వికసిత్‌ భారత్‌ కాదు.. విఫల భారత్‌ | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ కాదు.. విఫల భారత్‌

Published Fri, May 10 2024 5:04 AM

KCR road show in Karimnagar

గత పదేళ్లలో మోదీ దేశానికి చేసిందేమీ లేదు

కరీంనగర్‌ రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

బీజేపీ ఎంపీలు విద్వేషాలు నింపడమే తప్ప రాష్ట్రానికి ఏమీ తేలేదు

కాంగ్రెస్‌వి 420 హామీలు.. నాలుగైదు నెలల్లో తెలంగాణ ఆగమైంది

కరెంటుకు ఏమైంది? నీళ్లెందుకు రావడం లేదని ప్రశ్న

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్న మోదీ.. దేశ్‌ కా సత్యనాశ్‌ చేసిండు. వికసిత భారత్‌ అంటూ దేశాన్ని విఫల భారత్‌గా చేసిండు..’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్‌ గురువారం కరీంనగర్‌లో రోడ్‌ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్‌ అన్నారు.. సచ్చేదిన్‌ వచ్చింది. అంతా గ్యాస్‌.. ట్రాష్‌..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్‌ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్‌. విదేశీ మారకాలు తగ్గినయ్‌.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు.

బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?
పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్‌కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్‌కుమార్‌ను పంపుదామా? ఆలోచించాలి.

మహిళలకు రూ.2,500 సాయం ఏది?
అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామ­న్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 

9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్‌ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement