఎం పర్యటించే అవకాశ ముంది. ఏడాది చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ నెల 18 లేదా 19న మంత్రులు, పార్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్, జిల్లా పరిషత్ చైర్మన్లతో సమావేశం ఉంటుందని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment