సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు. ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.
దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment