మళ్లీ పాత తెలంగాణ | KCR Aggressive Comments on Congress Govt: telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ పాత తెలంగాణ

Published Sat, Apr 6 2024 3:42 AM | Last Updated on Sat, Apr 6 2024 8:48 AM

KCR Aggressive Comments on Congress Govt: telangana - Sakshi

సిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌పల్లిలో ఓ రైతు పొలంలో ఎండిన వరి కంకులను పరిశీలిస్తున్న కేసీఆర్‌ 

మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు పునరావృతం 

కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫైర్‌ 

పరిపాలించే సామర్థ్యం, శక్తి, తెలివి లేకే కరెంటు, నీటి కొరత 

రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు 

20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు 

చనిపోయిన 209 మంది రైతుల వివరాలు సీఎస్‌కు పంపాం 

వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి 

ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కారు 

రుణమాఫీ, తులం బంగారం, పింఛన్లు, పంటల బోనస్‌ ఏమయ్యాయి? 

హామీలు నెరవేర్చేదాకా వదలిపెట్టం... ప్రభుత్వాన్ని వెంటాడతాం...

కేసీఆర్‌ బయల్దేరిండు..ఇక ఆగడు.. గద్ద లెక్క వాలుతా.. భరతం పడతా 

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టాలి 

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రెండు మూడురోజుల్లో స్పందిస్తానని వెల్లడి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్‌ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు.

రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ  వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్‌.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. 
    ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్‌ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్‌ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్‌లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్‌లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు.  

ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి 
వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్‌. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్‌ అన్నారు.    

నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. 
    ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్‌ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్‌ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్‌లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి  రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు.   

సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? 
    ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్‌ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్‌ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్‌ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చేనేతలు పులులై తరిమి కొడతరు 
    ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా  చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్‌లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత హెచ్చరించారు.  

మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం 
    ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్‌ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 

50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. 
    ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్‌ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్‌. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్‌. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్‌ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.  

రాజధానిలో ట్యాంకర్లా? 
    ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్‌. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్‌ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement