మదినిండా రాజన్నా..
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక దారులన్నీ ఎములాడకే సాగుతున్నాయి. పిల్లాపాపలు, ముల్లెమూటలతో జనం తరలి వస్తున్నారు. సోమవారం రాత్రి వరకు రెండు లక్షల మందికిపైగా చేరుకున్నారు. నేడు జరిగే మహాశివరాత్రి వేడుకలకు మరో రెండు లక్షల మంది తరలివచ్చే అకాశముంది.
వేములవాడ అర్బన్ :కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు జరిగే జాతరకు ఈసారి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేశారు. సోమవారం రాత్రి వరకు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సులభ దర్శనాలకు వీలుగా ఈ మూడు రోజులు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. కోడె మొక్కులు యథావిధిగా చెల్లించుకోకునేందుకు అవకాశం కల్పించారు.
నేడు శివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6.05 గంటలకు స్వామి వారికి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ తెలిపారు. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయంలో పదకొండు మంది రుత్వికులతో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఉదయం 6.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ, 7.30 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు స్థానిక బ్రాహ్మణోత్తములు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలోనే గత 41 రోజులుగా దీక్ష చేపట్టి ఇరుముడులతో తరలిరానున్న శివస్వాములకు దర్శనాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. వీఐపీల దర్శనాలు, స్వామి వారి ఉత్సవాల సమయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
భక్తులకు తప్పని తిప్పలు..
ఆలయ అధికారులు రూ.80 లక్షలు వెచ్చించి ఏర్పాట్లు చేసినా భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వసతి గదులన్నీ అధికారులకు, వీఐపీలకు కేటాయించడంతో వచ్చిన భక్తులంతా చెట్లు, పందిళ్లు, మూలవాగు, జాతరగ్రౌండ్ ప్రాంతాలతోపాటు ఎక్కడ చోటు దొరికితే అక్కడే సేదతీరారు. ఆలయ వసతి గదుల ఎదుటే సామాన్య భక్తులు విడిది చేశారు. అక్కడే వంటావార్పులు చేశారు. ప్రైవేట్ వసతి గదులకు ఎక్కువ ధరలు వసూలు చేయడంతో భక్తులు ఇబ్బందులుపడ్డారు.
కట్టుదిట్టమైన భద్రత
జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈమేరకు పట్టమంలో 153 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1074 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బాంబ్‌స్వ్కాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శివకుమార్ ఇప్పటికే ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు.